Telugu Global
Family

ముసుగు

కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఎవడూ సన్యాసి కాడు. కాని జనం భ్రమల్లో వుంటారు. బట్టలు మార్చినంతమాత్రన మారిపోతామనుకుంటారు. ఈ మారిపోవడం కూడా మరిదేన్నో పొందడానికే అయివుంది. అన్నింటినీ వదులుకోవడం అంత సులభం కాదు. మనుషులు అభిప్రాయాల్ని మార్చుకుంటారు. కానీ అభిప్రాయాల్ని వదులుకోరు. పైపైన మారడం సులభం. లోపలి మార్పు కష్టం. మార్పు లేని తనాన్ని కప్పిపుచ్చడానికి మనుషులు ముసుగులు వేసుకుంటారు. ముసుగులు మారుస్తారు. మారిన ముసుగుల్ని చూసిన జనం వీళ్లు మారిపోయారనుకుంటారు. సత్యాన్ని గ్రహించాలనుకున్న వ్యక్తి […]

కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఎవడూ సన్యాసి కాడు. కాని జనం భ్రమల్లో వుంటారు. బట్టలు మార్చినంతమాత్రన మారిపోతామనుకుంటారు. ఈ మారిపోవడం కూడా మరిదేన్నో పొందడానికే అయివుంది. అన్నింటినీ వదులుకోవడం అంత సులభం కాదు. మనుషులు అభిప్రాయాల్ని మార్చుకుంటారు. కానీ అభిప్రాయాల్ని వదులుకోరు. పైపైన మారడం సులభం. లోపలి మార్పు కష్టం. మార్పు లేని తనాన్ని కప్పిపుచ్చడానికి మనుషులు ముసుగులు వేసుకుంటారు. ముసుగులు మారుస్తారు. మారిన ముసుగుల్ని చూసిన జనం వీళ్లు మారిపోయారనుకుంటారు.

సత్యాన్ని గ్రహించాలనుకున్న వ్యక్తి దాన్ని తెలుసుకునేదాకా వదిలి పెట్టడు. సత్యాన్ని తెలుసుకోవడమంటే ఏది వాస్తవమో, ఏది కాదో దాన్ని తెలుసుకోవడం, ఉన్నదాన్ని దర్శించడం వల్ల సత్యం ఆవిష్కారమవుతుంది. తనను తాను తెలుసుకోవడమే సత్యం. ఆ అన్వేషి మార్పుల వెంట పరుగు తీయడు. ఇప్పుడు ఈ క్షణం జీవిస్తాడు.

ఒక నగరంలో గొప్ప ధనవంతుడు వుండేవాడు. అతను దేశంలోనే గొప్ప సంపన్నుడు. నిరంతరం ధన సంపాదనలోనే మునిగి వుండేవాడు. సంపాదించడం, సంపాదించిన దాన్ని కూడబెట్టుకోవడం తప్ప అతనికి మరో చింతన లేదు. సాధారణంగా సంపన్నులకు గొప్పవాళ్లతో సంబంధాలుంటాయి. అట్లాగే ఆ ధనవంతుడికి ఆ దేశం రాజుతో సంబంధాలున్నాయి. ఒక సందర్భంలో ఎవరికీ ఏ లోటూ కలగకుండా ధనవంతుడు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అతని ఐశ్వర్యానికి విస్తుపోతూ రాజు పరివారం విందువినోదాల్లో మునిగింది.

రాచకుటుంబానికి ప్రత్యేక ఏర్పాట్లు వుంటాయి కదా! తన మందిరంలో ధనవంతుడు రాజుగారికి బస కల్పించాడు. తను కూడా రాజుగారితో బాటు కూచున్నాడు. సేవకులందరూ సపర్యలు చేస్తున్నారు. పంచభక్ష్యపరమాన్నాలు వడ్డిస్తున్నారు. యింతలో ఒక పనివాడి చేతిలోంచి వేడివేడి పళ్ళెం అన్నంతో సహా కింద పడింది. ఆ పడడం ధనవంతుడి కాలిమీద పడింది. ఆ వేడికి ధనవంతుడి కాలు కాలి బొబ్బలు లేచాయి. ధనవంతుడి కోపం కట్టలు తెంచుకుంది. ఆ పనివాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది. తన పని ముగిసిపోయిందనుకున్న పనివాడు ధనవంతుడి ఆగ్రహాన్ని చూసి తన ప్రయత్నం తను చేద్దామనుకుని ”ఎవరయితే తన కోపాన్ని జయిస్తాడో అతను స్వర్గానికి వెళతాడు” అన్నాడు. అందరికీ వినిపించేంతగా. ఆ మాటతో ధనవంతుడు కోపాన్ని దిగమింగుకుని చిరునవ్వు నటించాడు. అతని సహనానికి రాజు కూడా అభినందించాడు. పనివాడు ”క్షమించే తత్త్వమున్న వాళ్ళకే స్వర్గ ప్రాప్తి” అన్నాడు. ధనవంతుడు ఆగ్రహాన్ని అణిచిపెట్టి అందరూ వినేలా ”నిన్ను క్షమించాను” అని పనివాడితో అన్నాడు. పనివాడు ఊపిరిపీల్చుకుని ”దయాగుణం ఉన్న వాళ్ళనే దైవం ప్రేమిస్తాడు.” అన్నాడు.

ధనవంతుడు ” నీకు స్వేచ్ఛనిస్తున్నాను. ఈ ధనం తీసుకుని వెళ్ళు. నీ యిష్టమొచ్చినట్లు జీవించు” అని డబ్బుసంచిని యిచ్చి పంపించాడు. అందరి దృష్టిలో ధనవంతుడు మహాపురుషుడయ్యాడు. ఆ నగరంలోనే కాదు దేశమంతా ధనవంతుని కీర్తి వ్యాపించింది. అప్పటిదాకా అతన్లో ఉన్న కోపం,అహంకారం,పగ, లోభి గుణం హఠాత్తుగా రంగు మార్చుకున్నాయి. శాంతం, దానగుణం, దయాశీలంగా మారిపోయాయి. లోకమే అతని పరివర్తనకు విస్తుపోయింది.

అనుకూలాన్ని బట్టి అతని ముసుగులు మారిపోయాయి. కోపం శాంతంగా మారింది. ప్రతికారం దయాగుణంగా మారింది. యీ మార్పులు నిజమైన మార్పులా? అన్నీ అహం కేంద్రంగా వున్నవి కావా? అభినందనల్ని ఆధారం చేసుకున్నవి కావా? ధర్మమన్నది అంత చవగ్గా దొరికితే ప్రతివాడూ ధర్మాత్ముడయి పోతాడు. మనిషి చెయ్యాల్సింది ముసుగులు తగిలించుకోవడం కాదు. రకరకాల ముసుగుల్ని మార్చుకోవడం కాదు. క్రమక్రమంగా అన్ని ముసుగుల్ని వదిలించుకోవడమన్నదే నిజమైన వైరాగ్యం. సన్యాసం.

-సౌభాగ్య

First Published:  6 April 2016 1:01 PM GMT
Next Story