Telugu Global
Family

మనసే మందిరం

మనుషుల మధ్య అంతరాలు లేందే సంఘముండదు.  సంప్రదాయముండదు.  తేడాలు ఉన్నప్పుడే భయం, పగ, ప్రతీకారం, ద్వేషం, శత్రుత్వం మొదలవుతాయి.  శతృత్వం వల్లే సంఘాలు ఏర్పడతాయి.  కానీ దేవుణ్ణి చేరడానికి ఇవేవీ అక్కర్లేదు.  ప్రేమ ఒక్కటే మార్గమే.  సామాజిక నిర్మాణానికి దైవాన్ని అందుకోవడానికి ఏమీ సంబంధం లేదు.  కానీ దైవం కూడా తమ చెప్పుచేతలతో ఉంటాడని, దైవాన్ని దర్శించాలన్నా తమ అనుమతి లేనిదే వీలుపడదని కొందరు అహంకరిస్తారు.  సామాన్యజనం అదంతా నిజమే అని విశ్వసిస్తారు.  ప్రగల్భించేవాళ్ల పట్ల భక్తి […]

మనుషుల మధ్య అంతరాలు లేందే సంఘముండదు. సంప్రదాయముండదు. తేడాలు ఉన్నప్పుడే భయం, పగ, ప్రతీకారం, ద్వేషం, శత్రుత్వం మొదలవుతాయి. శతృత్వం వల్లే సంఘాలు ఏర్పడతాయి. కానీ దేవుణ్ణి చేరడానికి ఇవేవీ అక్కర్లేదు. ప్రేమ ఒక్కటే మార్గమే. సామాజిక నిర్మాణానికి దైవాన్ని అందుకోవడానికి ఏమీ సంబంధం లేదు. కానీ దైవం కూడా తమ చెప్పుచేతలతో ఉంటాడని, దైవాన్ని దర్శించాలన్నా తమ అనుమతి లేనిదే వీలుపడదని కొందరు అహంకరిస్తారు. సామాన్యజనం అదంతా నిజమే అని విశ్వసిస్తారు. ప్రగల్భించేవాళ్ల పట్ల భక్తి ప్రవత్తులు ప్రదర్శిస్తారు. పూర్వం ఒక గ్రామంలో తెల్లవారుతున్నప్పుడు పూజారి గుడితలుపులు తెరిచాడు. వెంటనే ఎప్పట్నించో ఎదురు చూస్తున్న ఒక అంటరానివాడు హడావుడిగా దైవదర్శనానికి ఆతృతపడుతూ గుడిలోకి అడుగుపెట్టబోయాడు. అది చూసిన పూజారి ”ఆగు! లోపలికి రాకు. అడుగు ముందుకు వేశావంటే అపచారం. భగవంతుని మందిరం పవిత్రమైంది. నువ్వు అంటరానివాడివి. నీ స్పర్శతో పవిత్రమైన దైవమందిరం పాప పంకిలమైపోతుంది. ఈ ఆలయంలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు. వెళ్లు” అన్నాడు.

ఆమాటల్తో అంటరాని వ్యక్తి మనసు నలిగిపోయింది. తాను చేసిన అపచారం ఏమిటి? తను తక్కువ కులంలో పుట్టడమన్నది తను చేసుకున్న పాపమా? అని బాధపడ్డాడు. కానీ ధైర్యం తెచ్చుకుని ”నేనుపవిత్రుణ్ణి కావడానికి సాధన చేస్తాను. రహస్యాన్ని కనిపెడతాను. కానీ దేవుణ్ణి దర్శించకుండా మాత్రం జీవితం ముగించను” అని పూజారితో చెప్పి ఊరు వదిలి వెళ్లిపోయాడు. రెండు,మూడు సంవత్సరాలుగడిచాయి. పూజారి ఆలయం బయట ఉన్నాడు. అంటరాని వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్లలో గొప్ప కాంతి, అతని ముఖంలో గొప్పవర్చసు. అతను గుడిలోకి రాకుండా గుడిముందుగావెళ్ళడం చూసి పూజారి ”నువ్వు పవిత్రను పొందడానికి వెళ్ళనన్నావు. గుడిలోకి రాకుండానే వెళ్ళిపోతున్నావే” అన్నాడు.

అంటరాని వ్యక్తి పూజారిని చూసి నవ్వి ”స్వామీ! నేను సత్యాన్ని కనిపెట్టాను. దైవాన్ని దర్శించాను. పవిత్రతను సాధించాను. దేవుడు నాతో ”పిచ్చివాడా! గుడికి ఎందుకు వెళ్ళావు? నామటుకు నేనుఎప్పుడూ గుడికి వెళ్లలేదు. ఒక వేళ నేను వెళ్లినా పూజారి నన్ను రానివ్వడు. అందుకనే నేను వెళ్ళను. నా కోసం నువ్వు ఆలయంలో వెతక్కు. నీ అంతరంగంలో వెతుకు. నేను మందిరాలలో లేను. నీమనసులో ఉన్నాను” అన్నాడు. అందుకనే నేను ఆలయానికి రాకుండా వెళ్లిపోతున్నాను” అన్నాడు.

దైవం ప్రతి మనిషిలో ఉన్నాడు. విగ్రహాల్లో లేడు.

నిజానికి ధర్మమన్నది విడగొట్టేది కాదు. కలిపేది. ధర్మం గోడలు కట్టదు. గోడల్ని పడగొడుతుంది. అంతరాల్ని తొలగిస్తుంది. ఒక సామాజిక నిర్మాణాన్ని ఉద్దేశించి చేసిన కుటిల ప్రయత్నమిది.

-సౌభాగ్య

First Published:  31 May 2016 1:01 PM GMT
Next Story