Telugu Global
Family

దేవయాని

రాక్షస గురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని. తల్లి జయంతని, ఆమె ఇంద్రుని కూతురని జానపదులు చెపుతారు. మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి కచుడు వచ్చాడని తెలియక, తండ్రి దగ్గర శిష్యరికం కోరి వచ్చాడని దేవయాని నమ్ముతుంది. తొలిచూపులోనే ఇష్టపడింది. శిష్యునిగా కచుణ్ణి స్వీకరించమని తండ్రిని కోరుతుంది. కచుని పథకాన్ని యెరుగక సులువు చేస్తుంది. కచుణ్ణి ప్రేమిస్తుంది. నమ్ముతుంది. అతను లేనిదే జీవితం లేదనుకుంటుంది. అందుకే కచుడు కనిపించకపోయేసరికి ఆందోళన పడింది. తండ్రి ద్వారా కచుడు చనిపోయాడని తెలిసి […]

రాక్షస గురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని. తల్లి జయంతని, ఆమె ఇంద్రుని కూతురని జానపదులు చెపుతారు. మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి కచుడు వచ్చాడని తెలియక, తండ్రి దగ్గర శిష్యరికం కోరి వచ్చాడని దేవయాని నమ్ముతుంది. తొలిచూపులోనే ఇష్టపడింది. శిష్యునిగా కచుణ్ణి స్వీకరించమని తండ్రిని కోరుతుంది. కచుని పథకాన్ని యెరుగక సులువు చేస్తుంది. కచుణ్ణి ప్రేమిస్తుంది. నమ్ముతుంది. అతను లేనిదే జీవితం లేదనుకుంటుంది. అందుకే కచుడు కనిపించకపోయేసరికి ఆందోళన పడింది. తండ్రి ద్వారా కచుడు చనిపోయాడని తెలిసి కన్నీరయింది. తండ్రి మీద ఒత్తిడి తెచ్చింది. మృత సంజీవని విద్య ద్వారా కచుడు పునర్జీవించేలా చేసింది. ఒకసారి కాదు, మూడుసార్లు! చివరికి తండ్రి చనిపోతాడని తెలిసి – కచునికి ఆ విద్య నేర్పి తిరిగి తన ద్వారా తండ్రిని బతికించేలా చెయ్యొచ్చనీ నమ్మింది. కచుడు గురుపుత్రివి అన్నాడు. దేవయాని ప్రేమను తిరస్కరించాడు. సోదరివి అన్నాడు. కాదనడంతో “నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోవుగాక! అని శపించింది. “బ్రాహ్మణ కన్యవైనా బ్రాహ్మణుని పెళ్ళాడకుండుగాక!” అని కచుని ద్వారా ప్రతిశాపమూ పొందింది.

రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. చెలికత్తెలతో వచ్చింది. ఎప్పటిలా దేవయానినీ తనతో తీసుకు వెళ్ళింది. బట్టలు ఒడ్డున పెట్టి నదిలో స్నానానికి దిగారు. పెద్ద గాలొచ్చింది. బట్టలు కలిసిపోయాయి. శర్మిష్ఠ దేవయాని బట్టలు కట్టుకుంది. తన దుస్తులు దేవయానిని కట్టుకోమంది. దేవయాని ఒప్పలేదు. నేను మీ కుల గురువు పుత్రిక నంది. నీవొదిలిన బట్టలు కట్టనంది. శర్మిష్ఠ తాను రాజపుత్రిక నంది. సేవకుడి కూతురికి ఇంత పొగరు పనికి రాదంది. మాటా మాటా పెరిగింది. ఉక్రోషం పట్టలేక శర్మిష్ఠ దేవయానిని తోసేసి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న బావిలో పడింది దేవయాని. ఏడుస్తూ అలాగే ముడుచుకు ఉండిపోయింది. వేటకు వచ్చిన యయాతి అనే రాజు ఏడుపు విని వచ్చాడు. చూసాడు. తన వంటిన ఉన్న ఉత్తరీయం విసిరాడు. కట్టుకున్నాక దేవయానిని బావిలోంచి బయటకు తీసాడు. ఇంతలో వెతుక్కుంటూ పరిచారికలు వచ్చారు. జరిగిన సంగతంతా చెప్పింది. తన తండ్రికి చెప్పమంది. చెప్పారు. తండ్రి శుక్రుడు వచ్చాడు. రమ్మన్నాడు. వృషపర్వుని నగరానికి రానంది. నీవు లేకుండా నేనూ వెళ్ళనన్నాడు శుక్రుడు. ఈ విషయం వృషపర్వునికి తెలిసింది. పరిగెత్తుకు వచ్చాడు. క్షమాపణకోరాడు. తన చేతిలో లేదన్నాడు శుక్రుడు. శర్మిష్ఠనూ ఆమె వెయ్యిమంది చెలికత్తెలతో కలిపి తనకు దాసీగా పంపమంది. అప్పుడు నగరంలో అడుగుపెడతానంది. రాక్షస జాతి మనుగడకోరి అంగీకరించాడు రాజు. శర్మిష్ఠ ఆమె చెలులంతా దేవయానికి దాసీలయ్యారు.

యయాతి అడవికి మళ్ళీ వచ్చాడు. నా దక్షిణ హస్తం పట్టుకున్నావు, కనుక పాణీ గ్రహణం చేసుకోమని దేవయాని కోరింది. నేను క్షత్రియుడనన్నాడు. దేవయాని దోషం లేకుండా తండ్రి అనుమతిని కోరింది. ఇచ్చాడు. పెళ్ళయింది. దేవయాని యయాతి వెంట వెళ్తూ శర్మిష్ఠనీ ఆమెచెలుల్నీ దాసీలుగా తీసుకు వెళ్ళింది. యదువు, తుర్వసువు అని ఇద్దరు కొడుకుల్ని కన్నది. తర్వాత యయాతి వలనే శర్మిష్ఠకు ముగ్గురు కొడుకులు కలిగారని తెలిసి దేవయాని నిలదీసింది. మాట తప్పిన యయాతితో ఉండనంది. తండ్రి దగ్గరకు చేరింది. తనకు జరిగిన అన్యాయం తండ్రికి చెప్పింది. శుక్రుడూ కోపంతో “తక్షణమే ముసలివాడవు కమ్ము!” అని శపించేసాడు. యయాతి ముసలి వాడయిపోయాడు. మన్నించమన్నాడు. మార్గం చూపమన్నాడు. కొడుకుకు తన వృద్దాప్యాన్నిచ్చి యవ్వనాన్ని తీసుకున్నాడు యయాతి. అలా చాలా యేళ్ళు మళ్ళీ యవ్వన యయాతితో రాజభోగాలను అనుభవించింది దేవయాని.

కచుని వల్ల జరిగిన అన్యాయానికి అవస్థలు పడ్డ దేవయాని ఆపైన అదే అవస్థలు పెట్టడానికి వెనకాడలేదు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  17 Sep 2018 1:02 PM GMT
Next Story