Telugu Global
NEWS

పార్టీలు మారడంలో రికార్డు సృష్టిస్తున్న కాకా కుమారులు

తెలంగాణ ఎన్నికల వేళ జంపింగ్‌లు మొదలయ్యాయి. పోటీకి అవకాశం వస్తే ఒకలా లేదంటే మరోలా నేతలు రంగులు మారుస్తున్నారు. పార్టీల సంఖ్య పెరిగడంతో ఈ వెసులుబాటును వాడుకుంటూ టికెట్‌ ఇవ్వని పార్టీకి గుడ్‌బై చెప్పేసి కొత్త పార్టీ పంచన చేరిపోతున్నారు. తెలంగాణ దివంగత సీనియర్‌ నేత వెంకటస్వామి కుమారులు ఈ విషయంలో మరింత చురుగ్గా పావులు కదుపుతున్నారు. నాలుగేళ్ల కాలంలోనే నాలుగు సార్లు జంప్‌ చేసేశారు. ఇప్పుడు మరో జంప్‌కు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌లో ఆశించిన టికెట్ రాకపోవడంతో […]

పార్టీలు మారడంలో రికార్డు సృష్టిస్తున్న కాకా కుమారులు
X

తెలంగాణ ఎన్నికల వేళ జంపింగ్‌లు మొదలయ్యాయి. పోటీకి అవకాశం వస్తే ఒకలా లేదంటే మరోలా నేతలు రంగులు మారుస్తున్నారు. పార్టీల సంఖ్య పెరిగడంతో ఈ వెసులుబాటును వాడుకుంటూ టికెట్‌ ఇవ్వని పార్టీకి గుడ్‌బై చెప్పేసి కొత్త పార్టీ పంచన చేరిపోతున్నారు. తెలంగాణ దివంగత సీనియర్‌ నేత వెంకటస్వామి కుమారులు ఈ విషయంలో మరింత చురుగ్గా పావులు కదుపుతున్నారు. నాలుగేళ్ల కాలంలోనే నాలుగు సార్లు జంప్‌ చేసేశారు. ఇప్పుడు మరో జంప్‌కు సిద్ధమవుతున్నారు.

టీఆర్‌ఎస్‌లో ఆశించిన టికెట్ రాకపోవడంతో వెంకటస్వామి కుమారుడు వినోద్ ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈనెల 20న బైంసాలో జరిగే రాహుల్ బహిరంగసభలో ఆయన పార్టీ మారబోతున్నారు. అయితే వినోద్‌తో పాటు వివేక్‌ కూడా పార్టీ మారుతారా? అన్న దానిపై క్లారిటీ లేదు. వెంకటస్వామి కుమారులు పార్టీ మారడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్‌లో ఉన్న వివేక్‌ సోదరులు 2013 జూన్‌ 2న టీఆర్ఎస్‌లో చేరారు.

తెలంగాణ సాధన కేసీఆర్‌తోనే సాధ్యమని అందుకే పార్టీ మారినట్టు అప్పట్లో చెప్పారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. వివేక్ పెద్దపల్లి ఎంపీగా, వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో మరోసారి టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా వివేక్, చెన్నూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వినోద్ పోటీ చేయాలని భావించారు. కానీ 105మందితో ప్రకటించిన టీఆర్‌ఎస్ తొలి జాబితాలో చెన్నూరు టికెట్ ఎంపీ సుమన్‌కు కేసీఆర్ కేటాయించారు.

దీంతో మాజీ మంత్రి అయిన వినోద్ నొచ్చుకున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఒక దశలో వివేక్‌, వినోద్ ఇద్దరూ కేటీఆర్‌ను పలుమార్లు కలిసి చెన్నూరు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ కేటీఆర్‌ నుంచి హామీ రాలేదు. ఆ తరువాత కేసీఆర్‌ అసలు వీరికి అపాయింట్‌మెంటే ఇవ్వలేదు. దీంతో వినోద్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న వివేక్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

First Published:  16 Oct 2018 12:15 AM GMT
Next Story