Telugu Global
NEWS

మిర్యాల‌గూడ వైపు జానారెడ్డి చూపు !

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, సీఎల్పీ నేత జానారెడ్డి సీటు మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మిర్యాల‌గూడకు షిప్ట్ అవుతార‌ని ఓ వార్త వైర‌ల్ అవుతోంది. త‌న ప‌ట్టు ఎక్కువ‌గా ఉంద‌ని భావిస్తున్న మిర్యాల‌గూడ నుంచి పోటీ చేయాల‌ని జానారెడ్డి ఆలోచిస్తున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో భాస్క‌ర‌రావును గెలిపించింది తానేన‌ని చాలా సార్లు జానారెడ్డి చెప్పారు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌డంతో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి లేకుండా పోయారు. దీంతో ఈ సారి […]

మిర్యాల‌గూడ వైపు జానారెడ్డి చూపు !
X

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, సీఎల్పీ నేత జానారెడ్డి సీటు మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మిర్యాల‌గూడకు షిప్ట్ అవుతార‌ని ఓ వార్త వైర‌ల్ అవుతోంది. త‌న ప‌ట్టు ఎక్కువ‌గా ఉంద‌ని భావిస్తున్న మిర్యాల‌గూడ నుంచి పోటీ చేయాల‌ని జానారెడ్డి ఆలోచిస్తున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో భాస్క‌ర‌రావును గెలిపించింది తానేన‌ని చాలా సార్లు జానారెడ్డి చెప్పారు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌డంతో ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి లేకుండా పోయారు. దీంతో ఈ సారి ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే జానారెడ్డి ప్లాన్‌.

మిర్యాల‌గూడ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా భాస్క‌ర్‌రావు ఉన్నారు. ఆయ‌న‌కు బ‌లం అంతా జానారెడ్డి వ‌ర్గానిదే. ఇప్పుడు స్వ‌యంగా జానారెడ్డి రంగంలోకి దిగితే భాస్క‌ర‌రావు డ‌మ్మీ అయిపోతారు. జానారెడ్డి గెలుపు ఈజీ అవుతుంద‌ని ఆయ‌న వ‌ర్గం ఆలోచ‌న చేస్తోంది. అయితే జానారెడ్డి మిర్యాల‌గూడ నుంచి పోటీ చేస్తే నాగార్జున సాగర్ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు? ఈ ప‌శ్న‌కు జానా వ‌ర్గం ద‌గ్గ‌ర రెడీమెడ్ స‌మాధానం ఉంది. జానారెడ్డి త‌న‌యుడు ర‌ఘువీర్‌రెడ్డి ఇక్క‌డి నుంచి పోటీలో ఉంటార‌ని చెబుతున్నారు.

ముందు నుంచి జ‌రుగుతున్న‌ప్ర‌చారం ప్ర‌కారం మిర్యాల‌గూడ నుంచి ర‌ఘువీర్‌రెడ్డి పోటీ చేయాలి. కానీ తాజాగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో తండ్రీ కొడుకులు సీట్లు మారుతున్నార‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా జానారెడ్డి ఇటీవ‌ల మిర్యాల‌గూడ‌లో త‌రుచూ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

నాగార్జున‌సాగ‌ర్ నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున బ‌రిలో ఉన్న నోముల న‌ర్సింహ్మ‌య్య స్థానికేతరుడ‌ని….త‌మ‌కే టికెట్ ఇవ్వాల‌ని గులాబీద‌ళంలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్న‌పరెడ్డి లాంటి నేత‌లు అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న అస‌మ్మ‌తి స్వ‌రం త‌మ‌కి క‌లిసివ‌స్తుంద‌ని కాంగ్రెస్ నేతల అంచ‌నా.

ఇటు మిర్యాల‌గూడ‌లో టికెట్ ద‌క్క‌ని టీఆర్ఎస్ నేత‌లు త‌మ‌కు స‌హ‌క‌రించొచ్చ‌ని జానావ‌ర్గం లెక్క‌లు వేస్తోంది. దీంతో ఈ రెండు నియోజ‌క‌వర్గాలలో త‌మ గెలుపు సులువు అవుతుంద‌ని అంటున్నారు.

First Published:  17 Sep 2018 11:47 PM GMT
Next Story