Telugu Global
Health & Life Style

నేటి తరానికి మేటి వైద్యం హోమియోపతి

వైద్యశాస్త్రం ఎంత విస్తృతమైనదో అంతకంటే సంక్లిష్టమైనది. వైద్యంలో ఆయుర్వేదం, యునాని, అలోపతి, హోమియోపతి విధానాలు వాడుకలో వున్నాయి. ప్రాచీనకాలం నుండి రుషి సాంప్రదాయంగా వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న ఆరోగ్య విధానం ఆయుర్వేదం. ఇప్పటికి దీని ప్రాధాన్యత దీనికుంది. యునాని వైద్యం మాత్రం క్రమంగా ప్రాభవం కోల్పోయిందని చెప్పవచ్చు. నేడు అత్యధిక ప్రజాదరణ వైద్యంగా ప్రఖ్యాతి చెందిన అలోపతి వైద్యానికి పితామహుడు హిపోక్రటిస్‌ మహాశయుడు. వీరు రచించిన ప్రామాణిక గ్రంథం ‘ఎఫారిజమ్‌’ శాస్త్రీయ వైద్యవిధానానికి నాంది పలికింది. […]

నేటి తరానికి మేటి వైద్యం హోమియోపతి
X

వైద్యశాస్త్రం ఎంత విస్తృతమైనదో అంతకంటే సంక్లిష్టమైనది. వైద్యంలో ఆయుర్వేదం, యునాని, అలోపతి, హోమియోపతి విధానాలు వాడుకలో వున్నాయి. ప్రాచీనకాలం నుండి రుషి సాంప్రదాయంగా వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న ఆరోగ్య విధానం ఆయుర్వేదం. ఇప్పటికి దీని ప్రాధాన్యత దీనికుంది. యునాని వైద్యం మాత్రం క్రమంగా ప్రాభవం కోల్పోయిందని చెప్పవచ్చు. నేడు అత్యధిక ప్రజాదరణ వైద్యంగా ప్రఖ్యాతి చెందిన అలోపతి వైద్యానికి పితామహుడు హిపోక్రటిస్‌ మహాశయుడు. వీరు రచించిన ప్రామాణిక గ్రంథం ‘ఎఫారిజమ్‌’ శాస్త్రీయ వైద్యవిధానానికి నాంది పలికింది. వైద్యుడు అనుసరించాల్సిన హేతుబద్ధమైన సుభాషితాలైన మూలసూత్రాలను ఇందులో పొందుపరచాడు. క్రమంగా జరిగిన పరిశోధనలవల్ల అలోపతి విజ్ఞానం ఆకాశమంత ఎత్తుకు పెరిగిందని, ఇంకా పెరుగుతుందని చెప్పడానికి సందేహం లేదు. ఏవైద్య విధానంలో లేనివిధంగా అలోపతిలో భాగమైన శస్త్రచికిత్సలతో గుండెమార్పిడి, మూత్రపిండాల మార్పిడి వంటివి విజయవంతంగా నిర్వహిస్తూ ప్రాణాలు నిలబెడుతున్నారు. అదే స్థాయిలో రోగికి ఖర్చు పెరుగుతోంది. సామాన్యుడికి ఇటువంటి సమస్యలు తలెత్తితే ప్రాణాలమీద ఆశవదులుకోవాల్సిందే. అలోపతి వైద్యం ఎంతో ప్రఖ్యాతి చెందినా, ప్రజల్లో ఆదరణ పొందినా దాని పరిమితులు దానికున్నాయి. మందుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలతోబాటు కొన్ని దుష్ఫలితాలు (సైడ్‌ఎఫెక్టు) రావచ్చు. శరీరం మందులకు అలవాటై ఇంకా శక్తివంతమైన మందులు వాడాల్సిన ఆవశ్యకత కలుగుతుంది. ఈ క్రమంలో ప్రాణాపాయదశలో ఆ మందులే పనిచేయని స్థితికూడ రావచ్చు.

ఇది ఇలా వుండగా జర్మనీలో జన్మించిన శామ్యుల్‌ హనిమన్‌ (1775-1843) మహాశయుడు మరొక విశిష్ట వినూత్న వైద్య విధానాన్ని సృష్టించి వైద్యలోకాన్ని ఆశ్చర్యపరచాడు. హిపొక్రిటస్‌ మాదిరిగానే ‘ఆర్గనాన్‌’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. స్వయంగా హనిమన్‌ అల్లోపతి వైద్యుడు. వైద్యశాస్త్ర పట్టా పొందిన తర్వాత కొంతకాలం అలోపతి విధానంలో వైద్యసేవ లందించాడు. ఒకానొక సందర్భంలో సింకోనా బెరడుతో మలేరియా వ్యాధి నియంత్రణ జరుగుతున్న నేపథ్యంలో అతని ఆలోచనలలో ఒక మెరుపు మెరిసింది. దానిపై అధ్యయనం, తనపైనే ప్రయోగించుకోవడం వంటి పరిశోధనలు చేసి ఫలితాలు గమనించడం మొదలుపెట్టాడు. 1796 నాటికి హోమియో వైద్యవిధానంపై ఒక నిర్ణయానికొచ్చాడు. అప్పటి వరకు కొనసాగుతున్న అలోపతి విధానంలోని అవలక్షణాలను చీల్చిచెండాడే విధంగా రూపొందించడం జరిగింది. వీరి ఆలోచనాసరళిని పలువురు విమర్శించినవారు లేకపోలేదు. అదే సమయంలో హనిమన్‌ విధానాలకు మద్దతుగా కొందరు శిష్యగణంకూడ తయారైనారు.

వైద్య విధానాలలో ఏదీ మరొక దానికి పోటీకాదు. మానవాళి అనారోగ్య బాధల నుండి స్వస్థత, ఉపశమనం పొందడానికి పలుకోణాల నుండి జరిగే ప్రయత్నం మాత్రమే. సామాన్య, పేద ప్రజలకు సైతం సురక్షితమైన చౌకైన వైద్యం అందుబాటులో ఉండడమే అంతిమలక్ష్యం. ఈ దృష్టితో పరికించినపుడు హోమియో వైద్యంలో విస్పష్ట ప్రయోజనాలు కనిపిస్తాయి. శస్త్రచికిత్సా ప్రక్రియ మాత్రం అలోపతికి స్వంతం. మిగిలిన అన్ని సాధారణ శారీరక, మానసిక, దీర్ఘకాలిక రుగ్మతలకు ఇతర వైద్య విధానాలలో లేని వెసులుబాట్లు హోమియో వైద్యంలో ఉన్నాయి.

1. పాలుతాగే పిల్లలకు, పాలిచ్చే తల్లులకు హోమియో మందు వాడొచ్చు. గర్భందాల్చిన స్త్రీలకు, కాన్పు అయిన బాలింతలకు కూడ వాడొచ్చు.
2. రోగ లక్షణాల నివారణ మాత్రమే కాకుండా రోగ కారకాన్ని సమూలంగా శరీరం నుండి దూరం చేసి రోగికి పూర్తి స్వస్తత చేకూర్చే విధంగా మందులు ఉపయోగపడతాయి.
3. ఇతర విధానాల మందులు వాడుచున్నప్పటికి అవి హోమియో మందుల వాడకానికి అంతరాయం కలిగించవు.
4. హోమియో మందులు వాడినపుడు రోగ లక్షణాలు కొంచెం ఎక్కువైనట్లు మొదట కనిపించినా అవి వెంటనే తగ్గిపోతాయి. ఇలాంటివి జరగడంవల్ల సరైన మందు వాడినట్లు, అది పనిచేస్తున్నట్లు పరోక్షంగా నిర్దారణ కలుగుతుంది.
5. వైద్యుడు ఒకవేళ సరైన మందు వాడకపోయినా, మరోమందు వాడినా అది పనిచేయకపోవచ్చు కాని దుష్ఫలితాలు మాత్రం వుండవు.
6. ఈ వైద్య విధానంలో రోగ లక్షణాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మందు నిర్ధారణ జరగదు. రోగి మనస్తత్వం, స్వభావం, అలవాట్లు, అనుభూతులు, మనోవికారాలు, రాగద్వేషాలు జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలతో సహా పరిగణనలోకి తీసుకొని మందు నిర్ధారిస్తారు. (ఈ సమాచారమంతా రోగి నుండి రాబట్టడానికి వైద్యునికి గంటకుపైగా సమయం పట్టవచ్చు) ఈ కారణంగానే ఒకేవిధమైన సమస్యపై వెళ్ళిన ఇద్దరు రోగులకు వేర్వేరు మందులు నిర్ధారించవలసి రావచ్చు.
7. హోమియో మందులు దీర్ఘవ్యాధులకే కాక, అప్పటికప్పుడు వచ్చే సమస్యకు కూడ అద్భుతంగా పనిచేస్తాయి.
8. వైద్యవిధానాలలో చౌకైనదిగా, అందరికి అందుబాటులో ఉండే సరళమైన, సహజమైన విధానంగా శరీరానికి ప్రయోజనమేకాని ఎట్టిహాని కలిగించనదిగా పేరు పొందింది.
9. ఈ మందులు దీర్ఘకాలం నిలువ ఉంచినా పాడయిపోవు.
10. ఓపికగా వైద్యుడు రోగియొక్క ఆరోగ్య చరిత్ర అధ్యయనం చేసి మందు నిర్ధారించడం, రోగి క్రమం తప్పకుండా మందుల వాడకం చేపడితే ఇంతకుమించిన వైద్యం మరొకటి లేదంటే అతిశయోక్తికాదు. సామాన్య ప్రజానీకానికి హోమియో వైద్య విధానంపై ఇంకా అవగాహన కల్పించాల్సివుంది.

డా|| యం.వి.నరేంద్రనాథ్‌రెడ్డి, యం.డి.(హోమియో) నెల్లూరు.
సెల్‌ : 80085 00556

First Published:  24 Sep 2018 9:30 PM GMT
Next Story