Telugu Global
Family

ఇద్దరు సేవకులు

పూర్వం కేరళలో ఒక ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడు. పూర్వం మనదేశంలో ఎందరో వందలమంది రాజులు పరిపాలించేవాళ్ళు వాళ్ళలో ఈ రాజు ఒకరు. ఆ రాజుకు ఎందరో సేవకులు వుండేవాళ్ళు. గోపాలన్‌, కృష్ణన్‌ అన్నయిద్దరు ఒకసారి రాజుగారి దగ్గర పనిలో చేరారు. కొన్నాళ్ళు గడిచాయి. కృష్ణన్‌ ఎక్కడున్నాడో ఎలా చేరాడో అక్కడే వుండిపోయాడు కానీ గోపాలన్‌ ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగాడు. అంచెలంచెలుగా పదోన్నతి పొందాడు. అతని జీతం కూడా కృష్ణన్‌ కన్నా పదిరెట్లు పెరిగింది. ఇందంతా […]

పూర్వం కేరళలో ఒక ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడు. పూర్వం మనదేశంలో ఎందరో వందలమంది రాజులు పరిపాలించేవాళ్ళు వాళ్ళలో ఈ రాజు ఒకరు. ఆ రాజుకు ఎందరో సేవకులు వుండేవాళ్ళు. గోపాలన్‌, కృష్ణన్‌ అన్నయిద్దరు ఒకసారి రాజుగారి దగ్గర పనిలో చేరారు. కొన్నాళ్ళు గడిచాయి.

కృష్ణన్‌ ఎక్కడున్నాడో ఎలా చేరాడో అక్కడే వుండిపోయాడు కానీ గోపాలన్‌ ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగాడు. అంచెలంచెలుగా పదోన్నతి పొందాడు. అతని జీతం కూడా కృష్ణన్‌ కన్నా పదిరెట్లు పెరిగింది. ఇందంతా కేవలం సంవత్సరంలోగానే జరిగింది. కృష్ణన్‌ ఈర్ష్య పడ్డాడు. యిందులో ఏదో అన్యాయం జరిగిందనుకున్నాడు. ఆ విషయం సరాసరి రాజుగారితోనే చెబుదామని నిర్ణయించుకున్నాడు.

ఒకరోజు రాజుగారి దగ్గరకు వినయంగా వెళ్ళి నమస్కరించి ‘రాజు గారూ! మిమ్మల్ని ఎంతో కాలంగా విశ్వాసపాత్రంగా మీకు సేవచేసుకుంటున్నాను. గోపాలన్‌ చేరిన సమయంలోనే చేరాను. ఐతే అతనికి నా కన్నా పదిరెట్లు జీతం పెరిగింది. నేను చేరినప్పుడు నాకెంత జీతమో యిప్పుడూ అదే జీతం ఎలాంటి మార్పూలేదు’ అన్నాడు.

రాజు సరే ఆ విషయం గురించి నేను ఆలోచిస్తాను’ అన్నాడు. అంతలో వీధిలో ఒక ఎడ్లబండి పోతూ కనిపించింది. రాజు కృష్ణన్‌తో ‘నువ్వెళ్ళి ఆ బండ్లో ఎవరు వెళ్ళు తున్నారో కనుక్కునిరా’ అన్నాడు.

వెంటనే కృష్ణన్‌ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు దక్షిణప్రాంతవాసులు. భార్యాభర్తలు నారాయణ అయ్యర్‌, లక్ష్మిఅమ్మూళ్‌ వాళ్ల పేర్లు అన్నాడు. వాళ్ళతో బాటు వాళ్ళ సేవకుడున్నాడు. అతని పేరు చందు అన్నాడు.

‘వాళ్ళెక్కడికి వెళుతున్నారో కనుకున్నారా’ అన్నాడు రాజు కృష్ణన్‌ వెళ్ళి అడిగాడు వాళ్ళు ఒక పెళ్ళికి వెళుతున్నట్లు రాజుతో చెప్పాడు రాజు అది ఎవరి పెళ్ళో కనుక్కో అన్నాడు. కృష్ణన్‌ మళ్ళీ వెళ్ళి బండిలోని వ్యక్తి తమ్ముడి పెళ్ళి అని తెలుసుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు తిరిగివస్తారో తెలుసా అన్నాడు. ‘వాళ్ళు శనివారానికి తిరిగి వస్తారట’ అన్నాడు ఆ విషయం తెలుసుకు వచ్చిన కృష్ణన్‌.

ఆ సమయానికే గోపాలన్‌ రాజుగారి దగ్గరకు వచ్చాడు. అదే సమయానికి వీధిలో యింకో ఎడ్లబండి వెళుతోంది. కృష్ణన్‌ రాజు పక్కనే వున్నాడు.

రాజు గోపాల్‌ని చూసి ‘ ఆ బండ్లో ఎవరున్నారో తెలుసుకునిరా’ అన్నాడు. గోపాలన్‌ వెళ్ళాడు. రాజుగారు కృష్ణన్‌ జరగబోయేదానికి సాక్షులుగా నిల్చున్నారు. ఐదు నిముషాల తర్వాత గోపాలన్‌ వచ్చాడు.

గోపాలన్‌ ‘రాజుగారు వాళ్ళుదూరువాసులట, యిద్దరు ముస్లింలు ఒకతని పేరు ఖదీర్‌, యింకొకతని పేరు అబ్దుల్‌’ అన్నాడు.

‘వాళ్ళెక్కడికి వెళుతున్నారో కనుక్కుని రా’ అన్నాడు.

‘రాజుగారూ ఆ విషయం అడిగాను. వాళ్ళు క్విలాన్‌ వెళుతున్నారట’ అన్నాడు ‘ఐతే వాళ్ళు ఏ పనిమీద క్విలాన్‌ వెళుతున్నారో కనుక్కునిరా’ అన్నాడు. ప్రభువుగారూ! ఆ విషయం కూడా అడిగాను. రాజుగారి న్యాయస్థానంలో ఏదో కేసు వుందట అన్నాడు.

‘ఏంటాకేసో కనుక్కునిరా’ అన్నాడు రాజు.

అది మూడు వేలకు సంబంధించిన సివిల్‌ కేసట. మూడేళ్ళకుమందు ఒక వ్యక్తి ఖదీరు దగ్గర అప్పు తీసుకున్నాడట’ అన్నాడు.

రాజు కృష్ణన్‌ వైపు తిరిగి నీకూ గోపాలన్‌కు మధ్య వున్న తేడాను గమనించావా! నాకు అవసరమయిన సమాచారంకోసం నువ్వు ఐదుసార్లు వెళ్ళావు. గోపాలన్‌ ఒక్కసారే వెళ్ళి నాకు అవసరమయిన దాని కన్నా ఎక్కువ సమాచారం సంపాదించుకుని వచ్చాడు. ‘అతని అభివృద్ధికి ఆదాయానికి కారణం నీకు అర్థమయిందనుకుంటాను’ అన్నాడు.

అందులో నిజాన్ని కృష్ణన్‌ గ్రహించాడు.

– సౌభాగ్య

First Published:  3 July 2016 1:02 PM GMT
Next Story