Telugu Global
NEWS

టీవీ చానళ్లకు డీజీపీ వార్నింగ్

రేటింగ్‌ ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి టీవీ చానళ్లు ఈ మధ్య పడరాని పాట్లే పడుతున్నాయి. తాము చూపే అంశం సమాజానికి మంచి చేస్తుందా మరింత హాని చేస్తుందా అన్న దానితో సంబంధం లేకుండా ముందుకెళ్తోంది మీడియా. హింసాత్మక సంఘటన‌లను, సమాజంలో అలజడికి కారణమైన అంశాలను పదేపదే ప్రసారం చేయకూడదన్న యాక్ట్ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకునే పరిస్థితిలో తెలుగు టీవీ చానళ్లు లేవు. మిర్యాలగూడలో జరిగిన ఘోరాన్ని కొద్దిరోజులుగా టీవీ చానళ్లు పదేపదే పోటీ పడి చూపిస్తున్నాయి. ఇలాంటి […]

టీవీ చానళ్లకు డీజీపీ వార్నింగ్
X

రేటింగ్‌ ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి టీవీ చానళ్లు ఈ మధ్య పడరాని పాట్లే పడుతున్నాయి. తాము చూపే అంశం సమాజానికి మంచి చేస్తుందా మరింత హాని చేస్తుందా అన్న దానితో సంబంధం లేకుండా ముందుకెళ్తోంది మీడియా. హింసాత్మక సంఘటన‌లను, సమాజంలో అలజడికి కారణమైన అంశాలను పదేపదే ప్రసారం చేయకూడదన్న యాక్ట్ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకునే పరిస్థితిలో తెలుగు టీవీ చానళ్లు లేవు. మిర్యాలగూడలో జరిగిన ఘోరాన్ని కొద్దిరోజులుగా టీవీ చానళ్లు పదేపదే పోటీ పడి చూపిస్తున్నాయి.

ఇలాంటి సంఘటనలను మరిన్ని జరిగేలా ప్రేరేపించే తరహాలో ఆ ప్రసారాలు ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఇంతలోనే హైదరాబాద్‌లో ప్రేమవివాహం చేసుకున్న దంపతులపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేయడంతో మరింత కలకలం రేగింది. ఇలా తన కూతురిపై కత్తితో దాడి చేయడానికి మిర్యాలగూడ ఘటనను టీవీల్లో పదేపదే చూడడం కారణమని మోహనా చారీ చెప్పినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో టీవీ చానళ్లకు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. హింసాత్మక ఘటనలను పదేపదే ప్రసారం చేయవద్దని సూచించారు. ఇలాంటి కథనాల వల్ల మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగేలా ప్రేరేపిస్తున్నట్టుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కొన్ని టీవీ చానళ్లు కేబుల్ టీవీ ప్రొగ్రాం కోడ్‌ యాక్ట్‌ 1995ను ఉల్లంఘిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇలాంటి హింసాత్మక సంఘటనలను పదేపదే పనిగట్టుకుని ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలకు డీజీపీ కోరారు. తీరు మారకుంటే కేబుల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమాజ శ్రేయస్సు, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సున్నితమైన ప్రసారాల విషయంలో నియంత్రణ పాటించాలని సూచించారు.

First Published:  20 Sep 2018 10:42 PM GMT
Next Story