Telugu Global
NEWS

జగన్‌ను కలిసిన తొమ్మిది మందిపై సస్పెన్షన్ వేటు

పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను అన్ని వర్గాల వారు ఇటీవల కలుస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. చివరకు పోలీసు అధికారులు కూడా జగన్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా నిత్యం ఎక్కడో ఒక చోట జగన్‌ను ప్రభుత్వ ఉద్యోగులు కలుస్తూనే ఉన్నారు. అయితే ఆదివారం పాదయాత్రలో జగన్‌ను కలిసిన తొమ్మిది మంది ఉపాధ్యాయులపై ప్రభుత్వం వేటు వేసింది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను విశాఖ జిల్లా ఆనందపురం, భీమిలి, […]

జగన్‌ను కలిసిన తొమ్మిది మందిపై సస్పెన్షన్ వేటు
X

పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను అన్ని వర్గాల వారు ఇటీవల కలుస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. చివరకు పోలీసు అధికారులు కూడా జగన్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా నిత్యం ఎక్కడో ఒక చోట జగన్‌ను ప్రభుత్వ ఉద్యోగులు కలుస్తూనే ఉన్నారు. అయితే ఆదివారం పాదయాత్రలో జగన్‌ను కలిసిన తొమ్మిది మంది ఉపాధ్యాయులపై ప్రభుత్వం వేటు వేసింది.

విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను విశాఖ జిల్లా ఆనందపురం, భీమిలి, అనంతగిరి మండలాలకు చెందిన తొమ్మిది మంది టీచర్లు కలిశారు. వైసీపీ అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ ఫించన్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ప్రకటించిన నేపథ్యంలో అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారు వెళ్లారు. జగన్‌ను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు.

జగన్‌ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారన్న సాకుతో తొమ్మిది మందిని జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వరరెడ్డి సస్పెండ్ చేశారు. సర్వీస్ రూల్స్‌కు విరుద్దంగా వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. అయితే సస్పెన్షన్ వేటుపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కేబినెట్ హోదా ఉన్న ప్రతిపక్ష నాయకుడిని కలవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఉద్యోగులు ఆయన్ను కలిశారని గుర్తు చేస్తున్నారు. ఏపీఎన్‌జీవో నేత అశోక్ బాబు ఏకంగా సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో టీడీపీకి అనుకూలంగా… ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేశారని గుర్తు చేస్తున్నారు. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయకపోతే ఆందోళన చేస్తామని టీచర్లు హెచ్చరించారు.

First Published:  2 Oct 2018 5:09 AM GMT
Next Story