Telugu Global
Family

ప్రేమ ప్రచారం

ఒక రోజు నేను దారంటీ వెళుతూ ఉంటే ఒక గుడికడుతూ ఉండడాన్ని చూశాను. దేశంలో ఎక్కడపడితే అక్కడ గుళ్లూ,గోపురాలు పెరిగిపోతున్నాయి. జనంలో ఇంతగా భక్తి ఎక్కువయ్యిందా? అని సందేహం కలిగింది. ఆ గుడి వెనక ఒక రాతిని చెక్కుతున్న వృద్ధుడి దగ్గరకు వెళ్లి ”ఈ గుడిని నిర్మిస్తున్న కారణమేమిటి? కావలసినన్ని గుళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కదా?” అన్నాను. ఆ వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా ఆ రాయిని చూపించాడు. ఆ రాయిమీద గొప్పదాన శీలి అయిన ఫలానా […]

ఒక రోజు నేను దారంటీ వెళుతూ ఉంటే ఒక గుడికడుతూ ఉండడాన్ని చూశాను. దేశంలో ఎక్కడపడితే అక్కడ గుళ్లూ,గోపురాలు పెరిగిపోతున్నాయి. జనంలో ఇంతగా భక్తి ఎక్కువయ్యిందా? అని సందేహం కలిగింది. ఆ గుడి వెనక ఒక రాతిని చెక్కుతున్న వృద్ధుడి దగ్గరకు వెళ్లి ”ఈ గుడిని నిర్మిస్తున్న కారణమేమిటి? కావలసినన్ని గుళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి కదా?” అన్నాను. ఆ వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా ఆ రాయిని చూపించాడు. ఆ రాయిమీద గొప్పదాన శీలి అయిన ఫలానా వ్యక్తి ఆ గుడిని కట్టిస్తున్నట్లు శిలాఫలకం చెక్కుతున్నారు. అప్పుడు నాకు అర్ధమయింది. ఆ గుడి ఫలానా వ్యక్తి కోసం కడుతున్నారు. దేవుడి కోసం కాదు. ఆ వ్యక్తి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలంటే అతను ఏమయినా చేయాలి. అందుకని గుడి కట్టిస్తున్నాడని అర్థమయ్యింది.

ఆ విషయం గురించే ఆలోచించుకుంటూ వెళుతూ ఉంటే దారిలో పెద్ద ఊరేగింపు కనిపించింది. విషయమేమిటా అని విచారిస్తే ఒక వ్యక్తి సంసారాన్ని వదిలి సన్యాసం స్వీకరిస్తున్నాడట. సర్వసంగపరిత్యాగి అవుతున్నాడట. అతన్ని గొప్ప ఆసనంలో కూర్చోబెట్టి జనం ఊరేగిస్తున్నారు. మేళతాళాలు, నాట్యాలతో పరిసరాలు హోరెత్తిపోతున్నాయి. నేను సన్యాసం స్వీకరించిన ఆ వ్యక్తిని చూశాను. అతని కళ్ళలో వినయం లేదు. త్యాగభావం లేదు. గొప్ప గర్వం, అహంకారం, తానేదో అపూర్వ విషయాన్ని సాధించానన్న అహంకారం కనిపించాయి. అతనికీ,రాజకీయనాయకుడికీ తేడా ఏమీ కనిపించలేదు. సన్యాసానిక్కూడా ప్రచారమా? అనిపించింది.

ఒకరోజు నాకు తెలిసిన మిత్రుడు ఉపవాసదీక్షలో కూచున్నాడు. ఆ ఉపవాసం పదిరోజులపాటు చేస్తానని ప్రకటించాడు. బంధుమిత్రులే కాక చుట్టు పక్కల జనం కూడా చూడ్డానికి వచ్చారు. యాగం కూడా చేశారు. వచ్చిన జనం తృప్తిగా భోజనాలు కూడా చేసి వెళ్ళారు, అని ఉపవాస దీక్ష గురించి గొప్పగా ప్రచారం జరిగింది. పదిరోజుల అనంతరం ఆ ఉపవాస దీక్షకు అతను చాలా ఖర్చు పెట్టుకున్నట్లు చెప్పుకున్నారు. ప్రచారానికి పరిమితులు ఉండవు. ప్రచారం రకరకాలుగా ఉంటుంది. నిజానికి విషప్రచారమన్నమాటను వాడుతూ ఉంటారు. అది తప్పు. ప్రచారమేదయినా విషమే. ఒక కథ గుర్తుకొచ్చింది.

ఒక సంపన్నుడు దేవుడికి పదివేల బంగారు నాణేలు సమర్పించాడు. ఆ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. ఊరి జనమంతా గుడి దగ్గరికి చేరారు. మంటపంలో పెద్దలు ఆశీనులయ్యారు. సంపన్నుడు తాను తెచ్చిన బంగారు నాణేల సంచిని అక్కడుంచాడు. సంచి విప్పి నాణేల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. లెక్క పెట్టడంలో నాణేల శబ్ధం అందర్నీ అలరించేలా వాటిని గలగలాలాడించాడు.

అందరూ నిశ్శబ్ధంగా చూస్తున్నారు. తను ఎంతో గొప్ప త్యాగశీలో? ఎంత ప్రేమపూరితుడో అందరూ గుర్తించాలనట్టు ఒక్కో నాణేన్ని లెక్క పెడుతూ దేవుడి విగ్రహాన్ని చూస్తూ బంగారు నాణేల శబ్ధాన్ని పంచుతూ తను లెక్కించే కార్యక్రమాన్ని ముగించి పూజారికి సమర్పించబోయాడు. ఆ పూజారి సంపన్నుణ్ణి చూసి ”అయ్యా! నేను ఇస్తున్నాను. ఈ విషయం అందరికీ తెలిస్తే నాకు పేరు వస్తుంది” అన్న అహం మీలో ఉంది. ప్రేమ,త్యాగం అన్నవి ప్రచారాన్ని కోరుకోవు. మీరు వాటికి ప్రచారమివ్వాలని అనుకుంటున్నారు. అట్లాంటి ఉద్దేశాలు నింపిన మీ బంగారు నాణేలు భగవంతుని సేవకు పనికిరావు. తీసుకుపోండి” అన్నాడు.

సంపన్నుడి ముఖం వెలవెలబోయింది.

– సౌభాగ్య

First Published:  2 Jun 2016 1:01 PM GMT
Next Story