Telugu Global
Family

ధ్రువుడు

ఆకాశంలో ఎన్నో నక్షత్రాలున్నా – ఉత్తర దిక్కున సప్తర్షి మండలంపైన ప్రకాశిస్తూ వెలిగే నక్షత్రమే ధ్రువ నక్షత్రం! ఎ ఎత్తైన స్థానంలో ఉన్న ధ్రువనక్షత్రం వెనుక లోతైన కథ ఉంది! తండ్రి తొడమీద కూర్చొనే కనీస స్థానాన్ని నోచుకోని ధ్రువుడు అత్యున్నత స్థానం యెలా చేరాడన్నదే, ఎలా ధ్రువతారగా మిగిలాడన్నదే ఉత్తేజపరిచే కథ!. ధ్రువునికప్పుడు అయిదేళ్ళ వయసు. తన తండ్రి ఉత్తాన పాదుడు నిండుకొలువులో కూర్చొని ఉన్నాడు. తమ్ముడు ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చొని ఉన్నాడు. తనకీ […]

ఆకాశంలో ఎన్నో నక్షత్రాలున్నా – ఉత్తర దిక్కున సప్తర్షి మండలంపైన ప్రకాశిస్తూ వెలిగే నక్షత్రమే ధ్రువ నక్షత్రం! ఎ ఎత్తైన స్థానంలో ఉన్న ధ్రువనక్షత్రం వెనుక లోతైన కథ ఉంది! తండ్రి తొడమీద కూర్చొనే కనీస స్థానాన్ని నోచుకోని ధ్రువుడు అత్యున్నత స్థానం యెలా చేరాడన్నదే, ఎలా ధ్రువతారగా మిగిలాడన్నదే ఉత్తేజపరిచే కథ!.

ధ్రువునికప్పుడు అయిదేళ్ళ వయసు. తన తండ్రి ఉత్తాన పాదుడు నిండుకొలువులో కూర్చొని ఉన్నాడు. తమ్ముడు ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చొని ఉన్నాడు. తనకీ కూర్చోవాలని అనిపించింది. ఆ ఆశతోనే తండ్రి దగ్గరికి చేరి చేతులుచాచాడు. పెద్దవాడేకాని ఉత్తమునికీ ధ్రువునికీ వయసులో పెద్ద తేడా లేదు. “నాకొడుకు కూర్చున్న చోట నువ్వు కూర్చో తగవు… నా కడుపున మళ్ళీ పుడితే తప్పనీకు కూర్చొనే హక్కు లేదు. పో… పో అవతలికి” అని ధ్రువుణ్ణి చెయ్యి పట్టుకు ఈడ్చి కసిరి కొట్టింది. ఎవరో కాదు సవతి తల్లి సురుచి. ధ్రువుని తండ్రికి పెద్ద భార్య సునీతి కాగ రెండో భార్య సురుచి. ధ్రువుడు సునీతికి పుట్టినవాడు. సురుచి మాటే చెల్లేది, అంచేత తండ్రి అడ్డు చెప్పలేదు. అది ధ్రువుణ్ణి ఇంకా బాధించింది.

ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళాడు ధ్రువుడు. చెప్పుకొని కుమిలిపోయాడు. తన కడుపున పుట్టడమే దురదృష్టమంది. బాధని దిగమింగి – దేవుణి మీద మనసుపెట్టమంది. ధ్యానంతో మనశ్శాంతి వస్తుందని, కష్ట సుఖాలను సమదృష్టితో చూడడం వస్తుందనీ చెప్పింది ఆ తల్లి. తండ్రి దగ్గర దొరకని స్థానాన్ని మించిన స్థానం సంపాదిస్తానన్నాడు ధ్రువుడు. దేవుని ధ్యానంలో ఉండడానికి తపస్సు చేసుకోవడానికి తల్లి అనుమతి కోరాడు. వయసుకు మించిన లక్ష్యం గనుక వద్దంది. ధృడ సంకల్పంతో ఎవరైనా సాధించవచ్చన్న తల్లి మాటను తల్లికి చెప్పి అనుమతి తీసుకొని అడవి మార్గం పట్టాడు.

త్రిలోక సంచారి నారదుడు తోవలో ఎదురయ్యాడు. ధ్రువుణ్ణి నిలువరించాలని అమ్మానాన్నలని అర్థం చేసుకోమని కోరాడు. భగవదనుగ్రహం సులభం కాదన్నాడు. ధ్రువుని పట్టుదలకు దారి విడువక తప్పలేదు. ఇంద్రాది దేవతల అవాంతరాలను చెప్పి, ఆశీర్వదించి పంపాడు. నారదుడు చెప్పినట్టుగా యమునా నదీ తీరంలోని మధువనంలో మంత్రాల్ని జపించాడు. తపస్సుచేస్తూ సప్త ఋషులను దర్శించాడు. తన వృత్తాంతం చెప్పాడు. వారి ఉపదేశం తీసుకొని తపస్సు ప్రారంభించాడు. అయిదేళ్ళ పిల్లాడు అయిదేళ్ళు తపస్సు చేశాడు. ఇంద్రుడు కల్పించిన మాయా మృగాలకూ – తల్లి, పినతల్లి రూపంలో వచ్చిన మాయా మమతలకూ లొంగిపోలేదు. దీక్షతో ఉన్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. మాటరాని ధ్రువుని మనసులోని కోరికను తెలుసుకున్నాడు. ఎవ్వరికీ ఇవ్వని ధ్రువపదం ఇచ్చాడు. ధ్రువపదం చుట్టూ గ్రహాలు నక్షత్రాలూ తిరుగుతుంటాయి కదా, ప్రళయకాలంలో అన్ని లోకాలు నశించినా ధ్రువలోకమే ఉంటుంది. అయితే ఆ స్థానాన్ని ఇప్పుడే చేరడంకాదని, రాజ్యసుఖాల్ని అనుభవించి జీవితపు చివరిదశలో దివ్యస్థానాన్ని చేరుకుంటావని విష్ణువు చెప్పి మాయమయ్యాడు.

ధ్రువుని తండ్రీ తల్లులిద్దరూ ఎదురుచూసి ఎదురెళ్ళారు. వయసు వచ్చాక తండ్రి రాజ్యానికి రాజయ్యాడు. ప్రజాపతి కూతురు భ్రమిని పెళ్ళాడాడు. కల్పుడు, వత్సరుడు అనే కొడుకుల్ని కన్నాడు. వాయుదేవుని కుమార్తె ఇళను పెళ్ళాడాడు. ఉత్కలుడనే కొడుకుతో పాటు కూతుర్ని కన్నాడు. తమ్ముడు యక్షుల చేతిలో హతమవ్వడం – ఆ దుఃఖంతో అడవిలోకి వెళ్ళి సురిచి అగ్నికి ఆహుతికావడం – ఆగ్రహంతో ధ్రువుడు యక్షజాతినే నిర్మూలిస్తూ పోవడం – ధ్రువుని తాత స్వాయంభువ మనవు వలదని వారించడం – ధ్రువుడు శాంతించడం – కుబేరుడు హితోపదేశం చేయడం – తర్వాత ప్రజల్ని కన్న బిడ్డల్లా పాలించడం – ధ్రువుని జీవితం చరమాంకానికి చేరడం – విష్ణువు తనకిచ్చిన ఉన్నతస్థానాన్ని చేరేందుకు విమానాన్ని పంపడం – అప్పుడూ అమ్మని గురించి ఆలోచించడం – అమ్మ స్వర్గలోకానికి వెళ్తూకనబడడం – దాంతో తృప్తిగా దేవుడిచ్చిన ఉన్నత స్థానాన్ని చేరడం – ధ్రువుడు ధృవతారగా వెలగడం – ఇది ధ్రువుని కథ!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Next Story