Telugu Global
NEWS

ఆప‌రేష‌న్ గ‌రుడ.. నిజం చేశారా? శివాజీ మొద‌టి ముద్దాయి కాదా?

తెల్ల‌వారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో క‌ల వ‌స్తే అది నిజం అవుతుందంటారు… అదే క‌ల‌ను, క‌ల‌వ‌రింత‌ను, పురాణ ప‌ల‌వ‌రింత‌ను ప‌నిగ‌ట్టుకుని ప్రచారం చేస్తే దాన్ని క‌థ అంటారు… అది చెప్పింది చెప్పిన‌ట్టు జ‌రిగితే, జరిపిస్తే దాన్ని కుట్ర అని కూడా అంటారు…. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అలాంటి ప‌చ్చ పురాణ క‌థ‌ను వ్యూస్‌ పేప‌ర్లు, వ్యూస్‌ చానెళ్లలో చూసి ఏపీ జ‌నం త‌రిస్తున్నారు… పురాణ క‌థ‌లు విన‌డానికి ఇక గుడులు, గోపురాలకు వెళ్ల‌క్క‌ర్లేద‌ని, చాగంటి వారి అవ‌స‌రం కూడా లేద‌ని […]

ఆప‌రేష‌న్ గ‌రుడ.. నిజం చేశారా? శివాజీ మొద‌టి ముద్దాయి కాదా?
X

తెల్ల‌వారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో క‌ల వ‌స్తే అది నిజం అవుతుందంటారు… అదే క‌ల‌ను, క‌ల‌వ‌రింత‌ను, పురాణ ప‌ల‌వ‌రింత‌ను ప‌నిగ‌ట్టుకుని ప్రచారం చేస్తే దాన్ని క‌థ అంటారు… అది చెప్పింది చెప్పిన‌ట్టు జ‌రిగితే, జరిపిస్తే దాన్ని కుట్ర అని కూడా అంటారు…. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అలాంటి ప‌చ్చ పురాణ క‌థ‌ను వ్యూస్‌ పేప‌ర్లు, వ్యూస్‌ చానెళ్లలో చూసి ఏపీ జ‌నం త‌రిస్తున్నారు… పురాణ క‌థ‌లు విన‌డానికి ఇక గుడులు, గోపురాలకు వెళ్ల‌క్క‌ర్లేద‌ని, చాగంటి వారి అవ‌స‌రం కూడా లేద‌ని పిల్లాపెద్దా అంతా సంతోషిస్తున్నారు…. త‌మ ఇజాల‌నే నిజాలుగా రాసే పేప‌ర్లు, చానెళ్లు క‌మ్మ‌టి భ‌క్తితో గ‌రుడ పురాణాన్ని వినిపిస్తుంటే జ‌నం భ‌క్తి పార‌వ‌శ్యంతో త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. అయితే ఈ ఆంధ్ర మ‌హాభార‌తంలో, ఎన్నిక‌ల కురుక్షేత్రంలో….. కొన్ని ప్ర‌ధాన పేప‌ర్లు, మరికొన్ని డ‌ర్టీ చానెళ్లు, చెలిక‌త్తెల్లాంటి డిజిట‌ల్ చానెళ్లు, వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ బేబీస్…. అన్నీ క‌లిసి మాస్ మ‌సాలా వేసి గ‌రంగ‌రంగా గ‌రుడ పురాణాన్ని ర‌క్తి క‌ట్టిస్తున్నాయ‌ని, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని కొంద‌రు మేధావులు ఆవేదన చెందుతున్నారు. నాటి నిజం పురాణాల‌కు, నేటి ఇజం పురాణాల‌కు తేడా ఎలా ఉందో, ఉంటుందో వాళ్లు ఇలా చెప్ప‌దొడంగెను.

అప్పుడు సూత మ‌హాముని శౌన‌కాది రుషుల‌కు నైమిశార‌ణ్యంలో పురాణ క‌థ‌లు చెప్పిన‌ట్టు ఇప్పుడు ప‌చ్చ నాకు సాక్షిగా అంటూ ఏపీ సీఐడీ ఆఫీస‌ర్ శివాజీ అలియాస్ హాస్య న‌టుడు శివాజీకి క‌ల‌లోనో, ఇల‌లోనో గ‌రుడ పురాణం క‌నిపించింది, వినిపించింది… ఆయ‌న చెప్పిన ఆప‌రేష‌న్ గ‌రుడ ఇప్పుడు హోల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిధ్వ‌నిస్తోంది… సో, ఈ మ‌హానుభావుడు చెప్పిన‌ట్టు జ‌రిగింది, లేదా జ‌రిగేలా చూశారు, అధికారంలో ఉండే త‌థాస్తు దేవ‌త‌లు చేశారు కాబ‌ట్టి ఈయ‌న తెలుగుదేశానికి ఎంతో అమూల్య‌మైన‌ సేవ‌లు అందిస్తున్న‌ట్టు అర్థం చేసుకోవాలి… అపార్థం చేసుకోకూడ‌దు… ఇందుమూలంగా ఆంధ్ర‌దేశ‌పు యావ‌న్మంది ప్ర‌జానీకం, మేధావులు ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తోంది ఏమ‌న‌గా స‌దరు శివాజీ గారిని హోల్ ఏపీకి స్పెష‌ల్ సీఐడీ ఆఫీస‌ర్‌గా నియ‌మించాల‌ని వారు విన్న‌వించుకుంటున్నారు. క‌నిపించ‌ని ఈ నాల్గో సింహం శివాజీని సీఐడీ ఆఫీస‌ర్‌గా నియ‌మిస్తే రాష్ట్రంపై జ‌ర‌గ‌బోయే కుట్ర‌ల‌న్నీ ముందుగానే ఆయ‌న ప్ర‌భుత్వ‌నికి తెలియ‌జేస్తారు… సో, మ‌న‌కు ఇక వీర శివాజీ ఒక్క‌డు చాలు… ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి ఏపీలో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసేస్తే వేలాదిమంది పోలీసుల‌కు జీతాలు భ‌త్యాలు ఇవ్వ‌క్క‌ర్లేదు… ప్ర‌భుత్వానికి వంద‌ల కోట్ల ఖ‌ర్చు త‌గ్గుతుంది… సీఐడీ శివాజీ గారికి ఏపీ డీజీపీ పోస్ట్ ఇస్తే భేష్‌, శభాష్‌ అని చాలామంది మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు… కేంద్రం కుట్ర‌ల‌ను ఏపీ పోలీసులు క‌నిపెట్ట‌లేక‌పోతున్నారు, శివాజీ అయితే భ‌లే క‌నిపెడుతున్నాడ‌ని అంద‌రు ఆనందిస్తున్నారు.

కాస్త జాతీయ, అంత‌ర్జాతీయ రాజ‌కీయాలు తెలిసిన మేధావుల‌యితే….. ఛీ ఛీ ఆయ‌న‌కు డీజీపీ పోస్ట్ స‌రిపోదు…. ఏకంగా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు పోస్ట్ నుంచి అజిత్ దోవ‌ల్‌ని పీకేసి ఆ సీటులో ఆయ‌న‌ను కూర్చోపెట్టాలి అంటున్నారు….. మ‌న రాష్ట్రం మీద మోదీ కుట్ర‌లు చేసినా, మ‌న దేశం మీద‌, తెలుగుదేశం మీద పాకిస్తాన్‌, చైనాలు కుట్ర‌లు చేసినా ఈయ‌న ఇట్టే చెప్పెయ్య‌గ‌ల‌రు క‌దా….. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ మీద హ‌త్యా య‌త్నం గురించి ఎన్నో నెల‌ల ముందు ఇట్టే చెప్పేసిన శివాజీ ప్ర‌తిభా పాట‌వాల‌ను గుర్తించి ఆయ‌న‌కు స‌న్మానం చేయాల‌ని ఎంద‌రో కోరుతున్నారు… మ‌రికొంద‌రు ఇంకో అడుగు ముందుకేసి ఆయ‌న‌కు భార‌తర‌త్న ఇవ్వాల‌ని ప్ర‌తిపాదిస్తు న్నారు…. ఇంకొంద‌రు అభిమానులు ఆయ‌న‌ను ముద్దుగా జేమ్స్‌బాండ్ అని పిలుచుకుంటున్నారు… అయితే పాపం కొద్దిమంది మాత్రం ముందు ఈ శివాజీని సీబీఐ అదుపులోకి తీసుకుని నాలుగు త‌గిలిస్తే, గురుడు చెప్పే గ‌రుడ పురాణం వెన‌క ఉన్న ప‌చ్చ కుట్ర‌లు, మీడియా బాబులు, పొలిటిక‌ల్ బాబులు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని అంటున్నారు…. ముసుగులు ఊడి, లొసుగులు బ‌య‌ట‌ప‌డి ఎల్లో డ్రామా వెల్ల‌డి అవుతుంద‌ని బ‌ల‌హీన స్వ‌రంతో చెబుతున్నారు…. దీంతో వారిపై అంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు… నిప్పును మించిన నిప్పు, మా సీఐడీ ఆఫీస‌ర్ శివాజీ గారిని అనుమానిస్తారా, అవ‌మానిస్తారా అంటూ ఆగ్ర‌హంతో రంకెలు వేస్తున్నారు….. దీంతో మీ సీఐడీ ఆఫీస‌ర్ శివాజీ చెప్పే గ‌రుడ‌ పురాణంలో పాత్ర‌ల గురించి కాస్త వివ‌రిస్తాం వినండి, మేము చెప్పేది కాస్త వినండి అని వాళ్లు వేడుకుంటున్నారు… వాళ్లు చెప్పేది ఏంటంటే….వాళ్లు అడిగేది, బాబు స‌ర్కార్ కాల‌ర్ ప‌ట్టుకుని క‌డిగేది ఏంటంటే…

శివాజీ మంచి న‌టుడు… ఆయ‌న అభిమానించే ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌హా న‌టుడు అని రాజ‌కీయం బాగా తెలిసిన పెద్ద‌లు అంటుంటారు… ఆయ‌న గ‌తంలో 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీలో చేరి ఆ పార్టీ కోసం ప‌నిచేశారు… త‌ర్వాత బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌లో కొంద‌రితో స‌న్నిహిత సంబంధాలు పెట్టుకున్న‌ట్టు, వారి ద్వారానే త‌న‌కు ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి తెలిసింద‌ని గ‌రుడ పురాణ ప్ర‌వ‌చ‌నంలో భాగంగా ఆయ‌నే చెప్పారు… ఆయ‌న ఎల్లో ఏజెంట్ అని, చంద్ర‌బాబు కోవ‌ర్టు అని కాషాయ వ‌ర్గాలు భావిస్తాయి… ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు లేదా త‌రిమివేయ‌బ‌డ్డారు…ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం మోదీతో, బీజేపీతో యోధానుయోధుడిలా శివాజీ పోరాడుతుంటారు(ఇదంతా ప్ర‌తిప‌క్షానికి మైలేజ్ ద‌క్క‌కుండా చేయాల‌నే కుట్ర అంటారు కొంద‌రు). అయితే సినిమాకి, సినిమాకి షూటింగుల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన‌ట్టు మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఈయ‌న మాయం అయిపోతూ ఉంటారు…. మ‌ళ్లీ కొన్నాళ్ల త‌ర్వాత ఏపీ తెరపై మెరుస్తారు… హోదా సినిమా షూటింగ్ మ‌ళ్లీ బిగిన్ చేస్తారు… పాపం శివాజీ హీరోగా న‌టిస్తున్న ఈ ప్ర‌త్యేక హోదా సినిమా ఎప్ప‌టికీ పూర్తి కాదు, రిలీజ్ కాదు… ఆయ‌న అప్పుడ‌ప్పుడు అలా మాయ‌మ‌వుతూ, మ‌ళ్లీ కొన్ని నెల‌ల త‌ర్వాత ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ (చంద్ర‌బాబుకు అవ‌స‌రం అయిన‌ప్పుడు అని కొంద‌రు పొలిటికుల పెద్ద‌ల ఉవాచ) ఉంటారు…. అలా ఈయ‌న ఆయారామ్‌, గ‌యారామ్‌లా ప్ర‌త్యేక హోదా పోరాటం చేసి చేసి అల‌సిపోయిన‌ప్పుడు ఒక రోజు స‌డెన్‌గా ప్రెస్ మీట్ పెట్టి బోర్డు మీద మాట‌లు, గీత‌లు గీసి ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అస‌లు ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి శివాజీకి ఎలా తెలిసింది? శివాజీ చెప్పిన‌ట్టే ఇప్పుడు జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం ఎలా జ‌రిగింది? శివాజీ చెప్పింది నిజం చేయ‌డానికి, లేదా వాళ్లు ఆయ‌న చేత చెప్పించింది నిజం అవ‌డానికి ఆయ‌న అభిమాన అధికార‌ప‌క్షం చేసిన ప్ర‌య‌త్నంలో భాగ‌మేనా ఇదంతా? అని కొంద‌రు అనుమానిస్తున్నారు… స‌రే శివాజీకి ఎలాగోలా తెలిసింద నుకుందాం…ఆయ‌న‌కు ఎవ‌రో చెప్పార‌ని ఆయ‌నే చెప్పారుగా… ఆప‌రేష‌న్ గ‌రుడ‌, ఆప‌రేష‌న్ కుమార‌, ఆప‌రేష‌న్ రావ‌ణ‌…. ఇవ‌న్నీ క‌లిపి ఆప‌రేష‌న్ ద్రావిడాలో భాగ‌మట‌… పాపం పాకిస్తాన్‌, చైనా కూడా ఇండియా టార్గెట్‌గా ఇన్ని ఆప‌రేష‌న్లు చేయ‌లేవు… ఇది సినిమాగా తీస్తే బాహుబ‌లిని మించి ఆడుతుంద‌ని మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు… చంద్ర‌బాబు టార్గెట్‌గా కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర‌లు చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అల్ల‌క‌ల్లోలం సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ఆప‌రేష‌న్లు చేప‌ట్టింద‌ని తెలిసిన సీఐడీ ఆఫీస‌ర్ శివాజీ… బాధ్య‌త గ‌ల పౌరుడిగా ఏంచేయాలి? నిన్న‌నే ఆయ‌న అభిమాన రాజ‌కీయ నేత, మ‌హా న‌టుడు చంద్ర‌బాబు… ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు మీడియా సాక్షిగా సుద్దులుబుద్ధులు నేర్పారు… నీ మీద హ‌త్యా య‌త్నం జ‌రిగితే విమానం ఎక్కి ఇంటికి వెళ్లిపోతావా? పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి రిపోర్ట్ ఇవ్వ‌వా అని కోప్ప‌డ్డారు… ఆయ‌న చెప్పింది నిజ‌మే… మ‌రి బాధ్య‌త గ‌ల తెలుగుదేశ పౌరుడు, సీఐడీ ఆఫీస‌ర్ శ్రీమాన్ శివాజీ గారు ఏం చేయాలి? అచ్చం చంద్ర‌బాబు గారు చెప్పిన‌ట్టే వెళ్లి పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇవ్వాలి….దానికోసం ద‌గ్గ‌ర్లోనే ఉన్న తెలుగు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాలి… పాపం పోలీసులు బిజీగా ఉండి ప‌ట్టించుకోక‌పోతే, విసుక్కుంటే స‌ణుక్కుంటే శివాజీ గారు వెళ్లి ఏపీ డీజీపీ గారికి ఫిర్యాదు చేయాలి… ఆయ‌న కూడా ప‌ట్టించుకోక‌పోతే…. స‌ర్కార్ కార్య‌క్ర‌మాల క‌న్నా స్వామి కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ‌గా మునిగితేలుతున్నార‌న్న పేరు తెచ్చుకున్న ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుగారికి కంప్ల‌యింట్ ఇవ్వాలి.

అక్క‌డ కూడా ఎవ‌రు ప‌ట్టించుకోక‌పోతే ఇక ఏకంగా ఏపీ హోం మినిస్ట‌ర్ లేదా చీఫ్ మినిస్ట‌ర్ గారికి ఫిర్యాదు చేయాలి…. వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోతే హైకోర్టుకు వెళ్లి పిల్ వేసి, అయ్యా న్యాయ‌మూర్తి గారు మా ఏపీని అల్ల‌క‌ల్లోలం చేయ‌డానికి మోదీ కుట్ర‌లు ప‌న్నుతున్నాడు, ఆయ‌న‌పై మీరు సీబీఐ విచార‌ణ జ‌రిపించి త‌గు చ‌ర్య‌లు తీసుకోండి అని కోరాలి… త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆధారాలు స‌మ‌ర్పించాలి…. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల అపార అభిమానం ఉన్న స‌ద‌రు శివాజీ గారు ఈ ప‌నులు ఏవీ చేయ‌లేదు… ప్రెస్‌మీట్ పెట్టి అంద‌రిని ఇంప్రెస్, ప్ర‌త్య‌ర్థుల‌ను అప్రెస్ చేసి చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ఎవ‌రికి క‌నిపించ‌లేదు, వినిపించ‌లేదు… య‌థాప్ర‌కారం మాయ‌మైపోయి మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు? ఇది స‌మంజ‌స‌మేనా శివాజీ గారు? త‌మ‌రు రైటా, రాంగా?

క‌వులు చెబుతుంటారు… ప్ర‌పంచం బాధ శ్రీశ్రీ బాధ‌, దేవుల‌ప‌ల్లి బాధ ప్ర‌పంచం బాధ అని… అలాగే చంద్ర‌బాబు బాధ ఏపీ బాధ… ఈ సిద్ధాంతం ప్ర‌కారం ఆయ‌న శ‌త్రువులు ఏపీకి కూడా శ‌త్రువులు, విల‌న్లు కావాలి క‌దా…. అందుక‌ని చంద్ర‌బాబును వ్య‌తిరేకించే మోదీ, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌…. ముగ్గురి పాత్ర‌ల‌తో గ‌రుడ పురాణం త‌యారు చేసేస్తే స‌రి…… ఈ మూడు పాత్ర‌ల‌ను క‌లిపి కుట్టేసి క‌థ త‌యారు చేసి ఏపీకి వీళ్లే విల‌న్లు అనిపించేలా ఆప‌రేష‌న్ గ‌రుడ క‌థ‌ను అల్లేసి, దాన్ని నిజం చేసేందుకు జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం చేసేస్తే క‌థ కంచికి…. టీడీపీ మంచికి…. ఇదంతా బాగానే ఉంది కానీ, గ‌రుడ క‌థ‌ను బాగానే వండి వార్చి దాన్ని నిజం చేసేందుకు నిజంగానే దాడులు, హ‌త్యాయ‌త్నాలు చేస్తున్నార‌ని మేధావులే కాదు, మామూలు జ‌నం కూడా అనుమానిస్తున్నారు….అయితే నేర‌స్తుడు ఎంత తెలివి గ‌ల‌వాడ‌యినా కొన్ని త‌ప్పులు చేస్తాడ‌ని పోలీస్ స్టోరీస్ చెబుతుంటాయి… ఈ ఎపిసోడ్‌లో ఏపీని కేక్‌ని క‌ట్ చేసిన‌ట్టు క‌ట్ చేసి పారేసిన కాంగ్రెస్‌ని, సోనియాను మాత్రం ప‌ల్లెత్తు మాట అన‌డు శివాజీ మ‌హారాజ్‌… అదో చిత్రం, విచిత్రం… గ‌రుడ ముసుగుల వెన‌క లొసుగులు చాలానే ఉన్నాయి….ఇన్ని నేరాలు, ఘోరాలు జ‌రుగుతాయ‌ని తెలిసిన శివాజీ ఎవ‌రికీ కంప్ల‌యింట్ ఇవ్వ‌డు… చూశారా శివాజీ చెప్పిన‌ట్టే జ‌రుగుతున్నాయి అంటూ ఆశ్చ‌ర్యంగా, ఆనందంగా మాట్లాడే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా దీని మీద విచార‌ణ‌కు ఆదేశించ‌రు. ఇది ఇంకా విడ్డూరం… శివాజీ చెప్పిన‌ట్టు జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది…. ఇలాంట‌ప్పుడు సాధార‌ణంగా పోలీసులు ఏంచేస్తారు… నాకు ముందే తెలుస‌న్న‌ శివాజీని తీసుకొచ్చి బొక్క‌లో ప‌డేసి నాలుగు కుళ్ల‌బొడుస్తారు… నీకెలా తెలిసింది అని చిత‌గ్గొట్టి మ‌రీ అడుగుతారు… పాపం పోలీసు అధికారులు ఆ ప‌ని చేయ‌లేక పోతున్నారు…. శివాజీ ఏమో కంప్ల‌యింట్ ఇవ్వ‌లేక‌పోతున్నాడు… ఇక సీఎం చంద్ర‌బాబు గారు దీనిపై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి చేత విచార‌ణ‌కు ఆదేశించ‌వ‌చ్చు క‌దా….లేదా సీబీఐ ఎంక్వ‌యిరీ కోర‌వ‌చ్చు… ఆయ‌న కూడా పాపం ఏం చేయ‌లేక‌పోతున్నారు… ఇవేవి జ‌ర‌గ‌ట్లేదు అంటే ఇదంతా తెలుగు డ్రామా పార్టీ ఆడిస్తున్న నాట‌కం కాదా అని జ‌నం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

సో, జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం ముందే తెలిసినా పోలీసుల‌కు చెప్ప‌నందుకు, ఆధారాలు స‌మ‌ర్పించ‌నందుకు ఈ కేసులో శివాజీ మొద‌టి ముద్దాయి అవుతాడు…. శివాజీ చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది అని చెప్పిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు…. సీబీఐ ఎంక్వైరీ కోర‌నందుకు, విచార‌ణ జ‌రిపించ‌నందుకు ఆయ‌న రెండో ముద్దాయి అవుతాడు… అస‌లు ఇంత‌వ‌ర‌కు శివాజీని అదుపులోకి తీసుకుని విచారించనందుకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ కేసులో మూడో ముద్దాయి అవుతాడు…. మ‌న ఘ‌న జ‌న ధ‌న సీఎం చంద్ర‌న్న నిన్న చెప్పిన త‌న నీతి సూక్తి ముక్తావళిలో, రాజ‌కీయ ర‌త్నావ‌ళిలో కొన్ని ఆణిముత్యాల్లాంటి స‌త్యాలు చెప్పారు…. హ‌త్యాయ‌త్నం జ‌రిగితే జ‌గ‌న్ హైద‌రాబాద్‌కు ఎందుకు వెళ్లారు, పోలీస్ కంప్ల‌యింట్ ఎందుకు ఇవ్వ‌లేక‌పోయారు? ఇది మెడికో లీగ‌ల్ కేసు కాదా? అని సూటిగా ప్ర‌శ్నించారు… అలిపిరి దాడి స‌మ‌యంలో ఆయ‌న హాస్పిట‌ల్‌కు వెళ్లారో లేక పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారో గుర్తు తెచ్చుకుంటే మంచిది… మ‌రి ఇన్ని విష‌యాలు ఇంత కూలంక‌షంగా తెలిసిన సీఎంగారు, శివాజీని వెంట‌నే అదుపులోకి తీసుకుని ఎందుకు విచారించ‌డం లేదు? అస‌లు త‌ను చెప్పిన గ‌రుడ పురాణం క‌థ నిజం చేయ‌డానికి శివాజీనే జ‌గ‌న్ మీద దాడి చేయించి ఉండ‌వ‌చ్చుగా? శివాజీ వెన‌క ఉన్న మీడియా బాస్ ఎవ‌రు? పొలిటిక‌ల్ బిగ్‌బాస్ ఎవ‌రు? శివాజీని విచారిస్తే కుట్ర కోణం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుందిగా? అప్పుడు మ‌న నిప్పు సీఎం గారు, మోదీపై కేసులు పెట్ట‌వ‌చ్చుగా, విచార‌ణ జ‌రిపించ‌వ‌చ్చుగా, మోదీని అరెస్టు చేయించ‌వ‌చ్చు క‌దా….ప్ర‌ధానమంత్రి ఏమైనా చ‌ట్టానికి అతీతుడా? ఆ ప‌ని ఎందుకు చేయ‌లేక‌పోతున్నారు బాబుగారు? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అల్ల‌క‌ల్లోలం చేయ‌డానికి మోదీ కుట్ర పన్నాడు అని మీరు, మీ సీఐడీ ఆఫీస‌ర్ శివాజీ గారు క‌నిపెట్టేసిన‌ప్పుడు మోదీ మీద విచార‌ణ‌కు ఆదేశించ‌వ‌చ్చు క‌దా….లేక‌పోతే ప్ర‌ధానిని ప్రాసిక్యూట్ చేయాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేయ‌వ‌చ్చు క‌దా… జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ని అడ్డం పెట్టుకుని మోదీ చేయిస్తున్నాడు అని అరుపులు కేక‌లు ఎందుకు, కేసు పెట్ట‌చ్చుగా? చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకోవ‌చ్చుగా? ఇవేవి చేయ‌ట్లేదంటే మోదీని తిట్టేది మీరే, కాపాడేది మీరే అంటున్నారు హోల్ ఏపీ జ‌నం.

ముఖ్య‌మంత్రి గారు ఇవ‌న్నీ చేయ‌కుండా మీరు ఎన్ని చెప్పినా జ‌నానికి డ్రామాలు ఆడుతున్న‌ట్టే క‌నిపిస్తుంది…. దొంగే, దొంగ దొంగ అని అరిచిన‌ట్టు ఉంటుంది… ఇక విశాఖ ఏర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుంది… ఏపీ పోలీసుల‌ను లోప‌ల‌కు రానివ్వ‌రు అని చెబుతున్నారు చంద్ర‌బాబు… మ‌రి గ‌తంలో ప్ర‌త్యేక హోదా పోరాటానికి విశాఖ వ‌చ్చిన జ‌గ‌న్‌ను విమానం దిగ‌గానే ర‌న్‌వే మీదే నిర్బంధించి అట్నుంచి అటే మ‌రో విమానంలో హైద‌రాబాద్‌కు పంపేశారు ఏపీ పోలీసులు… క‌నీసం విశాఖ న‌గ‌రంలోకి అడుగు కూడా పెట్ట‌నివ్వ‌లేదు…. అప్పుడేమో ఏపీ పోలీసులు ఏర్‌పోర్టులోకి రాగ‌లరు ఇప్పుడు మాత్రం రాలేరుట‌… ఎందుకంటే దాడి చేస్తార‌ని ముందే తెలుసుకాబ‌ట్టే రాలేక‌పోయార‌ని అర్థం చేసుకోవాలేమో! ఆప‌రేష‌న్ గ‌రుడ ఇంకా కంటిన్యూ అయ్యేలా ఉంది కాబ‌ట్టి నెక్ట్స్ టార్గెట్ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అవుతారేమో? ఆయ‌న ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తే భూకంపం పుడుతుంద‌ని, బీహార్‌, ఒడిశా, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, అప్ఘ‌నిస్తాన్‌ల నుంచి రౌడీ మూక‌లు వ‌చ్చి అల్ల‌ర్లు చేస్తాయ‌ని చెప్పారు కాబ‌ట్టి ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి… లేక‌పోతే ఏ నిమిషానికి ఏమి జ‌రుగుతుందో తెలియ‌దు… అది తెలిసిన శివాజీ మాత్రం పెద‌వి విప్ప‌రు…. ఆయ‌న‌ను ప్ర‌భుత్వ‌మూ ప్ర‌శ్నించ‌దు, పోలీసులూ ప్ర‌శ్నించ‌రు.

ఇక ఏర్‌పోర్టులో జ‌గ‌న్‌పై దాడి చేసిన శ్రీనివాస‌రావు ప‌నిచేసిన హోట‌ల్ య‌జ‌మాని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ టీడీపీ నేత‌…. ఆయ‌న‌ను కూడా పోలీసులు ఆదివారం దాకా ప్ర‌శ్నించ‌కపోవ‌డం ఇంకా విచిత్రం… అంటే నేరం జ‌ర‌గ‌క‌ముందే పోలీసుల‌కు అన్ని వివ‌రాలు తెలిసిపోయాయేమో మ‌రి! ఇది ఆన్‌లైన్ రాజ్యం క‌దా… రాజ‌ధాని కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది గ్రాఫిక్స్ రూపంలో… ఏలిన‌వారికి అన్నీ ఆన్‌లైన్‌లోనే తెలిసిపోతుంటాయేమో! అంతేకాదు ఏపీలో జ‌రుగుతున్న ల‌క్ష‌ల కోట్ల అవినీతి, దోపిడీని గురించి శివాజీ అనే బాధ్య‌త గ‌ల పౌరుడు ఏ రోజూ మాట్లాడ‌డ‌డు కానీ కుట్ర‌ల గురించి మాత్రం కుండ‌బ‌ద్ద‌లు కొడ‌తాడు… ఇక జ‌గ‌న్‌పై ఆయ‌న అభిమానే దాడి చేశాట్ట‌… అస‌లు తాను అభిమానించే నేత‌పైన ఎవ‌డైనా అభిమాని దాడి చేస్తాడా? పాపం ఆ అభిమాని జ‌గ‌న్‌పై త‌న అభిమానం చెప్పుకోలేక‌, దాచుకో లేఖ అంటూ ఓ లెట‌ర్ రాసి జేబులో పెట్టుకున్నాట్ట‌… అది పోలీసులకు దొర‌క‌ లేఖ దొరికిందిట‌… అందులో ర‌క‌ర‌కాల రాత‌లు ఉన్నాయి…కుట్ర‌దారులు త‌లో చేయి వేస్తే లేఖ‌లో రాత‌ల‌కు బ‌దులు ర‌క‌ర‌కాల రోతలే క‌నిపిస్తాయి…ఇవి మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తున్నాయి… హ‌త్యా య‌త్నం జ‌రిగిన కాసేప‌టికే నిందితుడు వైసీపీ అభిమాని అని విచార‌ణ పూర్తి కాకుండానే డీజీపీ చెప్ప‌డం, త‌ర్వాత బాబుగారు కూడా బ‌ల్ల గుద్ది అదే చెప్ప‌డం అనుమానాల ఆజ్యంలో మ‌రింత పెట్రోల్ పోసిన‌ట్టు అయింది…అయితే శ్రీనివాస్ అన్న తాము టీడీపీ మ‌ద్ద‌తుదారులం అని ఓ న్యూస్ చానెల్ సాక్షిగా మైక్‌లో చెప్ప‌డంతో పోలీసుల ప‌రువు గంగ‌లో క‌లిసింది… దీంతో మ‌నం గ‌రుడ పురాణంతో పాటు పోలీసుల పురాణాలు కూడా వినాల్సి వ‌స్తోంది… ఇలా అంద‌రు పురాణాలు చెప్ప‌డం మొద‌లుపెడితే పండితుల‌కు ఉపాధి క‌రువ‌య్యే ప్ర‌మాదం ఉంది. జ‌నం కూడా అస‌లు పురాణాలు మ‌ర్చిపోయి వీటినే నిజ‌మ‌నుకునే పరిస్థితి, దుస్థితి దాపురించే అవ‌కాశం ఉంది.

ఇక గ‌రుడ పురాణంలో జగ‌న్ ఫ్లెక్సీతో నిందితుడు దిగిన ఫొటో…. ఇది మ్యాచ్‌ఫిక్సింగ్ కాదు… మ్యాచ్‌ఫ్లెక్సింగ్‌… ఫొటోషాప్ చేసి ఫ్లెక్సీలో గ‌ద్ద బొమ్మ త‌గిలించి జ‌గ‌న్‌తో పాటు నిందితుడు శ్రీనివాస్‌ని కూడా పెట్టేశారు…. అస‌లు వైసీపీ ఫ్లెక్సీల్లో గ‌ద్ద బొమ్మ‌లు ఉండ‌వు… ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు బ‌లం చేకూర్చ‌డానికి ఎల్లో గ‌ద్ద‌లు, పెద్ద‌లు ఇలా అతి తెలివి స్టెప్ వేసిన‌ట్టున్నారు….ఇక ప‌నిలో ప‌నిగా సీబీఐని కూడా బాబు గారు ఏకిపారేశారు… అయితే జ‌గ‌న్‌పై కేసులు పెట్టిన‌ప్పుడేమో సీబీఐ మంచిది, ఇప్పుడు చెడ్డ‌ది అయిపోయింది… త‌న కేసులు, సూట్‌కేసులు సీబీఐ త‌వ్వుతుందేమో అనే భ‌యం, కాంగ్రెస్‌తో సావాసం, చేతితో చెలిమి బాబులో కొత్త మార్పుకు కార‌ణంలా ఉన్నాయి… స‌త్య‌హ‌రిశ్చంద్రుడి మ‌న‌మ‌డు శివాజీ చెప్పే స‌త్యాలకు బోలెడు హాచ్చ‌ర్య‌పోతున్న చంద్ర‌బాబు, అవి త‌న‌కు కూడా ముందే తెలుసంటున్నారు… అయితే ఇది మీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం కాదా అని జనం ప్ర‌శ్నిస్తున్నారు… ఇక ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఏవోబీని, ఏపీని మ‌ర్చిపోయి మందీమార్బ‌లంతో హైద‌రాబాద్‌లో మ‌కాం వేసి స‌ర్కార్ కార్య‌క్ర‌మాల‌ను మ‌ర్చిపోయి స్వామి కార్యాల‌లో త‌రిస్తున్నారు… ఈ వైఫ‌ల్య పాపంలో ఆయ‌న‌కు కూడా ఓ పిడికెడు ప‌డేస్తే బాగుంటుంది! ఇదంతా చూస్తున్న ఓ పెద్దాయ‌న అస‌లు ఏపీ పోలీసులకు ఎల్లో యూనిఫామ్ పెడితే బాగుంటుంద‌ని జోకేశారు…. వాళ్ల‌కు ప‌చ్చ ప్యాంటు, ప‌చ్చ ష‌ర్టు బాగానే ఉంటాయ‌ని జ‌నం కూడా అనుకుంటున్నారుట‌.

ఇక డీజీపీని గ‌వ‌ర్న‌ర్ నివేదిక కోరితే చంద్ర‌బాబు ఎందుకు ఉలిక్కిప‌డుతున్నారు? దేశానికి రాష్ట్ర‌ప‌తి ప్ర‌థ‌మ పౌరుడు అయితే రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌థ‌మ పౌరుడు…. అంతే కాదు రాష్ట్ర పోలీసుల‌కు గ‌వ‌ర్న‌రే బాస్‌… ఆయ‌న నివేదిక అడ‌గక‌పోతే త‌ప్పు కానీ అడిగితే త‌ప్పు కాదు… పాపం నిప్పుకు ఈ విష‌యం కూడా తెలియ‌క‌పోవ‌డం విడ్డూరం… అంతేకాదు ఈ ఘోరాన్ని ఖండించిన బీజేపీని, ప‌వ‌న్‌ని, కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, క‌మ్యూనిస్టుల‌ను విమ‌ర్శించిన చంద్ర‌బాబు కాంగ్రెస్‌ను ప‌ల్లెత్తు మాట అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం…. ఇంకా పెద్ద కామెడీ, జ‌బ‌ర్ద‌స్త్‌ని మించిన జోక్ ఏంటంటే ప్ర‌త్యేక హోదా అడుగుతున్నందుకు చంద్ర‌బాబు మీద క‌క్ష క‌ట్టి మోదీ దాడులు చేయిస్తున్నాట్ట‌…. ప్ర‌త్యేక హోదా ఏమైనా సంజీవ‌నా? అది ఉన్న ఈశాన్య రాష్ట్రాలు బాగుప‌డ్డాయా? హోదా వేస్టు, ప్యాకేజీ బెస్టు అని పలు సంద‌ర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత నాలుక‌ను మడ‌త‌కాజాలా మ‌డ‌తేసి తానే హోదాను యోధుడిని అని చెప్పుకోవ‌డం చూసి జ‌నం నోటితో న‌వ్వ‌ట్లేదు… అస‌లు హోదా కోసం పోరాడిన‌వాళ్లు ఏపీలో ఎవ‌రైనా ఉన్నారంటే అది జ‌గ‌న్ ఒక్క‌రే.. ఆయ‌న, ఆయ‌న పార్టీ గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా హోదా కోసం పోరాడారు.

ఇక అన్నింటికంటే ఇంపార్టెంట్ విష‌యం ఏంటంటే ఈ హ‌త్యా య‌త్నానికి విశాఖ ఏర్‌పోర్టునే ఎందుకు ఎంచుకున్నారు? అక్క‌డ దాడి చేస్తే కేంద్ర ప్ర‌భుత్వంపై నెట్టివేయ‌చ్చ‌నే ఉద్దేశంతోనే ఇలా చేశారా? అదే బ‌య‌ట ప‌బ్లిక్‌ప్లేస్‌లో అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది… అదే ఏర్‌పోర్టులో ఘ‌ట‌న జ‌రిగితే కేంద్రం మీద తోసెయ్య‌చ్చు… వారెవ్వా ఏమి కుట్ర‌! ఇక చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో అనేక కుట్ర‌లుకుహ‌కాలు దాగి ఉన్నాయంటారు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు… బెజ‌వాడ న‌డిబొడ్డున వంగ‌వీటి మోహ‌న‌రంగాను హ‌త్య చేయించింది చంద్ర‌బాబే అని అప్పట్లో టీడీపీలో మంత్రిగా ప‌నిచేసిన చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య త‌న పుస్త‌కంలో స్వ‌యంగా రాసుకున్నారు… అంతేకాదు జ‌ర్న‌లిస్టుల జాతికే గ‌ర్వ‌కార‌ణం, నిప్పుర‌వ్వ‌లా జ్వ‌లించి త‌న క‌లంతో, గ‌ళంతో, అగ్నిగోళాల్లాంటి త‌న అక్ష‌రాల‌తో అప్ప‌టి టీడీపీ పెద్ద‌లు, గ‌ద్ద‌ల‌లో క‌ల‌క‌లం, క‌ల‌వ‌రం రేపిన నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్టు పింగ‌ళి ద‌శ‌ర‌థ‌రామ్‌ను విజ‌య‌వాడ న‌డిరోడ్డు మీద దారుణంగా హ‌త్య చేయించింది కూడా చంద్ర‌బాబు అని ఆరోప‌ణ‌లు ఉన్నాయి… అదే బెజ‌వాడ‌లో ఐఏఎస్ అధికారి రాఘ‌వేంద్ర‌రావుని యాక్సిడెంట్ రూపంలో చంపించార‌నే ఆరోప‌ణ‌లు కూడా బాబుపై ఉన్నాయంటారు…. ఇక మ‌ల్లెల బాబ్జీ ఉదంతం గురించి ఏ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టును అడిగినా క‌థ‌లుక‌థ‌లుగా చెబుతారు… 80వ ద‌శ‌కంలో బ‌హిరంగ స‌భ సాక్షిగా ఎన్టీఆర్‌పై హ‌త్యా య‌త్నం చేసిన మ‌ల్లెల బాబ్జీ ఆ త‌ర్వాత అనుమానాస్ప‌ద స్థితిలో చనిపోయాడు… టీడీపీకి సింప‌తీ పెంచ‌డానికి చంద్ర‌బాబే అప్ప‌ట్లో ఇలా చేయించాడ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి… చంద్ర‌బాబు కుట్ర‌ల్లో ఎప్పుడూ ద‌ళితులే ఆయుధంగా మారి ఆహుతి అవుతార‌ని సీనియ‌ర్ పొలిటీషియ‌న్స్ చెబుతుంటారు…బాబు రాజ‌కీయంలో బ‌డుగులే బ‌లిప‌శువుల‌వుతార‌ని, కుట్ర‌ల య‌జ్ఞంలో స‌మిధ‌ల‌వుతార‌ని రాజ‌కీయ‌, మీడియా వ‌ర్గాలు భావిస్తుంటాయి… మ‌ల్లెల బాబ్జీ నుంచి శ్రీనివాస‌రావు దాకా ఇదే క‌థ‌…. జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం కేసులో ఆయుధం శ్రీనివాస‌రావే… మ‌రి ఆయుధం ప‌ట్టిన చేతులు ఏ బాబుల‌వి? ఇక చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల ఎదురుదాడి చూస్తుంటే అస‌లు హ‌త్యా య‌త్నం జ‌రిగింది జ‌గ‌న్‌పైనా లేక చంద్ర‌బాబుపైనా అని జ‌నం చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది… దొంగే, దొంగ దొంగ అని అరిస్తే అయిపోతుంది క‌దా… ఇక ఎవ‌రిని ప‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

జ‌గ‌న్ మీద హ‌త్యా య‌త్నం జ‌రిగాక చంద్ర‌బాబు మాట్లాడిన తీరు చూస్తే ఏపీ జ‌నానికి రోత పుడుతోంది… అదంతా డ్రామా అన్న‌ట్టు మాట్లాడ‌డం, కేంద్రం చేయించింది అన‌డం, హేళ‌న చేయ‌డం, వెకిలిగా న‌వ్వుతూ మాట్లాడ‌డం…. నిండు చంద్రుడిలో ఇన్నివికృత కోణాలు చూసిన ఏపీ జ‌నం అవాక్క‌యిపోతున్నారు…. మ‌రోవైపు త‌న‌పై దాడి జ‌రిగినా జ‌గ‌న్ ఎంతో హుందాగా ప్ర‌వ‌ర్తించారు… ఆయ‌న ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు, జ‌నాన్ని రెచ్చ‌గొట్ట‌లేదు, సానుభూతితో ఓట్లు రాల్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు… ప‌దేళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న యువ‌నేత ముందు 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఓడిపోయి త‌ల‌దించుకోవ‌డం ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా చూశారు… జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం, ఆ త‌ర్వాత ఎదురుదాడి రూపంలో టీడీపీ బెదురుదాడి ఇదంతా చూస్తుంటే క‌చ్చితంగా చాలా పెద్ద కుట్ర, పెద్ద త‌ల‌కాయ‌లు దీనివెన‌క ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది… ఇది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైఫ‌ల్యం… చంద్ర‌బాబు రాజీనామా చేయాల‌ని జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చి అర‌వ‌క‌పోయినా మ‌న‌సుల్లో అనుకుంటున్నారు… ఇంకా ఎన్నో ప్ర‌శ్న‌లు ఉన్నాయి….కేసును త‌వ్వేకొద్దీ పుడుతూనే ఉంటాయి… ఈ ప్ర‌శ్నలు అడ‌గ‌డానికి లాయ‌ర్లు, లాజిక్కులు అవ‌స‌రం లేదు… కామ‌న్‌సెన్స్ ఉన్న ప్ర‌తి కామ‌న్‌మేన్ అడుగుతున్నాడు…. అంతేకాదు ఇదంతా చూస్తుంటే మోదీని, బీజేపీని అడ్డం పెట్టుకుని చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తూ ఒకే దెబ్బ‌కు మూడు పిట్ట‌లు కొడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది అంటున్నారు మేధావులు.

– కౌండిన్య‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

First Published:  28 Oct 2018 1:13 AM GMT
Next Story