Telugu Global
NEWS

మ‌ద్యం స‌ప్ల‌యికి వ‌య‌సు ప‌రిమితి పెట్టారు...మ‌రి న‌కిలీ ఐడి కార్డుల సంగ‌తి!

నేరాలు జ‌ర‌గ‌కుండా పోలీసులు ఒక దారిని మూసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే…నేర‌గాళ్ల‌కు ప‌క్క‌న ప‌ది అడ్డ‌దారులు క‌న‌బ‌డుతుంటాయి. చాలా సంద‌ర్భాల్లో ఇలా జ‌రుగుతుంటుంది. బంజారాహిల్స్ లో యువ‌కులు తాగి కారు న‌డిపిన ఉదంతంలో చిన్నారి ర‌మ్య మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం త‌రువాత…. హైద‌రాబాద్ సిటీలో వ‌యోప‌రిమితి దాట‌ని యువ‌త‌కు మ‌ద్యం అమ్మ‌రాద‌నే నిబంధ‌న‌ను గ‌ట్టిగా అమ‌లుచేయాల‌నే  నిర్ణ‌యానికి పోలీసు అధికారులు వ‌చ్చారు. కానీ దాని అమ‌లులో ఉన్న లొసుగులు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వ‌యోప‌రిమితి […]

మ‌ద్యం స‌ప్ల‌యికి వ‌య‌సు ప‌రిమితి పెట్టారు...మ‌రి న‌కిలీ ఐడి కార్డుల సంగ‌తి!
X

నేరాలు జ‌ర‌గ‌కుండా పోలీసులు ఒక దారిని మూసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే…నేర‌గాళ్ల‌కు ప‌క్క‌న ప‌ది అడ్డ‌దారులు క‌న‌బ‌డుతుంటాయి. చాలా సంద‌ర్భాల్లో ఇలా జ‌రుగుతుంటుంది. బంజారాహిల్స్ లో యువ‌కులు తాగి కారు న‌డిపిన ఉదంతంలో చిన్నారి ర‌మ్య మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం త‌రువాత…. హైద‌రాబాద్ సిటీలో వ‌యోప‌రిమితి దాట‌ని యువ‌త‌కు మ‌ద్యం అమ్మ‌రాద‌నే నిబంధ‌న‌ను గ‌ట్టిగా అమ‌లుచేయాల‌నే నిర్ణ‌యానికి పోలీసు అధికారులు వ‌చ్చారు. కానీ దాని అమ‌లులో ఉన్న లొసుగులు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వ‌యోప‌రిమితి దాటిన‌ట్టుగా వెల్ల‌డించే న‌కిలీ ఐడికార్డులు అత్యంత తేలిగ్గా చ‌వ‌క‌గా దొరుకుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇలా న‌కిలీ ఐడెంటిటీ కార్డులు దొరుకుతుండ‌గా నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌టం ఎలా సాధ్య‌మ‌ని పోలీసులు, హోట‌ల్స్, బార్లు, రెస్టారెంట్ల య‌జ‌మానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ముఖ్యంగా పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సుల‌ను కోరిన పేరు, వ‌య‌సుతో కేవ‌లం వెయ్యి రూపాయ‌ల నుండి 15వంద‌ల లోపు ఖ‌ర్చుతో సృష్టించి ఇచ్చేవారు సిటీలో ఉన్నట్టుగా స‌మాచారం. రెండు ఫొటోలు ఇచ్చి, ఫాం మీద వివ‌రాలు రాసి, డ‌బ్బు చేతిలో పెడితే కోరిన‌ట్టుగా న‌కిలీ ఐడికార్డుల‌ను సృష్టించి ఇస్తున్నారు. ఇలాంటి ఏజంట్లు న‌గ‌రంలో చిన్న చిన్న కిరాణా షాపులు, మొబైల్ షాపులు, లాండ్రీ షాపుల‌ను అడ్డాగా చేసుకుని త‌మ దందా కొన‌సాగిస్తున్నారు. కొంత‌మంది మౌత్ ప‌బ్లిసిటీతో కూడా త‌మ బిజినెస్ సాగిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌యోప‌రిమితి దాట‌ని వారికి లిక్క‌ర్ అమ్మ‌వ‌ద్ద‌నే నిబంధ‌న‌లు ఉన్నా…ఐడెంటిటీ కార్డులు న‌కిలీవి అయితే ఈ నిబంధ‌న‌ల అమ‌లు సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. నేష‌న‌ల్ రెస్టారెంట్ అసోసియేష‌న్ ఆప్ ఇండియా ఇదే విష‌యాన్ని చెప్పింది. న‌కిలీ ఐడెంటిటీ కార్డుల స‌మ‌స్య‌ని ఎదుర్కోవ‌టం త‌మ వ‌ల్ల‌కాద‌ని పేర్కొంది. ఒక అబ్బాయి లేదా అమ్మాయి త‌మ‌కు 21 సంవ‌త్స‌రాలు నిండిన‌ట్టుగా ఐడి కార్డు చూపితే వారికి మ‌ద్యం అమ్మ‌బోమ‌ని ఎలా చెప్ప‌గ‌ల‌మ‌ని బార్లు, రెస్టారెంట్ల య‌జ‌మానులు అంటున్నారు. అయితే పోలీసుల వాద‌న వేరుగా ఉంది. చాలావ‌ర‌కు బార్ ల్లో ఐడి కార్డుని చెక్ చేయ‌కుండానే మ‌ద్యం అమ్ముతుంటార‌ని, కానీ త‌ప్ప‌నిసరిగా చెక్ చేయ‌టం అనే నిబంధ‌న పాటించాల‌ని వారు చెబుతున్నారు. న‌కిలీ ఐడి కార్డులు అనే స‌మ‌స్య ఉన్న‌ప్ప‌టికీ, అంద‌రూ ఫేక్ ఐడిలే తెస్తార‌ని లేదు…క‌నుక చెక్‌చేయ‌టం అనేది త‌మ విధిగా భావించాల‌ని, అప్పుడు వారి త‌ప్పులేకుండా ఉంటుంద‌ని పోలీసులు అంటున్నారు. ఆ త‌రువాత న‌కిలీ రుజువులు అని తేలితే…బార్ య‌జ‌మానుల త‌ప్పు ఉండ‌ద‌ని, అవి చూపిన‌వారికి మాత్ర‌మే సంబంధిత సెక్షన్ల ప్రకారం శిక్ష ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.

First Published:  29 July 2016 1:01 AM GMT
Next Story