Telugu Global
Family

తెలివైన అమ్మాయి

అమర్‌ సింగ్‌ గొప్ప సంపన్నుడు. వ్యాపారవేత్త ఆలోచనా పరుడు అతనికి ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు. కొడుక్కి పెళ్ళివయసు వచ్చింది. పెళ్లి చేయాలనుకున్నాడు. ఎందరో సంపన్నులు సామంతులు చివరికి రాజుగారు కూడా తమ కూతుళ్ళను యివ్వడానికి ముందుకొచ్చారు. అమర్‌సింగ్‌ ఆస్థులు, అంతస్థులు చూసే స్థాయి దాటిపోయాడు. ఎందుకంటే ఐశ్వర్యపు అంచులు చూశాడు. ఇప్పుడతనికి కావలసింది వివేకవంతురాలు, తెలివైనది ఐన కోడలు. అందుకని అతను నేను ఒక ప్రశ్నవేస్తాను, దానికి ఎవరయితే సరైన సమాధాన మిస్తారో వారిని నా […]

అమర్‌ సింగ్‌ గొప్ప సంపన్నుడు. వ్యాపారవేత్త ఆలోచనా పరుడు అతనికి ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు. కొడుక్కి పెళ్ళివయసు వచ్చింది. పెళ్లి చేయాలనుకున్నాడు. ఎందరో సంపన్నులు సామంతులు చివరికి రాజుగారు కూడా తమ కూతుళ్ళను యివ్వడానికి ముందుకొచ్చారు. అమర్‌సింగ్‌ ఆస్థులు, అంతస్థులు చూసే స్థాయి దాటిపోయాడు. ఎందుకంటే ఐశ్వర్యపు అంచులు చూశాడు.

ఇప్పుడతనికి కావలసింది వివేకవంతురాలు, తెలివైనది ఐన కోడలు. అందుకని అతను నేను ఒక ప్రశ్నవేస్తాను, దానికి ఎవరయితే సరైన సమాధాన మిస్తారో వారిని నా కోడలుగా చేసుకుంటాను, అన్నాడు.

ఆ ప్రశ్న ఏమిటంటే రుతువులన్నిట్లో నీకు ఏ రుతువంటే యిష్టం? ఈ ప్రశ్నవిని అందరూ అమర్‌సింగ్‌ పెద్దవాడయిపోయాడు. చాదస్థం పెరిగినట్లు వుంది. లేకుంటే యిది కూడా ఒక ప్రశ్నేనా? అని అందరూ అనుకున్నారు.

సంపన్నులు అమర్‌సింగ్‌ను తమ యిళ్ళకు ఆహ్వానించారు, ఒక ధనవంతుడు తన కూతుర్ని చూపించాడు. అమర్‌సింగ్‌ ఆ అమ్మాయితో ‘నీకు ఏ రుతువంటే యిష్టం? అన్నాడు ఆ అమ్మాయి నాకు శీతాకాలమంటే యిష్టం, వెచ్చనిబట్టలు వేసుకుంటే హాయిగా వుంటుంది. అందువల్ల ఆరోగ్యంగా వుంటామంది.

అమర్‌ సింగ్‌ ఏమీ మాట్లాడకుండా యింకొకరి యింటికి వెళ్ళాడు.ఆ సంపన్నుడి కూతురు, నాకు వర్షాకాలమంటే యిష్టం. సన్నని చినుకుల్తో నేల తడిచి పచ్చిక పెరిగి అందంగా ఆహ్లాదంగా వుంటుంది అంది. అమర్‌సింగ్‌ విన్నాడు.

యింకో అమ్మాయి, నాకు వేసవికాలమంటే యిష్టం వర్షంతో చిత్తడి వుండదు. వణికించే చలీవుండదు అంది.

చివరికి రాజుగారి కూతురి వంతు వచ్చింది. నాకు వసంతకాలమంటే యిష్టం. చెట్లు చిగురిస్తాయి. పూలు వికసిస్తాయి. వాతావరణమంతా వుల్లాసంగా, ఆహ్లాదంగా వుంటుంది అంది. అమర్‌ సింగ్‌ అందరూ చెప్పిన మాటలు విన్నాడు, దేనితోనూ సంతృప్తి పడలేదు. తనకు తగిన కోడలు దొరుకుతుందో లేదో అని దిగాలుగా బయలుదేరాడు. వూరి చివర్న ఒక పేదవాడు వుంటాడు. అతను అమర్‌సింగ్‌ స్నేహితుడు, ఎప్పుడయినా తోచనప్పుడు అమర్‌సింగ్‌ అతన్ని కలుస్తూ వుంటాడు. మిత్రుని రాకతో అతను సంతోషించాడు. ఎందుకంత దిగులుగా వున్నావు? అన్నాడు అమర్‌సింగ్‌ విషయం వివరించి, నా కొడుక్కి సంబంధాలు వెతుకుతున్నా. అవునూ నీకు ఒక కూతురు వుంది కదా రమ్మను ఆ అమ్మాయిని చూస్తాను అన్నాడు.

ఆ అమ్మాయి ముందు కొచ్చి నిలబడింది. అపురూపంగా, అందంగా వుంది. చిరునవ్వుతో నిండుగా కనిపించింది. ఆ అమ్మాయిని చూసి అమర్‌సింగ్‌ ఎంతో ఆనందించి ఈ అమ్మాయి నా కోడలయితే బావుండు అనుకున్నాడు.

‘అమ్మాయ్‌ రుతువులన్నిట్లో ఏరుతువంటే నీకిష్టం?’ అన్నాడు ఆ అమ్మాయి, ఏ రుతువు ప్రత్యేకతదానిదే, వర్షం వేడి, చలి యివన్నీ అవసరమే వృక్షాలు ఫలించడం ఎంత అవసరమో ఆ ప్రక్రియకు ఆకులు రాలడమూ అంతే అవసరం. అవి ప్రకృతి చర్యల్లో భాగాలు, దానివల్ల నేను అన్ని రుతువుల్నీ యిష్ట పడతాను అంది.

ఆమె సమాధానంతో అమర్‌సింగ్‌ ఆశ్చర్యపడ్డాడు. ఆమె వివేకానికి సంతోషించాడు.

ఆ అమ్మాయిని తన కొడుక్కి భార్యగా నిర్ణయించాడు. పెళ్ళి వైభవంగా జరిగింది.

పెళ్ళి జరిగిన కొంత కాలానికి కోడలు యితర అమ్మాయిల్తో కలిసి తోటలో ఆడుకుంటూ వుంటే ఒక ఆట గుర్తొచ్చింది. అది ఐదురాళ్ళతో ఆడేఆట. ఎంతవెతికినా ఐదు రాళ్ళు కనిపించలేదు. ఒక అమ్మాయి నేను వెళ్ళి ఐదు బంగారు నాణేలు తీసుకొస్తాను వాటితో ఆడుదాం అంది.

ఆడపడుచుల్తో కలిసి ఆడుకున్నాకా కాసేపయ్యాకా అందరూ యింట్లోకి వచ్చారు ఆ ఐదు బంగారు నాణేల్ని కోడలు తనవస్త్రాల్లో దాచింది. అమర్‌సింగ్‌ రేపు మన నగరం మీదకు శత్రువులు దండెత్తి వస్తున్నారు. మీ బంగారు నగలన్నీ యివ్వండి. నేను యినుపబీరువాలో భద్రపరుస్తాను అన్నాడు. అందరూ యిచ్చారు. కోడలు మాత్రం మామగారు! నేను నా నగల్ని భద్రపరుస్తాను లెండి అంది. మరుసటి రోజు శత్రువులు వచ్చి పడడంతో అమర్‌సింగ్‌ కుటుంబమంతా వూరు విడిచి వెళ్ళింది. చాలా దూరం ప్రయాణించి ఒక నగరానికి వచ్చింది.

అందరికీ ఆకలిగా వుంది, ఏవరిదగ్గరయినా బంగారం వుంటే యివ్వండి అమ్మా సరుకులు తెచ్చుకుందాం! అన్నాడు. కోడలు ఒక చేతిగాజు యిచ్చింది. అమర్‌సింగ్‌ ఆ గాజును అమ్మడానికి బంగారు షాపుకు వెళితే ఆ నగల వ్యాపారి ఆ గాజును పక్కగదిలోకి వెళ్ళి మార్చి తెచ్చి ‘యిది యిత్తడిది’ అని పంపాడు. విషయం అందరితో చెప్పి మోసగించాడని అమర్‌సింగ్‌ అన్నాడు. రెండు బంగారు నాణేల్ని భర్త దగ్గర యిచ్చి ఆమె పంపింది. కానీ వాటి మీద ఎర్రచుక్కలు పెట్టింది. బంగారు షాపతను వాటిని కూడా మార్చి అవి నకిలీవని తిప్పిపంపాడు.

చివరకి కోడలే రంగంలోకి దిగింది. తన దగ్గరున్న మూడు నాణేల పై ఎర్ర గుర్తులు పెట్టి బంగారుషాపుకు వెళ్ళింది. అతను ఎప్పట్లా మోసం చెయ్యబోతే యివే కాదు, యింతకు ముందు బంగారు గాజును కొట్టేశావు. రెండు బంగారు నాణేల్ని దొంగిలించావు. ఈ విషయం అందరికీ చెప్పి రాజభటుల్ని తీసుకొస్తే కానీ నీ వ్యవహారం బయటపడదు అని హెచ్చరించింది.

రాజభటులు అన్నమాటతో వ్యాపారి భయపడిపోయాడు. దొంగిలించిన గాజు బంగారు నాణెలు తిరిగి యిచ్చాడు. అక్కర్లేదు, వీటికి సరయిన డబ్బు యివ్వు, అంది కోడలు.

ఆమె ధైర్యానికి జంకుతూ వ్యాపారి డబ్బుయిచ్చాడు! యింకోసారి యిలా చేశావంటే నీకు జైలు శిక్ష తప్పదు అని హెచ్చరించి తనవాళ్ళ దగ్గరకు వచ్చి మామకు ధనమిచ్చి జరిగిన విషయం చెప్పింది.

తన కోడలి ధైర్యానికి, తెలివికి మామ ఎంతో సంతోషించాడు.

-సౌభాగ్య

First Published:  2 Jun 2016 1:02 PM GMT
Next Story