మెడకి మసాజ్ చేయించుకుంటే బ్రెయిన్ స్ట్రోకొచ్చింది!
బెంగలూరులో ఈ సంఘటన జరిగింది. ఓ సెలూన్ షాపు, తమ వద్ద హెయిర్ కట్ చేయించుకుంటే తల, మెడ మసాజ్ కూడా ఉంటుందని మొత్తం కలిపి 100రూ. ప్యాకేజి అని ప్రకటించింది. బాబూ రెడ్డి (40) అనే వ్యాపారవేత్త మసాజ్ కూడా ఉంది కదా అని సెలూన్‌కి వెళ్లాడు, హెయిర్‌కట్‌తో పాటు మసాజ్ కూడా చేయించుకున్నాడు. అరగంట మసాజ్ తరువాత అతనికి మెడ పట్టేసి బెణికినట్టుగా అనిపించింది. అయితే మసాజ్ చేస్తున్నపుడు అలా మెడ పట్టేయటం కూడా […]
బెంగలూరులో ఈ సంఘటన జరిగింది. ఓ సెలూన్ షాపు, తమ వద్ద హెయిర్ కట్ చేయించుకుంటే తల, మెడ మసాజ్ కూడా ఉంటుందని మొత్తం కలిపి 100రూ. ప్యాకేజి అని ప్రకటించింది. బాబూ రెడ్డి (40) అనే వ్యాపారవేత్త మసాజ్ కూడా ఉంది కదా అని సెలూన్‌కి వెళ్లాడు, హెయిర్‌కట్‌తో పాటు మసాజ్ కూడా చేయించుకున్నాడు. అరగంట మసాజ్ తరువాత అతనికి మెడ పట్టేసి బెణికినట్టుగా అనిపించింది. అయితే మసాజ్ చేస్తున్నపుడు అలా మెడ పట్టేయటం కూడా ఉంటుందేమో అనుకుని అతను వెంటనే చెప్పలేదు.
మసాజ్ పూర్తయ్యాక ఇంటికి వెళుతుండగా మత్తుగా, శరీరం తూలుతున్నట్టుగా అనిపించింది. కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని వెళదామని కూర్చుండి పోయాడు. ఆ తరువాత కూడా అతనికి తన పరిస్థితిలో మార్పు కనిపించలేదు. చివరికి ఇది జరిగిన రెండోరోజు బాబు రెడ్డి అపస్మారక స్థితిలో కొలంబియా ఆసియా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితిలో వెంటిలేటర్‌తో గాలిని అందించి, వైద్యులు అతనికి చికిత్సచేశారు.
మెదడుకి రక్తాన్ని అందించే పెద్ద నరమొకటి చిట్లినట్టుగా ఎమ్ఆర్ఐ స్కానింగ్‌లో గుర్తించారు. గాలిని అందించడానికి శ్వాసనాళాల్లో ఒక ట్యూబుని అమర్చాల్సి వచ్చింది. బాబు చేయించుకున్న మెడ మసాజే ఈ పరిస్థితికి కారణమని డాక్టర్లు గుర్తించారు. శిక్షణ లేనివారు మసాజ్ చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని వారు వెల్లడించారు.
చిన్న వయసు, మధ్య వయసు వారిలో వచ్చే వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే సమస్యకు అతను గురయ్యాడని వారు తెలిపారు. ఇది తప్ప అతనికి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవని, అయితే అతను ప్రాణాలతో బయటపడటం అదృష్టమేనని వారు చెప్పారు. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయడం వలన బాబు ప్రాణాలు దక్కాయని, లేకపోతే అంగవైకల్యమో, ప్రాణాలు కోల్పోవడమో జరిగేదని డాక్టర్లు తెలిపారు.
పదిరోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండి కోలుకున్న బాబు, తనకు ఇంకా షాక్‌గానే ఉందంటున్నాడు. అతను ఇంకా మందులు వాడాల్సి ఉంది. ఇప్పుడు తను పోలీస్ కేసు పెట్టే స్థితిలో లేనని అతను చెప్పాడు. అదీ కాక, సెలూన్ వాళ్లిచ్చిన ప్యాకేజికి ఆశపడి, తానే వెళ్లాడు కనుక, వారిదే పూర్తి తప్పని అనలేమని అతను అంటున్నాడు. మొత్తానికి వంద రూపాయిల ప్యాకేజి బాబురెడ్డితో భారీగా వైద్య ఖర్చులు పెట్టించింది.