Telugu Global
NEWS

వెతికి వెతికి డమ్మీ అభ్యర్థిని నిలబెడుతున్న టీఆర్‌ఎస్

ఎంఐఎం తమకు మిత్రపక్షమేనని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ముందే చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌… అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి టికెట్ విషయంలో టీఆర్‌ఎస్ అనుసరించిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎంఐఎం అభ్యంతరంతో ఏకంగా అభ్యర్థినే మార్చేశారు కేసీఆర్. స్నేహపూర్వక పోటీలో భాగంగా ఎంఐఎం సిట్టింగ్‌లు ఉన్న స్థానాల్లో టీఆర్‌ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాలని అనుకున్నారు. గతంలో 105 మంది అభ్యర్థుల జాబితాలో మునుకుంట్ల ఆనంద గౌడ్‌ పేరును నాంపల్లి అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. […]

వెతికి వెతికి డమ్మీ అభ్యర్థిని నిలబెడుతున్న టీఆర్‌ఎస్
X

ఎంఐఎం తమకు మిత్రపక్షమేనని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ముందే చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌… అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్ నాంపల్లి టికెట్ విషయంలో టీఆర్‌ఎస్ అనుసరించిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎంఐఎం అభ్యంతరంతో ఏకంగా అభ్యర్థినే మార్చేశారు కేసీఆర్. స్నేహపూర్వక పోటీలో భాగంగా ఎంఐఎం సిట్టింగ్‌లు ఉన్న స్థానాల్లో టీఆర్‌ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాలని అనుకున్నారు.

గతంలో 105 మంది అభ్యర్థుల జాబితాలో మునుకుంట్ల ఆనంద గౌడ్‌ పేరును నాంపల్లి అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. ఆనందగౌడ్‌ గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి చేతిలో కేవలం ఐదు ఓట్ల తేడాతో కౌన్సిలర్‌ కాకుండా ఓడిపోయారు.

ఇప్పుడు అదే వ్యక్తిని టీఆర్‌ఎస్ బరిలో దింపడంపై ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్నేహపూర్వక పోటీ అని చెప్పి కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓడిన వ్యక్తిని బరిలో దింపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. దీంతో కేసీఆర్‌ మనసు మార్చుకున్నారు.

గతంలో ప్రకటించిన అభ్యర్థులందరికీ బీపాంలు ఓకే చేసిన కేసీఆర్‌.. ఆనందగౌడ్‌ పేరును మాత్రం పక్కనపెట్టారు. ఎంఐఎం అభ్యంతరం నేపథ్యంలో రెండు రోజులుగా అన్వేషించి అదే పేరు ఉన్న మరో కార్యకర్తను తెరపైకి తెచ్చారు.

ఎంపీ ఆనందగౌడ్ స్థానంలో సీహెచ్‌ ఆనందగౌడ్ అనే కార్యకర్తను నాంపల్లి నుంచి బరిలో దింపేందుకు టీఆర్‌ఎస్ సిద్దమైంది. నాంపల్లి స్థానానికి ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బరిలో దిగుతుండగా… కాంగ్రెస్ నుంచి అదే వర్గానికి చెందిన ఫిరోజ్‌ ఖాన్‌ బరిలో దిగబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందని ఆనందగౌడ్‌ను టీఆర్‌ఎస్‌ బరిలో దింపి ఉంటే ఎంఐఎం తీవ్రంగా నష్టపోయేదని భావిస్తున్నారు. ఈ ఆలోచనతోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యంతరం తెలుపగా కేసీఆర్‌ సవరించుకున్నారు.

First Published:  12 Nov 2018 9:08 PM GMT
Next Story