Telugu Global
NEWS

టీడీపీ పత్రిక కథనంపై అంబటి ఫైర్

బీజేపీ, వైసీపీ మధ్య రహస్య పొత్తు అంటూ టీడీపీ అనుకూల పత్రిక ఒకటి కథనం రాయడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఏం చేసైనా సరే చంద్రబాబును తిరిగి అధికారంలో కూర్చోబెట్టేందుకు ఎల్లో మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు ఒక కుక్కను పట్టుకుని వెళ్తుంటే అది కుక్క కాదు మంచి మేక అని ప్రచారం చేస్తున్నారన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే ఈ ఎల్లో మీడియా మాత్రం అది […]

టీడీపీ పత్రిక కథనంపై అంబటి ఫైర్
X

బీజేపీ, వైసీపీ మధ్య రహస్య పొత్తు అంటూ టీడీపీ అనుకూల పత్రిక ఒకటి కథనం రాయడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.

ఏం చేసైనా సరే చంద్రబాబును తిరిగి అధికారంలో కూర్చోబెట్టేందుకు ఎల్లో మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు ఒక కుక్కను పట్టుకుని వెళ్తుంటే అది కుక్క కాదు మంచి మేక అని ప్రచారం చేస్తున్నారన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే ఈ ఎల్లో మీడియా మాత్రం అది తప్పు అని ఎన్నడూ రాయదన్నారు. నలుగురు ఫిరాయింపుదారులను మంత్రులను చేస్తే దాన్ని కూడా ప్రశంసించే స్థాయికి పత్రికలు దిగజారిపోయాయన్నారు.

బీజేపీకి, జగన్‌కు పొత్తు పొడిచిందని ఒక పత్రిక రాసిందని… బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పదేపదే చెబుతున్నా బీజేపీని జగన్‌కు అంటగట్టేందుకు, ప్రజలను నమ్మించేందుకు ఎల్లో మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉండాలని తాను అనుకున్నానని…. కానీ మోడీ అడ్డుకున్నారని చంద్రబాబు చెబుతున్నారని…. మరి కేసీఆర్‌తో కలిసి ఉండాలనుకునే చంద్రబాబు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎందుకు పంపారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిస్తే అద్భుతమని రాస్తున్న పత్రికలకు సిగ్గుందా అని ప్రశ్నించారు. రహస్యంగా పొత్తులు పెట్టుకునే అలవాటు చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు మాత్రమే సాధ్యమన్నారు. జగన్‌కు బెయిల్ వచ్చిన రోజు జగన్‌, సోనియా కలిసి పోయారని ఇదే చంద్రబాబు ప్రచారం చేశారని…. మరి ఇప్పుడు అదే సోనియాతో ఎలా కలిశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే కాదు చంద్రబాబు ఏ పార్టీతో కలిసి వచ్చినా తమకు ఇబ్బంది ఏమీ లేదన్నారు. కొన్ని పత్రికలు ఎన్ని రాసినా, ఎన్ని కూతలు కూసినా తాము భయపడే ప్రసక్తే లేదన్నారు.

తమది ఎప్పటికీ రాచబాటేనన్నారు. బీజేపీతో ఎప్పటికీ పొత్తు ఉండదన్నారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తే ఎన్టీఆర్‌ సినిమాల పేర్లన్నీ హెడ్‌లైన్లుగా పెట్టి ఎల్లో పత్రికలు కీర్తించాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిరిగి అధికారంలో కూర్చోబెట్టాలనుకుంటున్న మీడియా ఎత్తులు ఈసారి పారవన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబును ఓడించడానికి పొత్తులు ఏమీ అవసరం లేదని వైసీపీ సింగిల్‌గానే చంద్రబాబును ఇంటికి పంపిస్తుందన్నారు.

స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది తొలి నుంచి కూడా నేర చరిత్రేనన్నారు. స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఎన్నికల్లో గెలిచేందుకు తాను 11.5 కోట్లు ఖర్చు పెట్టానని స్పీకర్ కోడెల చెప్పిన తర్వాత కూడా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

స్వయంగా కోడెల శివప్రసాద్ రావే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించానని ఒప్పుకున్న తర్వాత ఆయనకు ఎమ్మెల్యేగా , స్పీకర్‌గా కొనసాగే అర్హత ఎక్కడుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కోడెల శివప్రసాద రావుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే పదవులకు రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

First Published:  4 Oct 2018 7:08 AM GMT
Next Story