Telugu Global
Health & Life Style

రోజుకి యాభైమంది చిన్నారులు క్యాన్స‌ర్‌కి బ‌లి!

భార‌త్‌లో క్యాన్స‌ర్ బారిన ప‌డి రోజుకి యాభైమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. భార‌త్‌లో ఈ ప‌రిస్థితిని త‌ట్టుకునే ఆధునిక చికిత్సా విధానాలు లేవ‌ని, క్యాన్స‌ర్ బాధిత చిన్నారుల‌ను ర‌క్షించుకునే ఆర్థిక‌ స్థోమ‌త కూడా దేశానికి లేద‌ని ఆ అధ్య‌య‌నం తెలిపింది. గ్లోబ‌ల్ అంకాల‌జీ ప‌త్రిక‌లో ఈ వివ‌రాలు ప్ర‌చురించారు. భార‌త్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్య గ‌ణాంకాలు స‌రిగ్గా అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల‌న ప్ర‌భుత్వాలు పిల్ల‌ల్లో క్యాన్స‌ర్ స‌మ‌స్య‌ని ప్ర‌జారోగ్య ఎజెండాలో చేర్చ‌లేక‌పోతున్నాయ‌ని, […]

రోజుకి యాభైమంది చిన్నారులు క్యాన్స‌ర్‌కి బ‌లి!
X

భార‌త్‌లో క్యాన్స‌ర్ బారిన ప‌డి రోజుకి యాభైమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. భార‌త్‌లో ఈ ప‌రిస్థితిని త‌ట్టుకునే ఆధునిక చికిత్సా విధానాలు లేవ‌ని, క్యాన్స‌ర్ బాధిత చిన్నారుల‌ను ర‌క్షించుకునే ఆర్థిక‌ స్థోమ‌త కూడా దేశానికి లేద‌ని ఆ అధ్య‌య‌నం తెలిపింది. గ్లోబ‌ల్ అంకాల‌జీ ప‌త్రిక‌లో ఈ వివ‌రాలు ప్ర‌చురించారు.

భార‌త్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్య గ‌ణాంకాలు స‌రిగ్గా అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల‌న ప్ర‌భుత్వాలు పిల్ల‌ల్లో క్యాన్స‌ర్ స‌మ‌స్య‌ని ప్ర‌జారోగ్య ఎజెండాలో చేర్చ‌లేక‌పోతున్నాయ‌ని, అలాగే వ్యాధి నిర్మూల‌న‌కు జాతీయ స్థాయిలో ఎలాంటి చ‌ర్య‌ల‌ను తీసుకోలేక‌పోతున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే క్యాన్స‌ర్ బారిన ప‌డిన చిన్నారులకు స‌రైన చికిత్స అందుబాటులో ఉండ‌టం వ‌ల‌న రోగ‌బారిన ప‌డిన పిల్ల‌ల్లో 80శాతం మందికి పైగా కోలుకుంటున్నార‌ని ఆ నివేదిక పేర్కొంది. టొరొంటో యూనివ‌ర్శిటీ లాంటి అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పాటు ముంబ‌యిలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ ఈ అధ్య‌య‌న నిర్వ‌హ‌ణ‌లో పాలుపంచుకుంది.

ప్ర‌తిఏటా ఇండియాలో క్యాన్స‌ర్ కార‌ణంగా మ‌ర‌ణిస్తున్న చిన్నారుల సంఖ్య ప‌దిల‌క్ష‌ల‌మందికి 37 చొప్పున‌ పెరుగుతూ పోతోంద‌ని, వాస్త‌వ ప‌రిస్థితిని, వ్యాధి తీవ్ర‌త‌ని అంచ‌నా వేయ‌టంలో వైఫ‌ల్యం చెంద‌టం వ‌ల్ల‌నే భార‌త్ లాంటి దేశాలు మెరుగైన చికిత్సా విధానాల‌ను అమ‌లు చేయ‌లేక‌పోతున్నాయ‌ని ఆ అధ్య‌య‌న నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. భార‌త్‌లో క్యాన్స‌ర్ వ్యాధి విప‌రీతంగా విజృంభిస్తోంద‌ని 2014 లాన్‌సెట్ నివేదిక వెల్ల‌డించింది. ఏటా ప‌దిల‌క్ష‌ల చొప్పున‌ క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్నాయ‌ని ఈ నివేదిక తెలిపింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నాల ప్ర‌కారం 2025నాటికి భార‌త్‌లో క్యాన్స‌ర్ కేసులు ఐదురెట్లు పెరుగుతాయని తెలుస్తోంది. అలాగే క్యాన్స‌ర్ చికిత్స దేశానికి ఒక ఆర్థిక భారంగా ప‌రిణ‌మించ‌నుంద‌ని ఆ సంస్థ తెలిపింది.

First Published:  24 April 2016 12:01 AM GMT
Next Story