Telugu Global
NEWS

ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎలా అవుతుంది?

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ అంత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. చేవ ఉండి కూడా చేవలేని వ్యవస్థగా మాటలు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు సహజంగానే పోలీసు వ్యవస్థపై విమర్శలకు కారణమవుతున్నాయి. పోలీసు శాఖలో కీలకమైన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ పదేపదే మాటలు పడుతోంది. అయితే నిజంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతోందా? లేదంటే ఇంటెలిజెన్స్ నిర్వీర్వం అయ్యేలా ప్రభుత్వ పెద్దలు పనిచేశారా? అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణల నుంచి మొన్న ప్రముఖ […]

ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎలా అవుతుంది?
X

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ అంత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. చేవ ఉండి కూడా చేవలేని వ్యవస్థగా మాటలు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు సహజంగానే పోలీసు వ్యవస్థపై విమర్శలకు కారణమవుతున్నాయి. పోలీసు శాఖలో కీలకమైన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ పదేపదే మాటలు పడుతోంది. అయితే నిజంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతోందా? లేదంటే ఇంటెలిజెన్స్ నిర్వీర్వం అయ్యేలా ప్రభుత్వ పెద్దలు పనిచేశారా? అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణల నుంచి మొన్న ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం వరకు పరిశీలన చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా ఇంటిలిజెన్స్ వైఫల్యం అన్న మాట ఓటుకు నోటు సమయంలో వినిపించింది. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు ఫోన్లను తెలంగాణ అధికారులు ట్యాప్‌ చేయడంతో వ్యవహారం మొత్తం బయటకు వచ్చేసింది. దీంతో ఇంటెలిజెన్స్‌పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. సొంత ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాప్‌ చేస్తుంటే ఆ మాత్రం పసిగట్టలేకపోయారా? అంటూ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై వేటు వేశారు. అయితే అది ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎలా అవుతుందన్నది అంతుపట్టని అంశమే.

అసలు తమ ముఖ్యమంత్రి ఇలా పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బేరసారాలు చేస్తారని ఏ ఇంటెలిజెన్స్ అధికారి అయినా ఊహించగలరా? చంద్రబాబు ముందు ఆలోచన ఉన్న వారే అయితే…. తాను తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుబోతున్నానని…. కాబట్టి తన ఆపరేషన్‌ను ఎవరైనా పసిగడుతున్నారేమో గమనించండి అని ముందే ఇంటెలిజెన్స్‌కు చెప్పి ఉండాల్సింది. అప్పుడు పక్క రాష్ట్రాల్లోనైనా పట్టుబడకుండా ఉండేవారేమో!. అనురాధను పక్కకు తొలగించి ఏబీ వెంకటేశ్వరరావును చంద్రబాబు ఏరికోరి తెచ్చిపెట్టుకున్నారు.

వెంకటేశ్వరరావు అండ్ టీంను చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు అధికంగా వాడారన్న ఆరోపణ ఉంది. అయితే ఆయన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సేవ చేయడం కన్నా చంద్రబాబుకు సేవ చేయడంలోనే ఎక్కువ తృప్తి పొందుతారన్న విమర్శ కూడా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. చట్టం అడ్డుపడకపోతే పచ్చచొక్కా వేసుకుని ఆఫీస్‌కు వచ్చేవాడన్న విమర్శలూ వైసీపీ నాయకులనుంచి వచ్చాయి.

ఇంటెలిజెన్స్ ఫోకస్ మొత్తం టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రీకృతం చేయడం వల్ల పలుమార్లు శాంతిభద్రతల వైఫల్యాలు ఎదురయ్యాయి. తుని రైలు ఘటన నుంచి తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ విధ్వంసం వరకు ఆ విషయం రుజువవుతూనే ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేల స్థితి గతులపై నిఘా ఉంచి… వారిని టీడీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా సరే ఇంటెలిజెన్స్‌ను ఆడిస్తున్న చంద్రబాబులో మార్పు రాలేదు.

ఇంటెలిజెన్స్ సిబ్బందిని నిత్యం తన పార్టీ పరిస్థితిపై సర్వేలు చేయించుకునేందుకు వినియోగిస్తూ వచ్చారే గానీ… రాష్ట్రంలో అసాంఘిక శక్తులేమైనా బలపడుతున్నాయా? అన్న కోణంలో నిఘా ఉంచలేకపోయారు. ఇంటెలిజెన్స్‌ను చంద్రబాబు ఎంత తప్పుగా వాడుతున్నారు అన్న దానికి మరో నిదర్శనం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్లో ఏపీకి చెందిన వందల మంది ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బంది గత నెల రోజులుగా మకాం వేయడమే.

ఈ విషయాన్ని దేశంలోనే అత్యంత విశ్వసనీయత ఉన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రికే ప్రచురించింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఫలితాన్ని పరిశీలించడంతో పాటు, ఎక్కడ టీడీపీ బలంగా ఉందన్నది పసిగట్టేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ను చంద్రబాబు తెలంగాణ మీదకు మళ్లించారు. ఈ సంఘటనను బట్టే ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ కోణంలో పనిచేస్తోందన్నది అర్థం చేసుకోవచ్చు. అసాంఘిక శక్తుల కదలికలను గమనించడం తమ కర్తవ్యం అన్న సంగతినే ఏపీ ఇంటెలిజెన్స్ మరిచిందా? అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఇలా దారి తప్పింది అన్నది…. తమ కర్తవ్యం ఏంటో ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియంది కాదు.

కానీ వారిని ముఖ్యమంత్రి చంద్రబాబే మరో పనికి పురమాయించడం ద్వారా పరిస్థితి అదుపు తప్పేలా చేశారు. ఒకప్పుడు మావోయిస్టులు రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటేనే భయపడేలా నిఘా నిర్వహించిన ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోతోంది? 70 మంది మావోయిస్టులు ఎమ్మెల్యేను పట్టుకుని అర గంట పాటు ప్రశ్నించి నింపాదిగా హత్య చేసి వెళ్లగలిగారన్నా…… ఒక ఆశ్రమం వద్ద రోజుల తరబడి గొడవ నడిచిందన్నా…. ఓటుకు నోటు కేసు సమయంలో ఫోన్ల ట్యాంపరింగ్‌ను పసిగట్టలేకపోయారన్నా…. అది ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం మాత్రమే కాదు.

ఇంటెలిజెన్స్‌ను టీడీపీ బల పర్యవేక్షణకు, ప్రతిపక్షాలపై నిఘాలకు, పక్క రాష్ట్రంలో ఎన్నికల తంతుకు దారి మళ్లించిన ముఖ్యమంత్రి చంద్రబాబుదే పెద్ద వైఫల్యం.

First Published:  25 Sep 2018 3:00 AM GMT
Next Story