Telugu Global
Cinema & Entertainment

"నోటా" సినిమా రివ్యూ

రివ్యూ:  నోటా రేటింగ్‌: 2.25/5 తారాగణం:  విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్, మెహ్రీన్  తదితరులు సంగీతం:  సామ్ సీఎస్ నిర్మాత:  కే.ఈ. జ్ఞానవేల్ రాజ దర్శకత్వం:  ఆనంద్ శంకర్ గీత గోవిందం మేనియా పుణ్యమా అని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా నోటాలో ఇంకో హీరో అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఓపెనింగ్స్ మాత్రం ఈ రోజు ఊహించిన దాని కన్నా బాగానే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) ఓ కుంభకోణంలో ఇరుక్కోవడంతో గేమ్ డిజైనర్ గా […]

నోటా సినిమా రివ్యూ
X

రివ్యూ: నోటా
రేటింగ్‌: 2.25/5
తారాగణం: విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్, మెహ్రీన్ తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
నిర్మాత: కే.ఈ. జ్ఞానవేల్ రాజ
దర్శకత్వం: ఆనంద్ శంకర్

గీత గోవిందం మేనియా పుణ్యమా అని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా నోటాలో ఇంకో హీరో అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఓపెనింగ్స్ మాత్రం ఈ రోజు ఊహించిన దాని కన్నా బాగానే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) ఓ కుంభకోణంలో ఇరుక్కోవడంతో గేమ్ డిజైనర్ గా లండన్ లో ఉంటూ సెలవుల కోసం వచ్చిన కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ) ని సీఎం చేసేస్తాడు. నేరం రుజువు కానీ కారణంగా బయటికి వచ్చిన వాసుదేవ్ మీద దాడి జరగడంతో కోమాలోకి వెళ్ళిపోతాడు. దీంతో కొద్దిరోజులు అనుకున్న ముఖ్యమంత్రి కిరీటం వరుణ్ కు గట్టిగా దిగబడిపోతుంది. తర్వాత క్రమంలో చాలా విపత్తులు ఎదురవుతాయి. విజయ్ కు మద్దతుతో పాటు వ్యతిరేకత మొదలవుతుంది. గత ఏడాదిలో తమిళ రాజకీయాల్లో చూసిన ఘట్టాలు అన్ని ఒక్కొక్కటిగా ఎదురవుతాయి. వరుణ్ చివరికి ఎక్కడికి చేరుకున్నాడు అనేదే నోటా.

విజయ్ దేవరకొండలో ఉన్న ఫైర్ కి తగ్గ కథ దొరికితేనే చెలరేగుతాడు. దానికి కావలసింది సరైన కథా కథనాలు. తన క్యాలిబర్ కు తగ్గ పాత్ర కాకపోయినా రౌడీ సీఎంగా విజయ్ సాధ్యమైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేసాడు. బస్సుని దుండగులు కాల్చేసిన తర్వాత ప్రెస్ మీట్ సీన్‌లో, తన మీద వీడియో ఆరోపణలు వచ్చినప్పుడు జనానికి వివరణ ఇచ్చుకునే సన్నివేశంలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ కథనం బలహీనంగా ఉండటంతో అంతకు మించి పెర్ఫర్మ్ చేసే అవకాశం లేకపోయింది. మెహ్రీన్ కెరీర్ లో చేసిన అత్యంత చెత్త పాత్ర ఇదే. కథకు ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ఓ ఐదారు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. సత్యరాజ్ వరుణ్ కి హెల్ప్ చేసే జర్నలిస్ట్ గా మెప్పించాడు. సెకండ్ హాఫ్ లో నాజర్ కు చేసిన మేకప్ ఎబ్బెట్టుగా ఉండటంతో అక్కడ ఓవర్ గా అనిపిస్తుంది. ప్రియదర్శి పాత్ర పర్వాలేదు. ఇక మిగిలిన వాళ్లంతా ఆరవ బ్యాచ్. కనీసం మనకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు. కానీ అపోజిషన్ లీడర్ కూతురిగా చేసిన ఆర్టిస్టు మాత్రం బాగా నప్పింది.

దర్శకుడు ఆనంద్ శంకర్ చాలా అయోమయంలో ఈ కథ రాసుకున్నాడు. మంచి పొలిటికల్ థ్రిల్లర్ చూపాలన్న తాపత్రయం కన్నా వర్తమాన తమిళ రాజకీయాలను ఒకే సినిమాలో చూపించాలన్న యావ ఎక్కువ కావడంతో అసలుకే మోసం వచ్చింది. ఇదే తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాకుండా అడ్డు పడుతోంది. టేకాఫ్ బాగానే ఉన్నా కథ ముందుకు వెళ్లే కొద్దీ ఎగ్జైట్మెంట్ కు బదులు నీరసం రావటానికి కారణం ఇదే. సెకండ్ హాఫ్ లో లెక్కలేనన్ని ఉపకథలు అనవసరంగా ఇరికించాడు. జయలలిత హాస్పిటల్ లో ఉండటం, అన్నాడీఎంకే పార్టీలో పుట్టిన ముసలం ఇవన్నీ తన కథకు అనుగుణంగా తీసుకున్నాడు కానీ అంతే ప్రతిభావంతంగా రాసుకోలేకపోయాడు. దానికి తోడు పెద్ద సినిమా కావడంతో సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది. బిగిగా రాసుకుని ఉంటే మరో మంచి పొలిటికల్ థ్రిల్లర్ అయ్యేది కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు ఆనంద్ శంకర్. సామ్ సీఎస్ సంగీతం పాటల్లో మరీ నాసిరకంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రం. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ చేయకుండానే విడుదల చేసినట్టు ఉంది. కెమెరా పనితనం ఓ మోస్తరుగా పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా అయితే లేవు. బడ్జెట్ లోనే చుట్టేశారు.

చివరిగా చెప్పాలంటే నోటా తమిళ రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉంటే తప్ప కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేని కథతో విజయ్ దేవరకొండకు మొదటి స్పీడ్ బ్రేకర్ గా మారేలా ఉంది. థ్రిల్స్ కు, ట్విస్ట్స్ కు బోలెడు అవకాశం ఉన్నా సరైన రీతిలో రాసుకొని కారణంగా టైటిల్ కు ఏ మాత్రం సంబంధం లేని నోటా సగటు మాములు సినిమాగా మిగిలిపోయింది. విజయ్ దేవరకొండ అభిమానులు కొంతవరకు సంతృప్తి చెందినా రెండు ముప్పాతిక గంటలు భరించడం కష్టమే.

నోటా – తమిళ రాజకీయాల గోల

రేటింగ్ : 2.25/5

First Published:  5 Oct 2018 5:33 AM GMT
Next Story