Telugu Global
Family

జెన్‌ సన్యాసిని 

జపాన్‌లో ఒక జెన్‌ సన్యాసిని ఉండేది. ఆమె జెన్‌ మార్గంలో అత్యున్నత స్థాయిని అందుకున్న స్త్రీ. ధ్యాన మార్గంలో కొద్దిమంది స్త్రీలు మాత్రమే అత్యున్నత స్థాయిని అందుకుని ఉంటారు. అట్లాంటి వాళ్ళలో ఆమె ప్రథమ స్థానంలో ఉంటుంది.             జెన్‌ మార్గాన్ని అందుకోవడమంటే ప్రాపంచిక పరిమితుల్ని అధిగమించడం. అంతేకాదు ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించడం. ప్రపంచాన్ని దాటి వెళ్ళగలగడం.             సాధారణ ప్రజలు ప్రవక్తల బోధనల దగ్గరే ఆగిపోతారు. ప్రవక్తనే పరమాత్మగా భావిస్తారు. బౌద్ధమతస్థులు కొందరు బుద్ధుణ్ణి ఆరాధిస్తారు. […]

జపాన్‌లో ఒక జెన్‌ సన్యాసిని ఉండేది. ఆమె జెన్‌ మార్గంలో అత్యున్నత స్థాయిని అందుకున్న స్త్రీ. ధ్యాన మార్గంలో కొద్దిమంది స్త్రీలు మాత్రమే అత్యున్నత స్థాయిని అందుకుని ఉంటారు. అట్లాంటి వాళ్ళలో ఆమె ప్రథమ స్థానంలో ఉంటుంది.

జెన్‌ మార్గాన్ని అందుకోవడమంటే ప్రాపంచిక పరిమితుల్ని అధిగమించడం. అంతేకాదు ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించడం. ప్రపంచాన్ని దాటి వెళ్ళగలగడం.

సాధారణ ప్రజలు ప్రవక్తల బోధనల దగ్గరే ఆగిపోతారు. ప్రవక్తనే పరమాత్మగా భావిస్తారు. బౌద్ధమతస్థులు కొందరు బుద్ధుణ్ణి ఆరాధిస్తారు. బుద్ధుని విగ్రహాలను పూజిస్తారు.

జెన్‌ అనుయాయులు అలా కాదు. వాళ్ళు ఆత్మపరిశీలనలో ఉంటారు. బుద్ధునికి సాధారణ వ్యక్తికి వాళ్ళు తారతమ్యం చూడరు. బుద్ధుడు “ఆత్మ దీపోభవ” అన్నాడు అంటే “నీకు నువ్వే దీపం” అని అర్థం. ఆ స్థాయికి చేరుకోడానికి అన్ని అహంకారాల్ని వదులుకోవాలి.

ఆ జెన్‌ సన్యాసిని ఆ స్థాయిని అందుకుంది. ఆమె గ్రామాలు పర్యటించేది. భిక్షం స్వీకరించేది. ఆదరించిన వాళ్ళ ఇంట్లో ఒక పూట గడిపేది. మళ్ళీ మరో గ్రామం వెళ్ళేది.

కానీ అందరూ ఆదరించేవాళ్ళు కారు. అర్థం చేసుకునే వాళ్ళు కారు. సమాజంలో ఎప్పుడూ సంప్రదాయానికి కట్టుబడిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ కారణంగా ఆమె అనేక మార్లు నిరాదరణకు గురయ్యేది.

అట్లా చీకటి పడుతుండగా ఆమె ఒక గ్రామం చేరింది. ఆ గ్రామంలో ఆమె తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరూ లేకపోయారు. పైగా ఆమెను ద్వేషించారు.

ఆమెకు బాగా ఆకలివేస్తోంది. చలి విపరీతంగా ఉంది. ఎవరూ పట్టెడన్నం కూడా పెట్టలేదు. కనీసం రాత్రికి పడుకోవడానికి కూడా ఎవరూ అనుమతించలేదు.

అంత నిర్దయను కూడా ఆమె చిరునవ్వుతో స్వీకరించింది. చీకటి పడింది. చల్లగాలి వీస్తోంది. చంద్రుడు కొండల మీద నించీ వచ్చాడు. నక్షత్రాలు ఆకాశమంతా వెలిగిపోతున్నాయి.

ఆమె ఊరుదాటి ఒక చెట్టు కింది అరుగుమీద కూచుంది. ఆకాశంకేసి చూసింది. చంద్రుడు ఆమెను చూసి వెచ్చగా నవ్వాడు. నక్షత్రాలు చిరునవ్వు చిలకరించాయి. పక్కన పూపొదలో గుబురుగా పూలు విచ్చుకున్నాయి. వాటి మీద చంద్రకిరణాలు పడి మెరుస్తున్నాయి. గాఢ పరిమళం పరిసరమంతా వ్యాపించింది.

ఒక్కసారిగా ఆ సన్యాసిని కళ్ళ నించీ ఆనందభాష్పాలు రాలాయి. ప్రకృతి సామ్రాజ్యం పరవశంగా ఆమెను పలకరించింది. తనను కాదని, తనకు ఆశ్రయమివ్వని గ్రామస్థుల పట్ల ఆమెకు ఎంతో కృతజ్ఞతా భావం కలిగింది. వాళ్ళు తనకు ఆశ్రయమిస్తే తను ఎంత కోల్పోయేది. ఎంత పోగొట్టుకునేది. ఈ నిండు చంద్రుడు నిర్మలాకాశం, నిగ నిగలాడే నక్షత్రాలు, పులకరించే పూలు వీటన్నిట్నీ తను కోల్పోయేది కదా!.

ఆ ఆలోచన రాగానే అనంత అస్తిత్వం తనపట్ల చూపిన అభిమానానికి అభివాదం చేసింది. అదృష్టమంటే తనదే కదా! అని ఆనందంతో పులకించింది. ఆమె ఆకలి మాయమయింది, చలి పారిపోయింది. ఆమె సమస్త శరీరం ఒక సంగీత తరంగంలో తన్మయించింది!

– సౌభాగ్య

First Published:  18 Sep 2018 8:01 PM GMT
Next Story