Telugu Global
Family

మార్కండేయుడు

మార్కండేయుడు (Markandeya): ఏజీవికయినా చావు పుట్టుకలు ఉంటాయి! లేకుండా ఉండే వీలే లేదు! "పుట్టిన వారికి మరణం తప్పదు! అనివార్యమగు ఈ కార్యం గురించి శోకింపతగదు!" అని గీత కూడా చెప్పింది! పుట్టుక తప్ప చావు లేని సందర్భం యెప్పుడైనా యెక్కడైనా ఉందా? అంటే "వుంది" అని మార్కండేయుని కథ చెపుతోంది! చావుని గెలవడం బతుకేనా?

Markandeya
X

మార్కండేయుడు

ఏజీవికయినా చావు పుట్టుకలు ఉంటాయి! లేకుండా ఉండే వీలే లేదు! "పుట్టిన వారికి మరణం తప్పదు! అనివార్యమగు ఈ కార్యం గురించి శోకింపతగదు!" అని గీత కూడా చెప్పింది! పుట్టుక తప్ప చావు లేని సందర్భం యెప్పుడైనా యెక్కడైనా ఉందా? అంటే "వుంది" అని మార్కండేయుని కథ చెపుతోంది! చావుని గెలవడం బతుకేనా? కానే కాదని ఇదే కథ చివరాఖరుకు అర్థంచేయిస్తుంది!.

మృకండుడు, మనస్విని అనేదంపతులు తమ జీవితకాలం దేవుని ఆరాధనలోనే గడిపారు. ముసలితనంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు. వరమడిగితే సంతానాన్ని ప్రసాదించమన్నారు. వందమంది వందేసియేళ్ళు జీవించే దుర్మార్గులైన పుత్రులుకావాలో – పదహారేళ్ళు మాత్రమే జీవించే ఒక్కగానొక్క సుపుత్రుడు కావాలో కోరుకోమన్నారు. మంచి కొంచెమయినా యెన్నుకున్నారు. అల్పాయష్కుడైనా ఒక్క కొడుకే కావాలన్నారు. అతడే మార్కండేయుడు!

అందరికి తలలో నాల్కలావుండే మార్కండేయుడు అమ్మానాన్నల దిగులూ దుఃఖము అంతా తన గురించేనని గ్రహించాడు. తనచావే వారిని భయపెడుతోందనీ తెలుసుకున్నాడు. పూలు వాడడం, ఆకులు పండి,ఎండిరాలడం, మనుషులే కాదు ప్రతి జీవి ప్రాణాలు వదలడం… చావు బతుకులో భాగమని అర్థం చేసుకున్నాడు. తన చావు తనని భయపెట్టలేదు. కాని అమ్మానాన్నల బాధ భయపెట్టింది. తనులేకపోతే వాళ్ళేమయి పోతారోనని బాధయింది. అందుకని మార్కండేయుడు మృత్యువుని యెదిరించాలని అనుకున్నాడు.

పనీ పాటలే కాదు ఆటపాటలూ మానుకున్నాడు. అన్నపానీయాలు మానుకున్నాడు. నిద్రాహారాలు వదులుకున్నాడు. శివలింగం ముందు కూర్చున్నాడు. శివుని ధ్యానంలో మునిగిపోయాడు. రోజులూ నెలలూ రుతువులూ గడుస్తున్నాయి… మారుతున్నాయి…. కాలం కరుగుతోంది. దుఃఖ ప్రవాహంలో తలిదండ్రులు ఉన్నారు. కాల ప్రవాహం ఆగలేదు. మార్కండేయునికి పదహారేళ్ళు నిండాయి. యమ దూతలు వచ్చినా ఆ బాలుణ్ని సమీపించడానికి సాహసించలేక వెనుదిరిగారు. ఈసారి యముడే వచ్చాడు. యమ పాశంతో దున్నపోతు నెక్కివచ్చాడు. అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయని – తనని అనుసరించమన్నాడు. పూజ పూర్తికాకుండా రాలేనన్నాడు మార్కండేయుడు. పాశాన్ని విసిరాడు యముడు. ప్రాణం రాలేదు? సకల జీవరాసులూ సమస్త ప్రకృతీ మార్కండేయుని కోసం రోదిస్తూనే ఉంది. యముడు తన ధర్మం తాను నిర్వర్తించదలిచాడు. లొంగలేదు. జాలిచూపలేదు. రెండోసారి పాశం విసిరాడు. కదలక మెదలక శివలింగాన్ని కౌగిలించుకొని ఉన్నాడు మార్కండేయుడు. మార్కండేయుని ప్రాణాలు విడిచిపెట్టమని ప్రాణికోటి రోదించింది. యముని చేతిలో ప్రాణాలు లేవే?! "నియమం తప్పేది లేదు" అనుకున్నాడు యముడు.

శివుడు దిగివచ్చాడు. మార్కండేయుని ప్రాణాలు కాపాడమని జనకోటి మొరపెట్టుకుంది. "మృత్యువుని బతుకులోంచి విడదియ్యడం సబబా?" శివుని ప్రశ్న జనానికెక్కలేదు. మృత్యువునే మృత్యువులోకి నెట్టమన్నారు. మార్కండేయుని ఆయుఃకాలం అయిపోయింది, నన్నెవరూ ఆపలేరు అన్నాడు యముడు. శివుడు ఆపాడు. మాటా మాటా పెరిగింది. ఘర్షణ జరిగింది. మార్కండేయుని ధ్యానం చెదరలేదు. యముని అధికారాన్ని శివుడు లాక్కున్నాడు. దాంతో మృత్యువే లేకుండా పోయింది. పుట్టుక తప్ప చావులేని ప్రపపంచం. ఎండినా పండినా ఆకు రాలడం లేదు. వాడిన పువ్వు తొడిమను వీడడం లేదు. రోగులకీ వృద్ధులకే కాదు, జీవించిన జీవితానికి విసుగు తప్ప విరామం లేదు!

మృత్యువు విలువ తెలిసొచ్చింది. శివుని వేడుకున్నారు. దాంతో కన్నుతెరిచిన జనం కన్ను మూసారు. శివుని విలువ యమునికీ తెలిసొచ్చింది. మృత్యువు విలువ మనిషికి తెలిసొచ్చింది. శివునిలో అంతర్లీనమైన మార్కండేయుని వల్లే ఇదంతా జరిగింది!.

-బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  7 Aug 2022 7:30 AM GMT
Next Story