Telugu Global
NEWS

అప్పుడు ఎల్బీ స్టేడియం...ఇప్పుడు రాజీవ్ స్టేడియం

1955 నుంచి 2017 వరకూ ఆరు టెస్టులు భారత క్రికెట్ లక్కీ వేదిక హైదరాబాద్ ఆరుటెస్టులు…నాలుగు విజయాలు భారత క్రికెట్లో …రెండుటెస్టు వేదికలున్న అతికొద్ది నగరాలలో హైదరాబాద్ ప్రముఖంగా కనిపిస్తుంది. అంతేకాదు…1955 నుంచి 2017 వరకూ…జరిగిన ఆరు టెస్టుల్లో నాలుగుమ్యాచ్ లు… కేవలం న్యూజిలాండ్ జట్టే ఆడటం విశేషం. నగరం నడిబొడ్డునే ఉన్న లాల్ బహదూర్ స్టేడియం, నగర శివారులో ఉన్న ఉప్పల్ కమ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ల హైలైట్స్ ఓసారి చూద్దాం. అరుదైన […]

అప్పుడు ఎల్బీ స్టేడియం...ఇప్పుడు రాజీవ్ స్టేడియం
X
  • 1955 నుంచి 2017 వరకూ ఆరు టెస్టులు
  • భారత క్రికెట్ లక్కీ వేదిక హైదరాబాద్
  • ఆరుటెస్టులు…నాలుగు విజయాలు

భారత క్రికెట్లో …రెండుటెస్టు వేదికలున్న అతికొద్ది నగరాలలో హైదరాబాద్ ప్రముఖంగా కనిపిస్తుంది. అంతేకాదు…1955 నుంచి 2017 వరకూ…జరిగిన ఆరు టెస్టుల్లో నాలుగుమ్యాచ్ లు… కేవలం న్యూజిలాండ్ జట్టే ఆడటం విశేషం. నగరం నడిబొడ్డునే ఉన్న లాల్ బహదూర్ స్టేడియం, నగర శివారులో ఉన్న ఉప్పల్ కమ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ల హైలైట్స్ ఓసారి చూద్దాం.

అరుదైన క్రికెట్ వేదిక హైదరాబాద్

క్రికెట్ క్రేజీ భారత్ లో రెండు అంతర్జాతీయ టెస్ట్ వేదికలున్న నగరాలలో ముంబై తర్వాత…హైదరాబాదే ప్రముఖంగా కనిపిస్తుంది. ముంబైలో బ్రబోర్న్ స్టేడియం, వాంఖెడీ స్టేడియాలు టెస్ట్ వేదికలుగా ఉంటే.. హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాలు టెస్ట్ వేదికలుగా ఉన్నాయి.

1955లో మొట్టమొదటి టెస్ట్….

భారత గడ్డపై మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ కు 1933లో ముంబై నగరం ఆతిథ్యమిస్తే…హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ 1955లో ..లాల్ బహదూర్ స్టేడియం వేదికగా నిర్వహించారు.

1955 నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్ ప్రత్యర్థిగా జరిగిన మ్యాచ్ లో సెంచరీల మోతే మోగింది. భారత టాపార్డర్ బ్యాట్స్ మెన్ పాలీ ఉమ్రీగర్ 223 పరుగులు, విజయ్ మంజ్రేకర్ 118 పరుగులు, క్రిపాల్ సింగ్ 100 పరుగుల స్కోర్లతో తమజట్టుకు 498 పరుగుల భారీస్కోరు అందించారు.

సమాధానంగా న్యూజిలాండ్ 326 స్కోరు సాధించింది. గే 102 పరుగులతో ఫైటింగ్ సెంచరీ సాధించినా ..కివీస్ కు ఫాలోఆన్ తప్పలేదు.

రెండోఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ బ్రెట్ సట్ క్లిఫ్ 137 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

1988లో రెండోటెస్ట్….

ఆ తర్వాత…మూడుదశాబ్దాల విరామం తర్వాత…లాల్ బహదూర్ స్టేడియం వేదికగానే…చివరిసారిగా 1988లో నిర్వహించిన టెస్ట్ మ్యాచ్ లో సైతం…భారత్ ప్రత్యర్థిగా న్యూజిలాండ్ జట్టే నిలవటం విశేషం. రిచర్డ్ హాడ్లీ, ఇవాన్ చాట్ ఫీల్డ్ లాంటి స్వింగ్ బౌలింగ్ గ్రేట్లున్నా…ఈ టెస్టులో న్యూజిలాండ్ కు ..10 వికెట్ల పరాజయం తప్పలేదు.

మహ్మద్ అజరుద్దీన్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే…బౌలర్లలో అర్షద్ అయూబ్…రెండుఇన్నింగ్స్ లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు.

రెండుదశాబ్దాల విరామం తర్వాత….

ఆ తర్వాత…మరో టెస్ట్ మ్యాచ్ కోసం…హైదరాబాద్ నగరం…రెండుదశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.

హైదరాబాద్ క్రికెట్ సంఘం…. …నగర శివారులోని ఉప్పల్ లో…అత్యాధునిక హంగులతో సొంతంగా స్టేడియం నిర్మించుకొంది. బ్యాటింగ్ స్వర్గధామంగా పేరుపొందిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో..మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ను 2010 నవంబర్ 12 నుంచి 16 వరకూ…భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్వహించారు.

డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ లో బ్రెండన్ మెకల్లమ్ 225 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

భారత ఆటగాళ్లలో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 96, మిడిలార్డర్ ఆటగాడు హర్భజన్ సింగ్ 111 పరుగులు సాధించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ వెట్టోరీ 5 వికెట్లు పడగొడితే… రెండు ఇన్నింగ్స్ లోనూ కలసి…పేసర్ జహీర్ ఖాన్ ఏకంగా ఎనిమిది వికెట్లు సాధించాడు.

రాజీవ్ స్టేడియంలో తొలి గెలుపు….

ఇక…బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాజట్ల టెస్ట్ కు సైతం హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా నిలిచింది.

2013 మార్చి 2 నుంచి 5 వరకూ జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ కు ఎదురేలేకపోయింది. కంగారూ టీమ్ తొలిఇన్నింగ్స్ లో 237, రెండోఇన్నింగ్స్ లో 131 పరుగులకు కుప్పకూలింది.

భారత ఓపెనర్ మురళీ విజయ్ 167, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 204 పరుగుల స్కోర్లతో పరుగుల పండుగ చేసుకొన్నారు.

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 63 పరుగులిచ్చి 5 వికెట్లు, జడేజా 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి..తమజట్టుకు ఇన్నింగ్స్ 135 పరుగుల భారీవిజయం అందించారు.

బంగ్లాదేశ్ పై భారీవిజయం…

ఆ తర్వాత….మరో టెస్ట్ కోసం నాలుగు సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ…బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా జరిగిన టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్, మిడిలార్డర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా సెంచరీలతో చెలరేగితే…కెప్టెన్ విరాట్ కొహ్లీ…డబుల్ సెంచరీతో విశ్వరూపమే ప్రదర్శించాడు.

ఈ టెస్టులో సైతం టీమిండియా 208 పరుగుల భారీ విజయం సాధించింది.

విండీస్ తో తొలిసారిగా టెస్ట్…

మొత్తం మీద….హైదరాబాద్ వేదికగా ముగిసిన ఆరు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు, ఆరు సెంచరీలు నమోదు కాగా…ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , బంగ్లాదేశ్్ జట్లపైన భారత్ భారీవిజయాలు నమోదు చేసింది.

వెస్టిండీస్ తో జరిగే ఆఖరి టెస్ట్ లో సైతం టీమిండియా భారీవిజయంతో సిరీస్ స్పీప్ సాధించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  11 Oct 2018 9:00 PM GMT
Next Story