ఆమె 70ఏళ్ల బామ్మ కాదు...తొలిసారి తల్లయిన అమ్మ!
పెళ్లయిన 46 సంవత్సరాలకు అమృతసర్‌కు చెందిన ఒక జంట తమ సొంత బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. మొహిందర్ సింగ్ గిల్ (79), అతని భార్య దల్‌జిందర్ కౌర్ (70)లకు పిల్లలు లేరు. ఈ ముదిమి వయసులో తమదైన బిడ్డ కావాలనే కోరికతో వారు ఐవిఎఫ్ విధానంలో ప్రయత్నించి సఫలం అయ్యారు. పెద్ద వయసులో అమ్మానాన్నలయిన జంటగా రికార్డు సృష్టించారు. అయితే ఇంత లేటు వయసులో వారికి ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఉంది. తనకు తండ్రి నుండి సంక్రమించాల్సిన […]
పెళ్లయిన 46 సంవత్సరాలకు అమృతసర్‌కు చెందిన ఒక జంట తమ సొంత బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. మొహిందర్ సింగ్ గిల్ (79), అతని భార్య దల్‌జిందర్ కౌర్ (70)లకు పిల్లలు లేరు. ఈ ముదిమి వయసులో తమదైన బిడ్డ కావాలనే కోరికతో వారు ఐవిఎఫ్ విధానంలో ప్రయత్నించి సఫలం అయ్యారు. పెద్ద వయసులో అమ్మానాన్నలయిన జంటగా రికార్డు సృష్టించారు. అయితే ఇంత లేటు వయసులో వారికి ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఉంది. తనకు తండ్రి నుండి సంక్రమించాల్సిన 4.8కోట్ల ఆస్తిని పొందేందుకే ఇంత సాహసం చేశామని మొహిందర్ సింగ్ చెప్పాడు.
గిల్‌కి పిల్లలు లేకపోవడం వలన అతని తండ్రి, వారసత్వంగా దక్కాల్సిన ఆస్తిలో అతనికి వాటా ఇవ్వనక్కర్లేదనే నిర్ణయానికి వచ్చాడు. గిల్ నలుగురు తోబుట్టువులు సైతం ఆస్తిని ఇచ్చేందుకు అంగీకరించలేదు. నాలుగు దశాబ్దాలుగా ఈ గొడవ నడుస్తూనే ఉంది. దల్‌జిందర్ కౌర్‌కి పిల్లలు పుట్టే అవకాశం లేనందున వారు పిల్లలను పొందలేకపోయారు. ఇక తమకు పిల్లలు పుట్టరనే నిర్దారణకు వచ్చేసి ఆస్తిమీద ఆశ వదిలేసుకున్నారు. అయితే హర్యానాలోని ఒక ఫెర్టిలిటీ క్లినిక్ ప్రకటన చూశాక వారిలో ఆశలు చిగురించాయి. అక్కడకు వెళ్లి తమ కోరిక వెల్లడించారు. రెండేళ్ల చికిత్స అనంతరం దల్‌జిందర్ కౌర్ గర్భవతయి పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాత నుండి సేకరించిన అండకణాలు, గిల్ స్పెర్మ్ ద్వారా బిడ్డ జన్మ ప్రక్రియ నిర్వహించినట్టుగా తెలుస్తోంది.
దల్ జిందర్ కౌర్ గత నెలలో బిడ్డకు జన్మనివ్వగా, ఐవిఎఫ్ ప్రక్రియ నిర్వహించిన నేషనల్ ఫెర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వారు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. మొదటి రెండు ప్రయత్నాలు ఫలించలేదని మూడో ప్రయత్నంలో ఆమె గర్భం దాల్చారని, తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వారు తెలిపారు. అయితే ఈ వయసులో బిడ్డ పెంపకం సాధ్యమేనా అని గిల్‌ని అడగ్గా, చాలామంది అలాగే అంటున్నారు…. మేము చనిపోతే బిడ్డ పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నే…కానీ నాకు దేవుడిమీద పూర్తి నమ్మకం ఉంది…అన్నాడాయన.