జాతీయ ఉత్తమ చిత్రంలో నటించాడు...పూరింట్లో ఉంటున్నాడు!
ఈ ఏడాది కన్నడంలో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన తీతీలో గడ్డప్ప పాత్రని పోషించిన చన్నె గౌడ తన నటనతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. లక్షల రూపాయల విలువ చేసే భూమిని కలిగి ఉండి… కొడుకుపేరు మీద పెట్టేందుకు ఇష్టపడని పాత్రలో నటించిన 73 ఏళ్ల చన్నెగౌడ నిజజీవితంలో కడు నిరుపేద. అతనికి ఉన్నది ఒకేఒక్క పూరి గుడిసె. దానిమీద గడ్డితో పాటు వాన పడకుండా పాలిథిన్ కవర్లు కప్పి ఉంటాయి. నోడ్ కొప్పుల అనే గ్రామంలో […]
ఈ ఏడాది కన్నడంలో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన తీతీలో గడ్డప్ప పాత్రని పోషించిన చన్నె గౌడ తన నటనతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. లక్షల రూపాయల విలువ చేసే భూమిని కలిగి ఉండి… కొడుకుపేరు మీద పెట్టేందుకు ఇష్టపడని పాత్రలో నటించిన 73 ఏళ్ల చన్నెగౌడ నిజజీవితంలో కడు నిరుపేద. అతనికి ఉన్నది ఒకేఒక్క పూరి గుడిసె. దానిమీద గడ్డితో పాటు వాన పడకుండా పాలిథిన్ కవర్లు కప్పి ఉంటాయి. నోడ్ కొప్పుల అనే గ్రామంలో ఉంటున్న చన్నెగౌడకు గుండె వ్యాధి ఉంది. శ్వాస సమస్యలు, వినికిడి సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటి మధ్య ఆయనకు ఒక ఇల్లు కట్టుకోవటం కష్టంగా ఉంది.
తీతీలో తన నటనను అంతా మెచ్చుకుంటున్నారని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి తనతో ఫొటోలు దిగుతుంటారని..కానీ వాళ్లకి తానొక హార్ట్ పేషంట్నని తెలియదని అంటాడతను. షూటింగ్ సమయంలో కూడా తను అనారోగ్యానికి గురికాగా దర్శకుడు రామ్ రెడ్డి తనకు వైద్యం చేయించినట్టుగా అతను తెలిపాడు. తీతీ సినిమాకు అతనికి పారితోషకం లభించినా అదంతా ఆసుపత్రి ఖర్చులకే సరిపోయింది. కొన్నేళ్ల క్రితం భార్యని కోల్పోయిన చన్నెగౌడను ఇప్పుడు కూతుళ్లు చూసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం కానీ, జిల్లా పాలనా యంత్రాంగం కాని, సినిమా నిర్మాతలు కానీ చన్నెగౌడని ఆదుకోవాలని ఆయన బంధువులు కోరుతున్నారు. తీతీ సినిమాకు సహ రచయితగా పనిచేసిన ఎరే గౌడ చన్నె గౌడకు మనుమడు అవుతాడు. చన్నెగౌడ ప్రస్తుతం మరొక కన్నడ చిత్రంలో నటిస్తూ, తన జీవితం మారుతుందని ఎదురుచూస్తున్నాడు.