Telugu Global
Family

ఆనందం

అప్పుడప్పుడే తెల్లవారుతోంది. వూరిలో జనం మేలుకుంటున్నారు. వున్నట్లుండి ఆకాశంనించే ఏవో మాటలు వినిపించాయి. వూళ్లో జనమంతా వులికిపడి బయటకు పరుగులు తీశారు. అందరూ ఆకాశంలోకి చూశారు. ఆకాశవాణి తన అపూర్వస్వరంతో వాళ్లను ఆశీర్వదిస్తూ పలికింది. ”మీరందరూ తరతరాలుగా కష్టపడుతున్నారు. బాధలు పడుతున్నారు. శ్రమ పడుతున్నారు. కానీ మీ పేదతనం అలానే ఉంది. మీ కష్టాలు తీరలేదు. అందుకని భగవంతుడు మిమ్మల్ని దయదలచాడు. మిమ్మల్ని ఆదుకోవాలనుకున్నాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఒకటే. మీ దు:ఖాలన్నిట్నీ మూటగట్టి తీసుకురండి. వూరి పొలిమేరకు […]

అప్పుడప్పుడే తెల్లవారుతోంది. వూరిలో జనం మేలుకుంటున్నారు. వున్నట్లుండి ఆకాశంనించే ఏవో మాటలు వినిపించాయి. వూళ్లో జనమంతా వులికిపడి బయటకు పరుగులు తీశారు. అందరూ ఆకాశంలోకి చూశారు. ఆకాశవాణి తన అపూర్వస్వరంతో వాళ్లను ఆశీర్వదిస్తూ పలికింది. ”మీరందరూ తరతరాలుగా కష్టపడుతున్నారు. బాధలు పడుతున్నారు. శ్రమ పడుతున్నారు. కానీ మీ పేదతనం అలానే ఉంది. మీ కష్టాలు తీరలేదు. అందుకని భగవంతుడు మిమ్మల్ని దయదలచాడు. మిమ్మల్ని ఆదుకోవాలనుకున్నాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఒకటే. మీ దు:ఖాలన్నిట్నీ మూటగట్టి తీసుకురండి. వూరి పొలిమేరకు తీసుకురండి. అక్కడ వదిలి పెట్టండి. అక్కడ కావలసినన్ని సుఖాలు కుప్పలు పోసి వుంటాయి. వాటిని సంచుల్లో నింపుకుని ఎవరికి కావలసినన్ని వారు తీసుకుపోండి”.

ఆ మాటల్తో వూరిజనం వుక్కిరిబిక్కిరయ్యారు. తమ అదృష్టానికి పొంగిపోయారు. అది వాళ్లు కలలో కూడా వూహించలేనిది. దేవుడు యింత హఠాత్తుగా దయదలుస్తాడని తమ కష్టాలన్నీ తీరిపోతాయని వాళ్ళు ఊహించలేదు. అందరూ తమ దు:ఖాన్ని మూట కట్టడం మొదలు పెట్టారు. దేన్ని వదిలిపెట్టకుండా మరిచిపోయిన బాధల్ని కూడా మళ్లీమళ్లీ గుర్తు చేసుకుని మూటల్లో కుక్కారు.

ఆవూళ్లో ఒక సన్యాసి వున్నాడు. వూరి చివర గుడిసె వేసుకుని ధ్యానంలో మునిగి

ఉండేవాడు. అందరూ దు:ఖాల్ని మూటగట్టుకుని వెళుతూ ఆ గుడిసె దగ్గర ఆగారు. ధ్యానముద్రలో వున్న సన్యాసిని లేపి జరిగిన విషయం చెప్పారు. అంతా విన్నాడు. కానీ ఆయన ఏమీ బదులివ్వలేదు. జనం ”స్వామీ! ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిపోతుంది. నీ బాధలన్నీ మూటగట్టి మాతోబాటు తీసుకురా. అక్కడ వదిలి నీకు కావలసిన సుఖాల్ని మూటకెత్తి తెచ్చుకో” అన్నారు. సన్యాసి ససేమిరా అన్నాడు. ”మీరు వెళ్లండి. తెచ్చుకోండి. సంతోషంగా వుండండి. ఏ లంపటాలు లేనివాణ్ణి. నాకెందుకవన్నీ” అన్నాడు. ఎందరు ఎంత బతిమలాడినా అతను రాలేదు.

”ఈ సన్యాసి ఖర్మ” అనుకుని వూరి జనం దు:ఖాల్ని మోసుకునిపొలిమేరకు వెళ్లారు. అక్కడ సంచీలు ఖాళీ చేశారు. ఒక్క దు:ఖం కూడా మిగలకుండా సంచీలు మరీ విదిలించారు. కుప్పలుపోసిన సుఖాల్ని సంచీలు నింపి తలకెత్తుకున్నారు. పిల్లా జెల్లా అందరూ చచ్చేంత బరువులు మోసుకుంటూ వూళ్లోకి వచ్చారు. వస్తూ సన్యాసి,గుడిసె ముందు కూచుని వుంటే ”చూశావా? రమ్మంటే నువ్వు రాలేదు” అన్నారు.

ఆ సన్యాసి చిరునవ్వు నవ్వాడు. భగవంతుడు మనిషికి ఆనందాన్ని మాత్రమే యిస్తాడు. దు:ఖాలు మనం కల్పించుకున్నవి, అని అతనికి తెలుసు. పైగా అందరికీ తెలియని, చెప్పినా అర్థం కాని ఒక సంగతి అతనికి తెలుసు. బయట ఏది ఉందో అది ఆనందం కాదు. ఆనందం కోసం బయట వెతకాల్సిన పని లేదు. అది లోపలవుంది. అప్రయత్నంగా అతను దాన్ని అందుకున్నాడు.

జనాలు సన్యాసిని పరిహసించి వూళ్లోకి అడుగుపెట్టారు. అక్కడ దృశ్యం చూసి అవాక్కయ్యారు. అక్కడ అన్నీ భవనాలే వున్నాయి. గుడిసెలున్నచోట మేడలు వున్నాయి. కానీ అన్నీ ఒకేలా వున్నాయి. పక్కవాడి యిల్లు కూడా తనయిల్లులాగా వుండడం, తనకెంత ఐశ్వర్యముందో ఎదుటివాడికి అంతే వుండడం చూసి మనుషులకు కొత్త బాధలు మొదలయ్యాయి.

-సౌభాగ్య

First Published:  6 April 2016 1:01 PM GMT
Next Story