Telugu Global
WOMEN

అప్పుడు మ్యారిట‌ల్‌ రేప్ బాధితురాలు...ఇప్పుడు బాలివుడ్ స్టంట్ ఉమ‌న్‌!

ఒక‌ప్పుడు ఆమె గృహ‌హింస బాధితురాలు. భ‌ర్త‌తో చావు దెబ్బ‌లు తిని, లైంగిక దాడుల‌కు గుర‌యి అత్యంత నిస్స‌హాయ‌మైన జీవితాన్ని గ‌డిపింది. అదే మ‌హిళ ఇప్పుడు బాలివుడ్ తెర‌మీద స్టంట్ మెన్ల‌తో స‌మానంగా ఫైట్లు చేస్తోంది.  అద్దాలు ప‌గుల గొట్టుకుని కార్ల‌ను, బైక్‌ల‌ను దూకించ‌డం, అవ‌లీల‌గా స‌న్న‌ని దారుల్లో కార్ల‌ను న‌డ‌ప‌టం, మంట‌ల్లోంచి దూసుకుపోవ‌టం లాంటి సాహ‌స‌కృత్యాల‌ను చేస్తోంది. తెర‌మీద క‌నిపించే హీరోయిన్లకు డూప్‌గా ఫైటింగ్‌లు, రిస్క్‌లు చేసే ఆమె… నిజ‌జీవితంలో సైతం నిజ‌మైన హీరోయిజాన్ని చూపించింది.  బాలివుడ్ […]

అప్పుడు మ్యారిట‌ల్‌ రేప్ బాధితురాలు...ఇప్పుడు బాలివుడ్ స్టంట్ ఉమ‌న్‌!
X

ఒక‌ప్పుడు ఆమె గృహ‌హింస బాధితురాలు. భ‌ర్త‌తో చావు దెబ్బ‌లు తిని, లైంగిక దాడుల‌కు గుర‌యి అత్యంత నిస్స‌హాయ‌మైన జీవితాన్ని గ‌డిపింది. అదే మ‌హిళ ఇప్పుడు బాలివుడ్ తెర‌మీద స్టంట్ మెన్ల‌తో స‌మానంగా ఫైట్లు చేస్తోంది. అద్దాలు ప‌గుల గొట్టుకుని కార్ల‌ను, బైక్‌ల‌ను దూకించ‌డం, అవ‌లీల‌గా స‌న్న‌ని దారుల్లో కార్ల‌ను న‌డ‌ప‌టం, మంట‌ల్లోంచి దూసుకుపోవ‌టం లాంటి సాహ‌స‌కృత్యాల‌ను చేస్తోంది. తెర‌మీద క‌నిపించే హీరోయిన్లకు డూప్‌గా ఫైటింగ్‌లు, రిస్క్‌లు చేసే ఆమె… నిజ‌జీవితంలో సైతం నిజ‌మైన హీరోయిజాన్ని చూపించింది. బాలివుడ్ లో క‌ష్టమైన స్టంట్‌లు చేయ‌గ‌ల ఏకైక స్టంట్ ఉమ‌న్ ఆమె. కార్లు, బైకులు ఆమెకు ఇష్ట‌మైన నేస్తాలు. అవి ఆమె చెప్పిన‌ట్టు వింటాయి మ‌రి. ఇప్పుడు ఆమె చేస్తున్న వృత్తిని చూస్తే…ఇలాంటి స్త్రీనా తాను హింసించింది అని…ఆమె మాజీ భ‌ర్త ఉలిక్కిప‌డ‌క‌మాన‌డు. బ‌తుకు పోరాటంలో సినిమా స్టంట్ల‌ను మించిన క‌ష్టాల‌ను చూసి…చివ‌రికి మ‌నో ధైర్యానికి నిలువెత్తు రూపంగా నిలిచిన గీతా టండ‌న్ క‌థ‌ని ఓ యూట్యూబ్ ఛాన‌ల్ వెలుగులోకి తెచ్చింది. నిస్స‌హాయ దుస్థితి నుండి నేటి స్థితికి రావ‌టం వెనుక ఉన్నజీవిత‌ క‌థ ఇది-

geetha and childrenబాలివుడ్‌లో 2009లో స్టంట్ ఉమ‌న్‌గా కెరీర్ ప్రారంభించిన గీతా టండ‌న్ (31) అంత‌కుముందు ఒక సాధార‌ణ గృహిణి. భ‌ర్త చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గుర‌యిన అబ‌ల‌. గీత తొమ్మిదేళ్ల వ‌య‌సులో త‌ల్లిని కోల్పోయింది. వారు మొత్తం న‌లుగురు పిల్ల‌లు. తండ్రి పోషించ‌లేని స్థితిలో ఉండ‌గా బంధువుల ఇళ్లు మారుతూ పెరిగారు. టీనేజి వ‌య‌సులో మ‌గ‌పిల్ల‌ల‌తో స‌మానంగా ఆట‌లు ఆడుతూ, ధైర్య సాహ‌సాలు చూపుతున్న ఆ అమ్మాయికి త్వ‌ర‌గా పెళ్లిచేస్తే మంచిద‌ని ఆమె బంధువులు భావించారు. దాంతో జైపూర్‌కి చెందిన వ్య‌క్తితో ఆమెకు బాల్య వివాహం చేశారు. కానీ పెళ్లి ఆమెకు న‌ర‌కంగా మారింది.

ఇంట్లో ఆమె బానిస‌లా తయారైంది. ఆమె భ‌ర్త ఆమెను అనేక ర‌కాలుగా హింసించేవాడు. 16వ ఏట గీత‌ గ‌ర్భ‌వ‌తైంది. అప్పుడైనా కొట్ట‌డం ఆపుతాడ‌నుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు. ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. రెండ‌వ బిడ్డ కూడా జ‌న్మించాక ఆమె ఆ హింస‌ని భ‌రించ‌లేని స్థితికి చేరింది. భ‌ర్త నుండి విప‌రీతంగా దెబ్బ‌లు తిన‌టంతో పిల్ల‌ల‌కు తిండి కూడా పెట్టుకోలేక‌పోయేది. ఆ ఇంట్లోంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నించింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వారు మ్యారేజి కౌన్సిల‌ర్ల‌కు అప్ప‌గించి, ఆమెను తిరిగి ఇంటికి చేర్చేవారు. సోద‌రి ఇంటికి చేరినా అక్క‌డికి కూడా వ‌చ్చి కొట్టేవాడు. చివ‌రికి 20ఏళ్ల వ‌య‌సులో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సోదరి ఇంట్లోంచి బ‌య‌ట ప‌డింది.

ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న ఆమెకు బ‌య‌ట ప్ర‌పంచంలో ఎలా బ‌త‌కాలో తెలియ‌లేదు. ర‌క‌ర‌కాల ప‌నులు చేసేది. చివ‌రికి బాంగ్రా డ్యాన్స‌ర్‌గా స్థిర‌ప‌డింది. పెళ్లిళ్ల‌లో నృత్యాలు చేసిన‌పుడు, అక్క‌డ మిగిలిన ఫుడ్‌ని త‌న పిల్ల‌ల‌కు తీసుకువెళ్లేదాన్న‌ని ఆమె చెప్పింది. అలా ఉండ‌గా ఒక మ‌హిళ ద్వారా బాలివుడ్‌లో స్టంట్స్‌ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఒక్క సెక్స్ వ‌ర్క్‌కు త‌ప్ప ఆమె ఏ ప‌నికీ కాద‌ని చెప్పేది కాదు. నెల‌కు 1200 రూపాయ‌ల‌కోసం రోజుకి 250 రోటీలు త‌యారు చేసిన రోజులు ఉన్నాయి. స్టంట్ఉమ‌న్ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌నుకుంది. ల‌డ‌క్ సినిమాలో మంట‌ల మ‌ధ్య మొద‌టిసీన్‌లో న‌టించింది. దాంతో మొహం కాలి గాయాల‌య్యాయి. అయినా వెనుక‌డుగు వేయ‌లేదు. ఫైటింగులు చేయ‌టం …త‌న చిన్న‌నాటి త‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో ఆ వృత్తిని ఇష్టంగా తీసుకుంది. ఒక రియాలిటీ షో కోసం తీసుకున్న 20 రోజుల డ్రైవింగ్ శిక్ష‌ణ ఆమెకు ప‌నికొచ్చింది.

మ‌హిళ‌లు న‌డ‌ప‌లేని హార్లీ, బులెట్ లాంటి బైక్‌ల‌తో ఫైట్లు చేయ‌టం ఆమెకు అల‌వాటుగా మారింది. ఇటీవ‌ల ఐశ్వ‌ర్యారాయ్‌కి డూప్‌గా జాజ్బా చిత్రంలో …ఛేజ్ సీన్లో పాల్గొప్పుడు… అక్క‌డ ఉన్న విలువైన ప‌రిక‌రాల‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌కుండా…సీన్ పూర్తి చేసి అంద‌రి ప్ర‌శంస‌లు పొందింది గీత‌. మూవీ స్టంట్ అసోసియేష‌న్ నుండి గుర్తింపుని సైతం పొందింది. దాంతో ఆమెకు శిక్ష‌ణ‌, గాయ‌ప‌డితే న‌ష్ట‌ప‌రిహారం పొందే అవ‌కాశం ద‌క్కింది. ఇప్ప‌టివ‌ర‌కు గీత వెన్నెముక ఫ్రాక్చ‌ర్ వ‌ర‌కు చాలా గాయాల పాలైంది. ఆమె కోలుకుంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌ని సంద‌ర్భాల్లో సైతం తిరిగి నిల‌బ‌డింది.

వెన్నెముక గాయంతో ఉన్న‌పుడు ఇంటి ఓన‌రు ఇల్లు ఖాళీ చేయ‌మ‌న‌గా గీత, తాను కోలుకునే వర‌కు ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఆసుప‌త్రిలో త‌న‌తో పాటు ఉంచుకుంది. గీత ఇప్పుడు సంవ‌త్స‌రానికి 7-8 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తోంది. ఇవి కాక కొన్ని ప్ర‌త్యేక ప్రాజెక్టుల‌ను సైతం ఒప్పుకుంటుంది. మ‌లాడ్‌లో ఇల్లు కొనుక్కుంది. ప‌రిణితి చోప్రా, క‌రీనా క‌పూర్‌, ఆలియా భ‌ట్‌, దీపికా ప‌దుకొనే మొద‌లైన వారంద‌రికోసం ఆమె ప‌నిచేసింది. గీత పిల్ల‌లు 16 ఏళ్ల అమ్మాయి, 14ఏళ్ల అబ్బాయి…ఇద్ద‌రూ చ‌దువుకుంటున్నారు. ఆమె మ‌హిళ‌ల‌కు స్వీయ ర‌క్ష‌ణ పాఠాలు చెప్పే ఒక స్కూలుని ప్రారంభించాల‌ని అనుకుంటోంది. త‌న్నులు, తిట్లు, అవ‌మానాలు పొందే మ‌హిళ‌లు…త‌మ‌కోసం తాము బ‌త‌కాలంటోంది గీతా టండ‌న్. ఆమె నిజ‌మైన స్టంట్ ఉమ‌న్…అవును, క‌ష్టాలు క‌న్నీళ్ల‌ను, నిస్స‌హాయ‌త‌ను, భ‌యాల‌ను త‌రిమిత‌రిమి కొట్టిన స్టంట్ ఉమ‌న్‌.

First Published:  3 Jun 2016 3:38 AM GMT
Next Story