Telugu Global
WOMEN

దేవుడా...దేవుడికి రేప్‌కి సంబంధం ఏమిటి?

దైవం అనే ఒక శ‌క్తికి అత్యున్న‌త విలువని ఇస్తున్న‌ప్పుడు క‌నీసం ఆ శ‌క్తికి అయినా మ‌న మ‌న‌సుల్లోని మూఢ‌త్వాన్ని అంటించ‌కుండా ఉండాలి క‌దా. ఈ ప్ర‌పంచంలో అన్‌కండిష‌న‌ల్ ప్రేమ అనేది ఒక‌టుంది. ఆ ప్రేమ‌కు ప్రేమించ‌డం త‌ప్ప కండిష‌న్లు పెట్ట‌డం తెలియ‌దు. ఆ ప్రేమ చాలా అరుదుగా ఉంటుంది. నిజానికి త‌ల్లిదండ్రులు కూడా దాన్ని పూర్తిస్థాయిలో పిల్ల‌ల‌కు పంచ‌లేరు. దైవం అనే శ‌క్తి అంటూ ఒక‌టి ఉంటే, ఆ శ‌క్తి మ‌నిషిమీద అలాంటి ప్రేమ‌ని చూపుతుంద‌ని, దైవం […]

దేవుడా...దేవుడికి రేప్‌కి సంబంధం ఏమిటి?
X

దైవం అనే ఒక శ‌క్తికి అత్యున్న‌త విలువని ఇస్తున్న‌ప్పుడు క‌నీసం ఆ శ‌క్తికి అయినా మ‌న మ‌న‌సుల్లోని మూఢ‌త్వాన్ని అంటించ‌కుండా ఉండాలి క‌దా. ఈ ప్ర‌పంచంలో అన్‌కండిష‌న‌ల్ ప్రేమ అనేది ఒక‌టుంది. ఆ ప్రేమ‌కు ప్రేమించ‌డం త‌ప్ప కండిష‌న్లు పెట్ట‌డం తెలియ‌దు. ఆ ప్రేమ చాలా అరుదుగా ఉంటుంది. నిజానికి త‌ల్లిదండ్రులు కూడా దాన్ని పూర్తిస్థాయిలో పిల్ల‌ల‌కు పంచ‌లేరు. దైవం అనే శ‌క్తి అంటూ ఒక‌టి ఉంటే, ఆ శ‌క్తి మ‌నిషిమీద అలాంటి ప్రేమ‌ని చూపుతుంద‌ని, దైవం అంటే అంత‌టి క‌రుణామ‌యుడ‌ని భావిస్తాం. అలాంటి దైవం కూడా మ‌హిళ‌లు శ‌నిశింగ‌నాపూర్ ఆల‌యంలోకి ప్ర‌వేశిస్తే…రేప్‌లు జ‌రుగుతాయి జాగ్ర‌త్త‌…అని అన‌గ‌లుగుతుందా…అలాంటి ఒక ఊహని మ‌నిషి చేయ‌గ‌ల‌గితే ఇక దైవానికి ఏమ‌ని అర్థం చెప్పుకోవాలి. శ‌ని ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్ర‌వేశిస్తే అత్యాచారాలు పెరుగుతాయ‌ని ద్వార‌కా శార‌దా పీఠానికి శంక‌రాచార్యులైన స్వ‌రూపానంద అన్నారు. ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్ర‌వేశిస్తే దైవం ఆగ్ర‌హించి అలా స్పందిస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. దైవానికి ఆయ‌న ఆపాదిస్తున్న కళంకానికి ప‌రిమితే లేదు. ఇంత‌కుముందు కూడా ఆయ‌న ఇత‌ర విష‌యాల్లో ఇలాగే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కానీ ఈసారి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత వివాదాస్ప‌దంగా ఉన్నాయి.

ఒక ప‌క్క కోర్టులు రాజ్యాంగం కంటే సంప్ర‌దాయాలు ఎక్కువ‌ కాదుకదా అని ప్ర‌శ్నిస్తుంటే మ‌రొక ప‌క్క ఇలాంటి వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి. ఇలాంటి బెదిరింపుని ఇప్ప‌టివ‌ర‌కు చాలా సంద‌ర్భాల్లో విన్నాం. ఇప్పుడు దేవుడి విష‌యంలోనూ విన‌బ‌డింది. చివ‌రికి రాజ్యాంగం, చ‌ట్టాలు ఒక‌వైపుంటే వాటికి స‌మాంత‌రంగా మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా సొంత చ‌ట్టాలు చేస్తున్న మ‌హానుభావులు పెరిగిపోతున్నారు. రాత్రులు బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగితే రేప్‌లు జ‌ర‌గ‌వా అని న్యాయ‌వాదులే అంటారు. గొంతు విప్పి భావ ప్ర‌క‌ట‌న చేసే యూనివ‌ర్శిటీలు, కాలేజీ విద్యార్థినుల‌ను పోలీసులు కూడా అదేమాటతో బెదిరిస్తారు. గ్రామ పంచాయితీలు పెట్టి అమ్మాయిలు జీన్స్ వేసుకోవ‌ద్దు, టైట్ దుస్తులు ధ‌రించ‌వ‌ద్దు, అమ్మాయిల‌కు సెల్‌ఫోన్లు ఇవ్వ‌వ‌ద్దు లాంటి తీర్మానాల‌ను చేస్తారు. అతిక్ర‌మిస్తే గ్రామ బ‌హిష్కారం చేస్తామ‌ని భ‌య‌పెడ‌తారు….

త‌మ మ‌న‌సుల్లో రాసుకున్న చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఎక్క‌డ ఏ మ‌హిళ గొంతువిప్పినా…ఈ ఆలోచ‌నా ప‌రులంతా ఇదే బెదిరింపు చేస్తున్నారు. మ‌గ‌వారిలోని అహంకారాన్ని, క్రూర‌త్వాన్ని అలాగే ఉంచి, ఆడ‌వారిని మాత్రం అణ‌చివేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలివి. ఏదిఏమైనా వీరికే గ‌నుక అధికారం ఉంటే వీరంతా క‌లిసి….ఫ‌లానా ప‌నులు చేసిన మ‌హిళ‌ల‌ను రేప్ చేయ‌వ‌చ్చు అనే చ‌ట్టం తెచ్చేలా ఉన్నారు. వారు వెల్ల‌డిస్తున్న అభిప్రాయాలు అలా ఉంటున్నాయి మ‌రి.

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  11 April 2016 11:29 PM GMT
Next Story