Telugu Global
Family

అదృష్టదేవత

పాటన్‌ ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆయన ధర్మాత్ముడు దయగలవాడు. ప్రజలు కష్టసుఖాల్ని పట్టించుకునేవాడు. మారు వేషంలో మారు మూలలు పర్యటించి దేశ పరిస్థితులు, ప్రజల మంచి చెడ్డలు తెలుసుకునేవాడు. ఒక రోజు రాజు మారువేషంలో ఒక గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒక బ్రాహ్మణుని యింట్లో బసచేశాడు. బ్రాహ్మణుడు, రాజు ఆ రాత్రి ముందుగదిలో పడుకున్నాడు. వెనక గదిలో మంచంమీద బ్రాహ్మణుడి  భార్య పడుకుంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ప్రసవించింది తల్లి పక్కనే పసిబిడ్డ కూడా […]

పాటన్‌ ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆయన ధర్మాత్ముడు దయగలవాడు. ప్రజలు కష్టసుఖాల్ని పట్టించుకునేవాడు. మారు వేషంలో మారు మూలలు పర్యటించి దేశ పరిస్థితులు, ప్రజల మంచి చెడ్డలు తెలుసుకునేవాడు.

ఒక రోజు రాజు మారువేషంలో ఒక గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒక బ్రాహ్మణుని యింట్లో బసచేశాడు. బ్రాహ్మణుడు, రాజు ఆ రాత్రి ముందుగదిలో పడుకున్నాడు. వెనక గదిలో మంచంమీద బ్రాహ్మణుడి భార్య పడుకుంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ప్రసవించింది తల్లి పక్కనే పసిబిడ్డ కూడా పడుకుంది.

ఆ రాత్రి అదృష్టదేవత ఆ యింటికి వచ్చింది. ఆమె చేతిలో కలముంది. ఆమె వెనక గదిలోకి వెళ్ళి తన కలంతో నిద్ర పోతున్న పసిపాపపై నుదుటిన ఏదో రాయబోయింది. కానీ కలం చేయిజారి కిందపడిపోయింది. దాంతో ఆందోళనతో అదృష్టదేవత ఆ కలం తీసుకుని ముందుగది ద్వారా బయటకు రాబోయింది.

వస్తూ వుంటే నిద్రపోతున్న రాజుకు ఆమె కాలు తగిలి మెలకువ వచ్చింది. రాజు వులిక్కి పడిలేచి అదృష్టదేవత కాలుపట్టుకుని ‘ఎవరునీవు! మామూలు మనిషివా? దొంగవా?’ అన్నాడు.

అదృష్టదేవత నన్ను వదిలిపెట్టు, నేను అదృష్టదేవతను నేను ఆ బిడ్డ తలరాత రాయడానికి వచ్చాను. అంతలో కలం జారిపోయింది. నేను వెళ్ళాలి. వదులు అంది.

రాజు ‘నువ్వు ఆ బిడ్డ నుదుట ఏం రాశావు చెప్పు అన్నాడు నేను ఆ బిడ్డ నుదుట రాయబోయేంతలో కలం నేలపడిపగిలిపోయింది. ఆ అబ్బాయికి పద్దెనిమిదవ ఏట పెళ్ళి అవుతుంది. అగ్ని గుండం చుట్టూ నాలుగు సార్లు తిరిగిన వెంటనే ఆ అబ్బాయి సింహం కరిచి చనిపోతాడు అంది.

అదృష్టదేవత వెళ్ళబోతూవుంటే ఈ బ్రాహ్మడు నాకు ఆశ్రయమిచ్చాడు. అతనికి రుణపడివున్నాను. నువ్వు చెప్పింది అబద్ధమని నిరూపించేదాకా నాకు శాంతివుండదు అన్నాడు రాజు.

తెల్లవారికా నిద్రలేచి ఆ కుటుంబంనించీ వీడ్కోలు తీసుకుంటూ తను రాజునని చెప్పి ‘ మీ అబ్బాయి పెళ్ళికి మాత్రం నన్ను పిలవడం మరచిపోకండి’ అని చెప్పాడు.

ఏళ్ళు గడిచాయి బ్రాహ్మణుడి కొడుక్కి వివాహం నిశ్చయమైంది. బ్రాహ్మణుడు. రాజుదగ్గరికి వెళ్ళి ఆహ్వానించాడు. రాజు ఆనందంతో సపరివారంగా బ్రాహ్మణుడి కొడుకు వెళ్ళికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడి కొడుకు సింహంతో చనిపోతాడని, అది విధిలిఖితమని గ్రామానికంతా తెలుసు. దాన్ని ఎలా రాజుగారు అడ్డుకుంటాడో అని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచుశారు.

రాజు తనసైన్యాన్ని గ్రామం చుట్టూ కావలికాయమన్నాడు. ఎవర్నీ పెళ్ళి మంటపం దగ్గరికి అనుమతించలేదు. రాజు తన ఖడ్గాన్ని చేత పట్టుకుని వివాహమండపం దగ్గర అప్రమత్తంగా నిల్చున్నాడు.

పెళ్ళి కొడుకు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అగ్ని గుండం చుట్టూ తిరిగాడు.

నాలుగోసారి సారి అగ్నిగుండం చుట్టబోయేంతలో బ్రహ్మండమైన గర్జన వినిపించింది. హఠాత్తుగా సింహం వచ్చి అతని గొంతుకొరికి చంపేసింది. ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు. అంతా స్థాణువులయిపోయారు. సింహం ఎక్కడి నించీ వచ్చిందో ఎవరికీ తెలీదు.

ఎవరో అక్కడ ఒక కొండమీద సింహం బొమ్మవుంది. ఆ బొమ్మ హఠాత్తుగా పెద్దదై వచ్చి పెళ్ళి కొడుకును చంపేసి మళ్ళీ వెళ్లి ఆ బొమ్మలో కలిసిపోయిందన్నారు.

రాజు జరుగుతున్నదంతా నిశ్చాలంగా గమనించి రోదిస్తున్న బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి ధైర్యం చెప్పి ‘మీ కొడుకు శరీరాన్ని ఆరు నెలలపాటు భద్రపర చండి అన్నాడు. ‘నేను మీ కొడుకును బతికించకుంటే నా రాజ్యాన్ని వదులుకుని సన్యాసం స్వీకరిస్తాను. ధైర్యంగా వుండండి’ అని చెప్పాడు.

బ్రాహ్మణ దంపతులు వనమూలికలతో, తైలంతో కొడుకు శరీరం చెడకుండా భద్రపరిచారు.

నెలలు గడిచాయి. రాజు తన ప్రయాణాల్లో చాలా మందికి సాయం చేశాడు. ఆపదలో వున్నవాళ్ళని ఆదుకున్నాడు. ఒక సందర్భంలో అరణ్యం తగలబడిపోతూవుంటే దాని నించి ఒక ‘నాగు!ను రక్షించాడు ఒక బావి గట్టున విశ్రాంతి తీసుకుంటూవుంటే బావి నించీ ఒక పాము వచ్చి మంటల నుండి తన భర్తను రక్షించినందుకు కృతజ్ఞత తెలిపింది. ఆ పాము మీకు ఏ సందర్భంలో నా సాయం అవసరమయితే చెప్పండి. అంది. రాజు విషాదంగా బ్రాహ్మణుకుమారుని వుదంతం చెప్పాడు. ఆరు నెలలుగా అతని శరీరాన్ని తైలంలో భద్రపరిచారు. యిది చివరి రోజు. అతన్ని తిరిగి సజీవుణ్ణి చెయ్యడం ఎలాగో తెలీడం లేదు అన్నాడు.

ఆ నాగు భార్య బావిలోకి దూకి లోపలికి వెళ్ళి తన తనగ్గరున్న ఒక తేెనెకుండను తెచ్చియిచ్చింది. అది తీసుకుని రాజు బయల్దేరాడు.

అతను బ్రాహ్మణునియింటి దగ్గరకు వెళ్ళేసరికి ప్రతి ఒక్కరూ యింటి బయట ఎదురుచూస్తున్నారు. చిన్నదీపం వెలుగుతోంది. రాజు వెళ్ళి తన తేెనె కుండను అతని శరీరంపై పోశాడు. వెంటనే చలనం కలిగి ఆ బాలుడు నిద్ర లేచినట్లు లేచాడు.

ఆకాశవాణి వినిపించింది. అదృష్టదేవత పలికింది.

‘రాజా! నువ్వు నన్ను ఓడించావు. విధి నీ సాహసం ముందు తలవంచింది’ అంది.

– సౌభాగ్య

First Published:  6 April 2016 1:02 PM GMT
Next Story