Telugu Global
Family

యయాతి

ఒకరి వయసు ఒకరు ఇచ్చిపుచ్చుకొనే వీలుందా? అలాంటి కథొకటి ఉంది. అదే యయాతి కథ! యయాతి చంద్ర వంశపురాజు. తల్లి ప్రియం వద. తండ్రి నహుషుడు. యయాతి ఎప్పట్లాగే ఒకరోజు వేటకు వెళ్ళాడు. అడవిలో స్త్రీ రోదన విన్నాడు. ఆ దిశగా వెళ్ళాడు. బావిలో బట్టలు లేకుండా ముడుచుకు కూర్చొని ఏడుస్తున్న స్త్రీని కనుగొన్నాడు. తన ఒంటి  మీద ఉత్తరీయాన్నిచ్చాడు. నడుముకుచుట్టిన బట్ట కూడా ఇచ్చాడు. కట్టుకున్నాక బలమైన చెట్టు తీగల్ని వేసి గట్టువరకు లాగాడు. తన […]

ఒకరి వయసు ఒకరు ఇచ్చిపుచ్చుకొనే వీలుందా? అలాంటి కథొకటి ఉంది. అదే యయాతి కథ!

యయాతి చంద్ర వంశపురాజు. తల్లి ప్రియం వద. తండ్రి నహుషుడు. యయాతి ఎప్పట్లాగే ఒకరోజు వేటకు వెళ్ళాడు. అడవిలో స్త్రీ రోదన విన్నాడు. ఆ దిశగా వెళ్ళాడు. బావిలో బట్టలు లేకుండా ముడుచుకు కూర్చొని ఏడుస్తున్న స్త్రీని కనుగొన్నాడు. తన ఒంటి మీద ఉత్తరీయాన్నిచ్చాడు. నడుముకుచుట్టిన బట్ట కూడా ఇచ్చాడు. కట్టుకున్నాక బలమైన చెట్టు తీగల్ని వేసి గట్టువరకు లాగాడు. తన కుడి చేతిని అందించాడు. ఆమె అందుకున్నది కుడి చేత్తోనే. బావిలోంచి బయటకు తీశాడు. తాను రాక్షస గురువు శుక్రాచార్యుని కూతుర్నని, తన పేరు దేవయాని అని చెప్పింది. రాజు కూతురు శర్మిష్ఠ తనని నూతిలోకి తోసి వెళ్ళిపోయిందని చెప్పింది. ఇంతలో దేవయాని పరిచారికలు రావడంతో యయాతి అక్కడి నుండి వెనక్కి వచ్చేసాడు.

మళ్ళీ కొన్నాళ్ళకు అదే అడవికి వెళ్ళాడు యయాతి. దేవయాని మళ్ళీ కనిపించింది. శర్మిష్ఠనూ ఆమె చెలికత్తెలను తన దాసీగా చేసుకొని విహారానికి వచ్చింది. యయాతిని చూసి ఇష్టపడింది. ఆ విషయం చెప్పింది. నీవు బ్రాహ్మణ కన్యవు, నేను క్షత్రియుడనని యయాతి చెప్పాడు. నాకుడిచేతిని నీకుడిచేతితో అందుకున్నప్పుడే – మన పెళ్ళి ఆనాడే జరిగిపోయింది అంది. పెళ్ళి చేసుకుందామంది. తండ్రికి చెప్పి దోషనివారణ చేయించింది. శుక్రుని అనుమతి తీసుకుంది. యయాతిని పెళ్ళాడింది. యయాతి వెంట తను వెళ్తూ దాసిని చేసుకున్న శర్మిష్ఠనూ ఆమె చెలికత్తెలనూ వెంట తీసుకు వెళ్ళింది. వెళ్ళే ముందు యయాతిని పక్కకుపిలిచి శర్మిష్ఠ రాజు కూతురైనా దేవయాని దాసి అని, ఆమెతో సంబంధం పెట్టుకుంటే సహించదని, జాగ్రత్తగా సంసారం జరుపుకొమ్మని చెప్పాడు.

యయాతి దేవయాని చెప్పినట్టు తన అంతఃపురంలో కాక వేరే భవనంలో శర్మిష్ఠను ఉంచాడు. కాలం గడిచింది. దేవయానితో యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కొడుకుల్ని కన్నాడు. ద్రుహ్యువు, అనువు, వూరుడు అనే ముగ్గురు కొడుకుల్ని శర్మిష్ఠతోకన్నాడు. కొన్నాళ్ళకి దేవయానికి నిజం తెలిసింది. నిలదీసింది. తండ్రి దగ్గరకు వెళ్ళిపోయింది. అవమానించమని కోరింది. యయాతి వెంట వచ్చాడు. ముసలివాడివి కమ్మని యయాతిని శుక్రుడు శపించాడు. యయాతి శాపవిముక్తి కలిగించమని కోరుకున్నాడు. నీ కొడుకులలో ఎవరైనా నీ వృద్దాప్యాన్ని తీసుకుంటే వాళ్ళ యవ్వనం నీకు వస్తుంది అని మార్గం చెప్పాడు.

ముసలివాడయిన యయాతి తన కొడుకులని పిలిచాడు. తనకు యవ్వనాన్ని ఇంకా అనుభవించాలని ఉంది అన్నాడు. వృద్ధాప్యం తీసుకోమన్నాడు. యవ్వనం ఇమ్మన్నాడు. కొడుకులు కాదన్నారు. మొదటిగా కాదన్న యదువుని – యదువంశము రాజ్యపాలనకు పనికిరాదన్నాడు. తుర్వసుని -తుర్వసువంశము ధర్మా ధర్మ వివేకం లేని వాళ్ళై కిరాతకులుకండన్నాడు. క్షత్రియులు శూద్రులయేలా శపించాడు. ద్రుహ్యని-ద్రుహ్యవంశము ముదిమి (ముసలితనం) రాకుండానే మృతులవుతారన్నాడు. చిన్నకొడుకు పూరుడు తన ముసలి తనాన్ని స్వీకరించి యవ్వనాన్ని యయాతికిచ్చాడు.

యవ్వన వంతుడైన యయాతి భోగ భాగ్యాలను అనుభవించాడు. ఇంద్రునితో స్నేహం చేసాడు. ఇంద్రుడిచ్చిన రథమ్మీద శత్రురాజుల మీదికి దండెత్తి “మహారథి” అని పేరు తెచ్చుకున్నాడు. చివరకు తన ముసలితనం తాను తీసుకొని వూరునికి, యవ్వనాన్ని ఇవ్వడమే కాదు తన రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ని చేసాడు. ఆ తర్వాత అడవులకు వెళ్ళి అంతులేని తపస్సు చేశాడు. బ్రహ్మలోకమూ దేవలోకమూ ఆ శక్తితోనే వెళ్ళగలిగాడు. కాని దేవలోక మహర్షుల తపోశక్తిని తన తపోశక్తితో పోల్చి తక్కువ చేసాడు. కోపం వచ్చిన ఇంద్రుడు స్వర్గలోక భ్రష్టుడివి కమ్మని శపించాడు. అయినా యయాతి భూలోకానికి తిరిగిరాలేదు. అంతరిక్షంలో అద్భుతభవనం నిర్మించుకొని ఇంద్రుని అనుమతితోనే ఉన్నాడు. అలా కొంత కాలం గడపి ఊర్ద్యలోకాలకు వెళ్ళిపోయాడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  19 Sep 2018 1:02 PM GMT
Next Story