Telugu Global
NEWS

కేసీఆర్ పాల‌న‌పై మేధావుల‌ అసంతృప్తి !

తెలంగాణ‌ జేఏసీ అధ్య‌క్షుడు కోదండ‌రాం తెలంగాణ‌లో పాల‌న‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేసీఆర్ పాల‌న‌పై  మొద‌టి నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయ‌న ఏనాడూ కేసీఆర్ పాల‌న‌పై బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. గ‌తంలో జేఏసీ రాజకీయ శ‌క్తిగా ఆవిర్భవించాలంటూ ప‌లువురు కోరుతున్నారంటూ చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు. తాజాగా కేసీఆర్ పాల‌న స‌రిగాలేద‌ని, చేత‌గాకుంటే త‌ప్పుకోవాల‌ని సూచించారు. కోదండ‌రాం వ్యాఖ్య‌లు తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చానీయాంశ‌మ‌య్యాయి.  రెండేళ్ల పాల‌న‌లో మీరు చేసింది శూన్యం.. మీకు చేత‌గాక‌పోతే త‌ప్పుకోండి.. మేం చేసి చూపిస్తాం […]

కేసీఆర్ పాల‌న‌పై మేధావుల‌ అసంతృప్తి !
X
తెలంగాణ‌ జేఏసీ అధ్య‌క్షుడు కోదండ‌రాం తెలంగాణ‌లో పాల‌న‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేసీఆర్ పాల‌న‌పై మొద‌టి నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయ‌న ఏనాడూ కేసీఆర్ పాల‌న‌పై బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. గ‌తంలో జేఏసీ రాజకీయ శ‌క్తిగా ఆవిర్భవించాలంటూ ప‌లువురు కోరుతున్నారంటూ చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు. తాజాగా కేసీఆర్ పాల‌న స‌రిగాలేద‌ని, చేత‌గాకుంటే త‌ప్పుకోవాల‌ని సూచించారు. కోదండ‌రాం వ్యాఖ్య‌లు తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చానీయాంశ‌మ‌య్యాయి. రెండేళ్ల పాల‌న‌లో మీరు చేసింది శూన్యం.. మీకు చేత‌గాక‌పోతే త‌ప్పుకోండి.. మేం చేసి చూపిస్తాం అంటూ స‌వాలు విసిరారు. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి పేద‌లు, కుల‌వృత్తులు, వ్య‌వ‌సాయ రంగాల సంక్షేమానికి ప‌నికి వ‌చ్చే ప‌థ‌కాలు చేప‌ట్ట‌లేద‌ని ఎద్దేవా చేశారు. నిత్యం హైద‌రాబాద్ చుట్టే ప‌రిభ్ర‌మించ‌డం మంచిది కాద‌న్నారు. ప్ర‌త్యేక రాష్ర్టం వ‌చ్చినా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల బ‌తుకు బాగుప‌డే ప‌నుల‌కు బ‌దులు ఉమ్మ‌డి రాష్ట్రంలోని కాంట్రాక్ట‌ర్లు, కార్పొరేట్లకే పెద్ద‌పీట వేస్తున్నార‌ని ఆరోపించారు.
కేసీఆర్ ఓ వైపు ఈ రెండేళ్ల‌పాల‌న‌లో తనకు ఎదురులేకుండా దూసుకుపోతుంటే.. మేధావులు, కొందరు తెలంగాణ పోరాట యోదులు మాత్రం ఆయ‌న చేసింది అంతంతే అని పెద‌వి విరుస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి చంద్రబాబుకన్న మంచిగా పరిపాలిస్తున్నాడన్న అభిప్రాయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వుంది. అయితే కేసీఆర్ పాలనలో ప్రజల మేలుకన్న తాను, తన కుటుంబం రాజకీయంగా సుస్థిరంగా నిలదొక్కుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే ఎక్కువగా వుంటున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఒక సామాజిక వర్గాన్ని, వాళ్ల ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడడానికి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణవాదులకు మింగుడుపడడంలేదు.
కేసీఆర్ పాల‌న‌పై పౌర హ‌క్కుల నేత ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్, విద్యుత్ జేఏసీ ర‌ఘు కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై విశ్వాసం పెట్టుకున్నంత మాత్రాన‌.. అదే పూర్తిస్థాయి మ‌ద్ద‌తు కాద‌న్న సంగ‌తి గుర్తుపెట్టుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు మాకు పూర్తిగా తెలుసు అనుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని హ‌ర‌గోపాల్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించిన విద్యార్థులు ఇదే క్యాంప‌స్‌లో స‌భ‌లు పెట్టుకుంటామంటే.. అణ‌చివేయ‌డం మంచి సంప్ర‌దాయం కాద‌ని విమర్శించారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూ నిర్వాసితుల పోరాటాల‌ను ఏ మీడియా చూపించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్రాజెక్టుల వ‌ల్ల రాష్ట్రంపై మోయ‌లేని ఆర్థిక భారం ప‌డుతుంద‌ని విద్యుత్ జేఏసీ నేత ర‌ఘు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌ణుగూరు విద్యుత్ ప్రాజెక్టు , చ‌త్తీస్ ఘ‌డ్ విద్యుత్ ఒప్పందం , దామ‌ర‌చ‌ర్ల ప్రాజెక్టుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం ప‌డుతుంద‌న్నారు.
జేఏసీ నేత‌లు ఒక్క‌సారిగా బ‌హిరంగ వేదిక‌పై ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించడం చర్చానీయాంశ‌మైంది. ప్ర‌జ‌లు కోరుకున్న తెలంగాణ ఇది కాద‌ని వారు చెప్ప‌క‌నే చెప్పారు. వీరంతా ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌లు సందేహాలకు తావిస్తోంది. ఒక‌వేళ వీరు జేఏసీ త్వ‌ర‌లో పూర్తి స్థాయి రాజ‌కీయ వేదిక‌గా అవ‌త‌రించ‌నుందా? లేక ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌ట్ట‌డంలో ప్ర‌తిప‌క్షాలు విఫ‌ల‌మైన వేళ వీరంతా ఒక్క‌టై పోరాడుదామ‌ని నిర్ణ‌యించుకున్నారా? మొత్తానికి ఎలాంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేని జేఏసీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు మాత్రం గులాబీ నేత‌ల‌ను ఆందోళ‌న‌లో ప‌డేసిన‌ట్లే ఉన్నాయి.
First Published:  5 Jun 2016 11:12 PM GMT
Next Story