Telugu Global
Family

పిసినారి

ప్రపంచంలో పిసినారుల గురించి ఎన్నెన్నో కథలు వున్నాయి. ఒక్క పిసినారిది ఒక్కో ప్రత్యేకత. యూసెప్‌ బాగా డబ్బు సంపాదింరచాడు. ఐనా ఏం లాభం అతని కొడుకు తండ్రి సంపాదించిన డబ్బును విచ్చల విడిగా ఖర్చుచేసేవాడు. కొడుకు గురించి తండ్రికి దిగులు పట్టుకుంది. తన అనంతరం కొడుకు ఎట్లాబతుకుతాడా? అనిపించింది. ముందు జాగ్రత లేకుంటే భవిష్యత్తులో నానాఅగచాట్లు పడాల్సి వుంటుందని కొడుక్కు చెప్పినా కొడుకు లెక్కపెట్టలేదు. యూసెప్‌కు ఒక బావ మరది వున్నాడు. అతని పేరు ఉలహన్నన్‌. ఉలహన్నన్‌ […]

ప్రపంచంలో పిసినారుల గురించి ఎన్నెన్నో కథలు వున్నాయి. ఒక్క పిసినారిది ఒక్కో ప్రత్యేకత.

యూసెప్‌ బాగా డబ్బు సంపాదింరచాడు. ఐనా ఏం లాభం అతని కొడుకు తండ్రి సంపాదించిన డబ్బును విచ్చల విడిగా ఖర్చుచేసేవాడు. కొడుకు గురించి తండ్రికి దిగులు పట్టుకుంది. తన అనంతరం కొడుకు ఎట్లాబతుకుతాడా? అనిపించింది. ముందు జాగ్రత లేకుంటే భవిష్యత్తులో నానాఅగచాట్లు పడాల్సి వుంటుందని కొడుక్కు చెప్పినా కొడుకు లెక్కపెట్టలేదు.

యూసెప్‌కు ఒక బావ మరది వున్నాడు. అతని పేరు ఉలహన్నన్‌. ఉలహన్నన్‌ గొప్ప పిసినారి. అతని ‘కీర్తి’ దశదిశలా వ్యాపించింది. పొదుపు చెయ్యడంలో అతన్ని మించిన వాళ్ళు లేరు. పొదుపు చెయ్యడానికి అతనికి తెలిసినన్ని మార్గాలు ప్రపంచంలో ఎవరికీ తెలీవు.

యూసెప్‌ తన కొడుకును తన బావమరిది దగ్గరకు పంపితే కానీ డబ్బు విలువ తెలుసుకోలేడని నిర్ణయించాడు. అట్లాగే పొదుపు విషయం గురించి కూడా బావమరిది తన కొడుక్కి మార్గాలు చెబుతాడని భావించాడు.

యూసెపు కొడుకును తీసుకుని బావమరిది దగ్గరకు వచ్చాడు. ఉల హన్నన్‌ యింకొకర్నయితే దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కానీ బావ మరిది కొడుకు తప్పదుకదా! అతన్ని తనదగ్గర కొన్ని రోజులు ఉంచుకోడానికి అంగీకరించాడు.

యూసెప్‌ కొడకు ఉలహన్నన్‌ చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్నాడు ఆకళింపు చేసుకున్నాడు. అతను చెప్పిన పని తుచతప్పకుండా చేసేవాడు.

ఇట్లా ఒక నెల గడిచింది. కొడుకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి యూసెప్‌ బావమరిది యింటికి వచ్చాడు. అప్పుడే చీకటి పడింది అందరూ ఒక గదిలో ప్రార్థనకు కూర్చున్నారు. సాధారణంగా ప్రార్థనలో అందరూ కూచోడం ఆనవాయితి. ప్రార్థన ప్రారంభం కాబోతోంది. ప్రార్థన ఒక అరగంటసేపు పట్టవచ్చు. ఉలహన్నన్‌ ఎదురుగా నూనె దీపం చూశాడు. ప్రార్థన చేసేటప్పుడు దీపం అవసరం లేదన్న విషయాన్ని గమనించాడు. పైగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం కదా! అందుకని దీపం ఆర్పేశాడు. అరంగట పాటలు పాడారు. భజనలు చేశారు ఒకరి కొకరు కనిపించలేదు. కానీ గొంతులు వినిపించాయి.

అరగంట అయ్యాకా ఉలహన్నన్‌ దీపం వెలిగించాడు. పక్కనే కూచున్న తన బావమరిది కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే పూజకుముందు అతను వేరే బట్టలు వేసుకున్నాడు. యిప్పుడు మరోరకం బట్టలున్నాయి. యిదేలా జరిగిందో అంతుబట్టలేదు. ‘అవున్రా! పూజకుముందున్న బట్టలు వేరు ఎప్పుడు వేరు. ఎలా వీలయింది. ఎప్పుడు మార్చుకున్నావు? ఎలా మార్చుకున్నావు? అని ఉలహన్నన్‌ అడిగాడు.

ఆ కుర్రాడు ‘మామా! నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దీపాల అవసరం లేదని అన్నావు. అందుకని దీపం ఆర్పేశావు. అప్పుడే నానొక ఆలోచన వచ్చింది. ప్రార్థన చేసేప్పుడు దీపం తీసేశావు చీకటి. చీకట్లో బట్టల అవసరముందా! అనిపించింది. వెంటనే వెళ్ళి బట్టలు తీసేసి వచ్చి ప్రార్థనలో కూర్చున్నా ప్రార్థన ముగిసేముందు వెళ్ళి వేరే బట్టలు వేసుకొచ్చా’ అన్నాడు.

ఉలహన్నన్‌ కళ్ళలో మెరుపులు మెరిశాయి. ‘ఒరేయ్‌’! నేను నీకు పాఠాలు చెప్పేంత వాణ్ణికాను. నువ్వేనాకు పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగావు. నువ్వే నాగురువ్వు అన్నాడు. యూసెస్‌ తన కొడుకు ప్రయోజకుడు అయినందుకు పరమానంద పడ్డాడు.

– సౌభాగ్య

First Published:  27 Jun 2016 1:02 PM GMT
Next Story