Telugu Global
NEWS

రాజకోట రాజా పృథ్వీ షా

టెస్ట్ క్రికెట్లో ఖతర్నాక్ కుర్రోడు 18 ఏళ్లకే 8 ఫస్ట్ క్లాస్ సెంచరీల మొనగాడు అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన భారత తొలి ఓపెనర్ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోకి… మెరికలాంటి మరో ఓపెనర్ దూసుకొచ్చాడు. రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో ప్రారంభమైన తొలిటెస్ట్… తొలిరోజు ఆటలోనే టీమిండియా లిటిల్ ఓపెనర్ పృథ్వీ షా… సూపర్ సెంచరీతో రికార్డుల్లో చేరాడు. 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్ట్ శతకం బాదిన ఖతర్నాక్ కుర్రోడు పృథ్వీ షా పై […]

రాజకోట రాజా పృథ్వీ షా
X
  • టెస్ట్ క్రికెట్లో ఖతర్నాక్ కుర్రోడు
  • 18 ఏళ్లకే 8 ఫస్ట్ క్లాస్ సెంచరీల మొనగాడు
  • అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన భారత తొలి ఓపెనర్

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోకి… మెరికలాంటి మరో ఓపెనర్ దూసుకొచ్చాడు. రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో ప్రారంభమైన తొలిటెస్ట్… తొలిరోజు ఆటలోనే టీమిండియా లిటిల్ ఓపెనర్ పృథ్వీ షా… సూపర్ సెంచరీతో రికార్డుల్లో చేరాడు. 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్ట్ శతకం బాదిన ఖతర్నాక్ కుర్రోడు పృథ్వీ షా పై స్పెషల్ స్టోరీ…..

స్టార్ క్రికెటర్ల అడ్డా ముంబై…

భారత క్రికెట్ కి చిరునామా… ముంబై అనగానే… సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవి శాస్త్రి, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే లాంటి ఎందరో అసాధారణ క్రికెటర్లు మనకు గుర్తుకు వస్తారు.

అలాంటి ముంబై క్రికెట్ స్కూల్ నుంచి వచ్చిన మొనగాడే 18 ఏళ్ల పృథ్వీ షా. అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించిన ముంబై కుర్రోడు పృథ్వీ షా… ఇప్పటి వరకూ ఆడిన 14 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ల్లోనే ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా…. సెలెక్టర్ల పిలుపును అందుకొన్నాడు.

ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొన్న భారత జట్టులో సైతం పృథ్వీ షా చోటు సంపాదించాడు. అయితే… తుదిజట్టులో చోటు సంపాదించడానికి కొద్దివారాలపాటు మాత్రమే వేచిచూశాడు.

18 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్యాప్….

వెస్టిండీస్ తో ప్రారంభమైన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించడమే కాదు…. రాజ్ కోట్ టెస్ట్ ద్వారా …టెస్ట్ క్యాప్ సైతం అందుకొన్నాడు.

అరంగేట్రం మ్యాచ్ లోనే అంచనాలకు తగ్గట్టుగా ఆడిన పృథ్వీ షా… ఏకంగా సెంచరీ సాధించి వారేవ్వా అనిపించుకొన్నాడు.

రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన షా…. కరీబియన్ ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొనడమే కాదు… దూకుడుగా ఆడుతూ… కేవలం 99 బాల్స్ లోనే తొలి టెస్ట్ శతకం పూర్తి చేశాడు.

భారత తొలి క్రికెటర్ షా…

56 బాల్స్ లో ఏడు బౌండ్రీలతో మొదటి యాభై పరుగులు సాధించడంతోనే… ఈ ముంబై కుర్రోడి పేరుతో ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది. భారత్ తరపున టెస్ట్ క్రికెట్లో తొలిబంతి ఎదుర్కొన్న…. అత్యంత పిన్నవయస్కుడైన ఓపెనర్ గా షా చరిత్ర సృష్టించాడు.

1959 సిరీస్ లో అబ్బాస్ అలీ బేగ్ 20 సంవత్సరాల 131 రోజుల వయసులో… టెస్ట్ క్రికెట్ హాఫ్ సెంచరీ సాధించిన భారత ఓపెనర్ రికార్డును…. పృథ్వీ 18 ఏళ్ల 329 రోజుల వయసులో సాధించడం ద్వారా తెరమరుగు చేశాడు.

99 బాల్స్ లో శతకం….

ఆ తర్వాత… తన బ్యాటింగ్ జోరును కొనసాగించిన పృథ్వీ షా…. 99 బాల్స్ ఎదుర్కొని 15 బౌండ్రీలతో… తొలిటెస్ట్ శతకం, 8వ ఫస్ట్ క్లాస్ క్రికెట్ సెంచరీ సాధించాడు.

భారత క్రికెట్ చరిత్రలోనే …అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన 15వ టెస్ట్ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 17 సంవత్సరాల 107 రోజుల వయసులోనే టెస్ట్ శతకం సాధిస్తే… పృథ్వీ షా మాత్రం 18 ఏళ్ల 329 రోజుల వయసులో కానీ సెంచరీ సాధించలేకపోయాడు.

ఏడో కుర్ర క్రికెటర్ షా

13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో… అత్యంత పిన్నవయసులోనే సెంచరీలు సాధించిన క్రికెటర్ల వరుస ఏడో స్థానంలో నిలిచాడు.

సెంచరీలు సాధించిన.. యంగెస్ట్ ఓపెనర్లలో హామిల్టన్ మసకడ్జా, తమీమ్ ఇక్బాల్, ఇమ్రాన్ పర్హత్…పృథ్వీ షా కంటే ముందున్నారు.

అత్యంత పిన్నవయసులోనే సెంచరీలు సాధించిన క్రికెటర్లలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అష్రఫుల్, ముస్తాక్ అహ్మద్, సచిన్ టెండుల్కర్, హామిల్టన్ మసకడ్జా, ఇమ్రాన్ నజీర్, సలీం మాలిక్ల తర్వాతి స్థానంలో పృథ్వీ షా నిలిచాడు.

134 పరుగులతో షా షో…..

పృథ్వీ షా…. తన మొట్టమొదటి టెస్ట్ ఇన్నింగ్స్ లో 154 బాల్స్ ఎదుర్కొని 19 బౌండ్రీలతో 134 పరుగుల స్కోరుకు… లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషు బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ కు అవుటయ్యాడు.

మొత్తం మీద… సెలక్టర్లు తన మీద నమ్మకం ఉంచి… టెస్ట్ ఓపెనర్ గా ఇచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని… ముంబై క్రికెటర్లా… మజాకానా అనిపించుకొన్నాడు.

త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో… కంగారూ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై పృథ్వీ షా ఏ రేంజ్ లో రాణిస్తాడన్నదే… ఇక్కడి అసలు పాయింట్.

ఏదిఏమైనా… శిఖర్ ధావన్, మురళీ విజయ్, కెఎల్ రాహుల్ లాంటి ఓపెనర్లకు…పృథ్వీ షా రూపంలో అడుగడుగునా పోటీ ఎదురుకానుంది. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధంలేదనటానికి… తాజా నిదర్శనమే ముంబై కమ్ భారత్ ఖతర్నాక్ ఓపెనర్ పృథ్వీ షా అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  4 Oct 2018 6:43 AM GMT
Next Story