Telugu Global
NEWS

ఆంధ్రులకు చంద్రబాబు ఒక శని

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ప్రశాంతంగా బతుకుతున్న ఆంధ్రాప్రజలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 70 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతానికి వచ్చిన వారిని కూడా ఆంధ్రా వాళ్ళు అని ఎందుకు అంటాం అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మిత్రులు గర్వంగా తాము హైదరాబాదీలం, తెలంగాణవారం అని చెప్పుకోవాలని కేసీఆర్ సూచించారు. నాలుగేళ్లుగా ఒక్కసారైనా ఆంధ్రా వాళ్లు ఇబ్బంది పడ్డారా? అని […]

ఆంధ్రులకు చంద్రబాబు ఒక శని
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ప్రశాంతంగా బతుకుతున్న ఆంధ్రాప్రజలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 70 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతానికి వచ్చిన వారిని కూడా ఆంధ్రా వాళ్ళు అని ఎందుకు అంటాం అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మిత్రులు గర్వంగా తాము హైదరాబాదీలం, తెలంగాణవారం అని చెప్పుకోవాలని కేసీఆర్ సూచించారు.

నాలుగేళ్లుగా ఒక్కసారైనా ఆంధ్రా వాళ్లు ఇబ్బంది పడ్డారా? అని నిలదీశారు. ఇదే చంద్రబాబు అండ్ గ్యాంగ్‌… 2014 ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావాళ్ల ఆస్తులు లాక్కుంటారు.. కొడుతారు, తరిమికొడుతారు అంటూ అపోహలు సృష్టించారన్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఎక్కడైనా అలాంటివి జరిగాయా అని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఉడుములా వచ్చి ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు అని మండిపడ్డారు.

తమ పాలనలో ఎక్కడైనా ఆంధ్రావాళ్లు, తెలంగాణవాళ్లు అన్న భేదం చూపించామా అని నిలదీశారు కేసీఆర్. చంద్రబాబు చిల్లర రాజకీయాల కోసం మళ్లీ ఇక్కడికి వచ్చి కొరివి పెట్టాలనుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు రాజ్యమేలడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీకి అసలు డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పారిపోయినా ఇంకా చంద్రబాబుకు సిగ్గు రాలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలోకి వచ్చి రాజకీయం చేస్తాడా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రొద్దున లేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అక్కడి సామాన్యులే రోజూ టీవీల ముందుకొచ్చి చెబుతున్నది నిజం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. అక్కడ చక్కగా పాలించడం చేతగాని చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చేస్తారా అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఎన్నిసార్లు కర్ఫ్యూలు, ఘర్షణలు జరిగాయో గుర్తు లేదా అన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన పేకాట క్లబ్బులు, జూదాలు, భూముల కబ్జాలు పోయాయని…. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు. ఆంధ్రావాళ్లకు చంద్రబాబు ఒక శని లాంటివాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు చేతులు కాల్చుకున్నాడన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అంతకంటే దారుణంగా టీడీపీకి ఫలితాలుంటాయన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగియగానే ఆంధ్రవాళ్లు కాంగ్రెస్‌ను మోసం చేశారని వ్యాఖ్యానించిన వ్యక్తి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ తెలంగాణలో బస్మం అయిపోవడం ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఐదారు జిల్లాల్లో వందశాతం సీట్లను టీఆర్‌ఎస్ గెలుచుకోబోతోందన్నారు. రాహుల్‌ గాంధీ సభ అంటే తామెందుకు భయపడుతామని ఎద్దేవా చేశారు. దమ్ముంది కాబట్టే ముందస్తు ఎన్నికలకు వెళ్ళామన్నారు.

First Published:  16 Oct 2018 11:19 PM GMT
Next Story