Telugu Global
NEWS

రాముల‌మ్మ రీ ఎంట్రీ!

తెలంగాణ రాములమ్మ‌గా పేరుగాంచిన సినీన‌టి, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి చాలాకాలం త‌రువాత మీడియా ముందుకు వ‌చ్చారు. ఇటీవ‌ల టీఆర్ ఎస్‌లో చేరేందుకు కాంగ్రెస్ నేత‌లు వ‌రుస‌లు క‌డుతుండ‌టంతో కాంగ్రెస్ పార్టీ గులాబీ నేత‌ల తీరుపై విరుచుకుప‌డుతోంది. ఇందుకు ప్ర‌తిగా కేసీఆర్ ద‌గ్గ‌ర నుంచి టీఆర్ ఎస్ నేత‌లంతా కాంగ్రెస్‌పై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగానే.. వారు విజ‌య‌శాంతి పార్టీ మారిన విష‌యాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ పార్టీ నాయ‌కురాలైన విజ‌య‌శాంతిని కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారు? […]

రాముల‌మ్మ రీ ఎంట్రీ!
X
తెలంగాణ రాములమ్మ‌గా పేరుగాంచిన సినీన‌టి, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి చాలాకాలం త‌రువాత మీడియా ముందుకు వ‌చ్చారు. ఇటీవ‌ల టీఆర్ ఎస్‌లో చేరేందుకు కాంగ్రెస్ నేత‌లు వ‌రుస‌లు క‌డుతుండ‌టంతో కాంగ్రెస్ పార్టీ గులాబీ నేత‌ల తీరుపై విరుచుకుప‌డుతోంది. ఇందుకు ప్ర‌తిగా కేసీఆర్ ద‌గ్గ‌ర నుంచి టీఆర్ ఎస్ నేత‌లంతా కాంగ్రెస్‌పై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగానే.. వారు విజ‌య‌శాంతి పార్టీ మారిన విష‌యాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ పార్టీ నాయ‌కురాలైన విజ‌య‌శాంతిని కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారు? అని నిల‌దీశారు. దీనిపై రాముల‌మ్మ స్పందించారు. తాను 2014 ఫిబ్ర‌వ‌రిలో కాంగ్రెస్లో చేరిన మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించారు. అయితే, త‌న‌ను టీఆర్ ఎస్ పార్టీ నుంచి 2013 జూన్‌లోనే స‌స్పెండ్ చేశార‌ని వెల్ల‌డించారు. అందుకే తాను హ‌స్తం ప‌క్షాన చేరాల్సి వ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. త‌న‌కు, కేసీఆర్ కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని కూడా స్ప‌ష్టం చేశారు.
అస‌లేం జ‌రిగింది?
1998లో విజ‌య‌శాంతి బీజేపీలో చేరారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో బీజేపీ మ‌హిళా మోర్చా సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2004లో క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తార‌ని వార్త‌లు రావ‌డంతో సోనియాకు పోటీగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌య‌శాంతిని దించుతామ‌ని బీజేపీ ప్ర‌క‌టించింది. కానీ, అనూహ్యంగా సోనియా బ‌ళ్లారి నుంచి పోటీ చేయ‌డంతో విజ‌య‌శాంతి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. త‌రువాత 2008 జ‌న‌వ‌రిలోనే ఆమె త‌ల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. దాన్ని ఎంతోకాలం న‌డ‌ప‌లేక‌పోయారు. కార‌ణం.. విజ‌య‌శాంతి స్థానిక‌తపై మొద‌టి నుంచి వివాదం ఉంది. ఆమె తెలంగాణ వాసి కాద‌ని ప‌లువురు ఆరోపిస్తుంటారు.
దీనికి విజ‌య‌శాంతి వ‌ద్ద ఎలాంటి స‌మాధానం ఉండేది కాదు.
దీంతో 2009 జ‌న‌వ‌రిలోనే ఆమె త‌న పార్టీని తెలంగాణ రాష్ట్ర స‌మితిలో విలీనం చేశారు. ఫ‌లితంగా రాముల‌మ్మ‌కు మెద‌క్ పార్ల‌మెంటు నుంచి గెలిపించుకున్నారు కేసీఆర్‌. మెద‌క్ సెగ్మెంటు ప‌రిధిలో ఉన్న 7 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆమె 6 స్థానాల్లో బోటాబోటీ ఓట్లే వ‌చ్చాయి. ఒక్క సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓట్ల‌న్నీ ఏక‌ప‌క్షంగా ప‌డ‌టంతో ఆమె మొత్తానికి గెల‌వ‌గ‌లిగారు. త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆమె కాంగ్రెస్‌తో అంట‌కాగ‌డం మొద‌లు పెట్టారని వార్త‌లు రావ‌డంతో పార్టీ ఆగ్ర‌హించింది. దీంతో 2011లో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసినా.. స్పీక‌ర్ ఆమోదించ‌లేదు. చివ‌రికి 2014 ఎన్నిక‌ల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
త్వ‌ర‌లో పున‌రాగ‌మ‌నం..!
తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును మ‌రోసారి ప‌రీక్షించుకోనున్నారు విజ‌య‌శాంతి. ఈ మేర‌కు తెలంగాణ ప‌రిస్థితుల‌పై ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. సినిమా అనంత‌రం ఆమె తిరిగి తెలంగాణ రాజ‌కీయాల్లో క్రియాశీలకం కావాల‌ని వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. వ‌రుస‌గా కాంగ్రెస్ నేత‌లు కారెక్కుతుంటే.. పేరున్న నాయ‌కులు లేని తెలంగాణ కాంగ్రెస్‌కు విజ‌య‌శాంతి చేరిక గ్లామ‌ర్ తోపాటు కాస్త ఉప‌శ‌మ‌నం కూడా దొరుకుతుంది. మొత్తానికి ఆమె రీఎంట్రీ స‌రైన స‌మ‌యంలోనే చేస్తున్నార‌నిపిస్తోంది. మ‌రి ఈసారి ఆమె ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి.
First Published:  16 Jun 2016 11:03 PM GMT
Next Story