Telugu Global
NEWS

షా కాలు మీద కాలు.... పీఠాధిపతీ ఏమిటీ దుస్థితి!

సాధారణంగా పీఠాధిపతులకు లభించే గౌరవం వేరేలా ఉంటుంది. వారు పైన కూర్చుంటే ఆశీర్వాదం కోసం వచ్చిన ఎంతటి వారైనా కింద కూర్చుంటారు. లేదంటే వినయపూర్వకంగా వారి పక్కనే కూర్చుంటారు. ప్రధానుల నుంచి ముఖ్యమంత్రుల వరకు పీఠాధిపతులకు తలొంచి నమస్కరిస్తుంటారు. పీఠాధిపతులకు లభించే గౌరవం అలాంటిది. కానీ ఆశించి వచ్చిన వాడిని చూస్తే ఎవరికైనా చులకన భావమే. అవసరానికి వచ్చిన వాడు తమ వద్ద బానిస తరహాలోనే ఉండాలని చాలా మంది ఆలోచిస్తారు. అందుకు పీఠాధిపతులకు మినహాయింపులు ఉండవు. […]

షా కాలు మీద కాలు.... పీఠాధిపతీ ఏమిటీ దుస్థితి!
X

సాధారణంగా పీఠాధిపతులకు లభించే గౌరవం వేరేలా ఉంటుంది. వారు పైన కూర్చుంటే ఆశీర్వాదం కోసం వచ్చిన ఎంతటి వారైనా కింద కూర్చుంటారు. లేదంటే వినయపూర్వకంగా వారి పక్కనే కూర్చుంటారు. ప్రధానుల నుంచి ముఖ్యమంత్రుల వరకు పీఠాధిపతులకు తలొంచి నమస్కరిస్తుంటారు.

పీఠాధిపతులకు లభించే గౌరవం అలాంటిది. కానీ ఆశించి వచ్చిన వాడిని చూస్తే ఎవరికైనా చులకన భావమే. అవసరానికి వచ్చిన వాడు తమ వద్ద బానిస తరహాలోనే ఉండాలని చాలా మంది ఆలోచిస్తారు. అందుకు పీఠాధిపతులకు మినహాయింపులు ఉండవు. ఇప్పుడు శ్రీపీఠం పరిపూర్ణానంద పరిస్థితి కూడా అలాగే ఉంది.

సన్యాసం కంటే రాజకీయం వైపు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్న పరిపూర్ణానంద బీజేపీలో చేరి తెలంగాణకు యోగి ఆదిత్యనాథ్ లా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అందులో భాగంగా బీజేపీలో చేరుతానంటూ ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఒక ఫొటోను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. పీఠాధిపతికి ఇలాంటి పరిస్థితా? అని చర్చించుకుంటున్నారు. పీఠాధిపతుల ముందు సాధారణంగా నేతలు కూర్చోవడానికే సంశయిస్తుంటారు.

అలాంటిది పరిపూర్ణనంద వెళ్లిన సమయంలో అమిత్ షా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నారు. అక్కడే పరిపూర్ణానంద ఒక సాధారణ బీజేపీ నాయకుడి తరహాలో కూర్చున్నారు. ఈ ఫొటోను పరిపూర్ణానంద అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలపై ఆసక్తితో చర్చించేందుకు వెళ్తే పీఠాధిపతికి ఇలాంటి మర్యాద ఇస్తారా అని మండిపడుతున్నారు. అయితే మరికొందరి వాదన మరోలా ఉంది.

బీజేపీలో చేరి, పోటీ చేసి, ముఖ్యమంత్రి కావాలి అనుకోవడం పూర్తిగా రాజకీయమని…. అలా పదవులు ఆశించే వారిని సాధారణ నాయకుడి తరహాలోనే ట్రీట్‌ చేయడంలో తప్పులేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పరిపూర్ణానంద అమిత్ షా వద్దకు పీఠాధిపతిగా వెళ్లలేదని… రాజకీయంగా పదవి ఆశించి వెళ్లారు కాబట్టి అందుకు తగ్గట్టే అమిత్ షా వ్యవహరించారంటున్నారు.

పీఠాధిపతిగా అందరినీ ఆశీర్వదించిన పరిపూర్ణానంద నేరుగా బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత నరేంద్రమోడీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు కూడా చేయాల్సి ఉంటుందంటున్నారు.

First Published:  8 Oct 2018 11:10 PM GMT
Next Story