Telugu Global
Family

జింక కథ

పాలిటానా అనే పట్టణం షత్రంజ్‌ అనే నది ఒడ్డునవుంది. పాలిటానా పట్టణం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎందరో తీర్థయాత్రికులు ఆ నగరాన్ని సందర్శించే వాళ్ళు. కారణం ఆ పట్టణంలో ఒక పెద్ద మర్రివృక్షం వుంది. ఆ వృక్షంలో శివుడు కాపురముంటారని అందరూ నమ్మేవాళ్ళు భక్తులు. ఆ వృక్షానికి పూజలు చేసి తమ కోరికలు విన్నవించుకునేవాళ్ళు. అల్లా ఎందరో కోరికలు నెరవేరాయి. ఆ రకంగా ఆ వృక్షం ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో ప్రసిద్ధ చెందింది. దగ్గర్లో ఒక గ్రామంలో […]

పాలిటానా అనే పట్టణం షత్రంజ్‌ అనే నది ఒడ్డునవుంది. పాలిటానా పట్టణం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎందరో తీర్థయాత్రికులు ఆ నగరాన్ని సందర్శించే వాళ్ళు. కారణం ఆ పట్టణంలో ఒక పెద్ద మర్రివృక్షం వుంది. ఆ వృక్షంలో శివుడు కాపురముంటారని అందరూ నమ్మేవాళ్ళు భక్తులు. ఆ వృక్షానికి పూజలు చేసి తమ కోరికలు విన్నవించుకునేవాళ్ళు. అల్లా ఎందరో కోరికలు నెరవేరాయి.

ఆ రకంగా ఆ వృక్షం ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో ప్రసిద్ధ చెందింది.

దగ్గర్లో ఒక గ్రామంలో నరపతి అనే ఒక పేదవాడు వుండేవాడు. అతనికి నలుగురు పిల్లలు. తనకు వచ్చిన ఆటలు ప్రదర్శిస్తూ పాటలు పాడుతూ గ్రామంలో యితర్ల సాయమందుకునేవాడు. రాత్రిపూట విల్లంబులు తీసుకుని అడవికి వెళ్ళి ఒక జంతువును కూడా వేటాడ లేకపోయాడు. యింటికి వెళ్ళడానికి మనస్కరించలేదు. రాత్రికి అడవిలోనే వుండిపోదామనుకున్నాడు. జంతువుల భయంతో ఒక చెట్టెక్కి కొమ్మల మీద కూర్చున్నాడు.

హఠాత్తుగా అర్థరాత్రి ఏదో కాంతి మీద పడ్డట్లుమేలుకున్నాడు.కింద ఏడు మంది ఏడు కాగితాల్ని పట్టుకుని వున్నారు. ఏదో సంజ్ఞలు చేసుకున్నారు. అంతలో అన్ని వేపుల నించీ జనం గుంపులుగా వచ్చారు. ఆ అరణ్యం పెద్ద నగరంగా మారిపోయింది.

అంగళ్ళు వెలిశాయి. పశువులు వచ్చాయి రైతులు నాగళ్ళతో పొలందున్నారు. గుర్రాలు పరుగులు తీశాయి. చౌరస్తాలో కిరీటాలు, ఆభరణాలు పెట్టుకుని జనం పాటలు పాడారు. నాట్యమటారు. అందరూ ఆనందంగా వున్నారు. ఆకలి ఛాయలు లేవు. అక్కడ మధ్యలో ఒక సింహాసనముంది. మెల్లగా కదిలివచ్చిన ఒక జింక ఆ సింహాసనంలో కూచుంది. అందరూ దానికి తలలు వంచి నమస్కరించారు.

నరపతి యిదంతా కలా నిజమా అనుకున్నాడు. బహుశా అతను కల గన్నాడేమో. ఉదయం తొలి కిరణంతో అంతా అదృశ్యమయిపోయింది. అతను చెట్టుకిందికి దిగివచ్చి అంతా వెతికారు. తనకు కనిపించింది ఏదీ అక్కడ లేదు.

ఇంటికి తిరిగి వెళ్లి జరిగిందంతా అతని భార్యతో చెప్పాడు. భార్య అతని మాటలు నమ్మలేదు.

అతను మరుసటి రాజు రాత్రి తన భార్యను తీసుకెళ్లి చెట్టెక్కి కూచున్నాడు. నిన్న రాత్రి జరిగినట్లు కాగడాలు, మనుషులు, నాట్యాలు, జింక, సింహాసనం అన్నీ యథాతథంగా జరిగాయి. భార్య ఆశ్చర్య పోయింది. ఉదయాన్నే కిందికి దిగిన వెంటనే అన్నీ అదృశ్యమై పోయాయి.

నరపతి ఈ విషయాన్ని దేశానికి రాజయిన బహుదూర్‌సింగ్‌కు విన్నవించాలని అనుకున్నాడు. మళ్ళీ యిదంతా ఏదయినా యిబ్బందులకు కారణ మవుతుందా? అని ఆలోచనలో పడ్డాడు.

ఐనా ఏమయితే అది కానీ అని బయల్దేరాడు. భార్యతో కలిసి రాజు దగ్గరకి వెళ్ళి చూసిందంతా వివరించాడు.రాజు అంతా విని నిజానిజాలు ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకోవడానికి వాళ్ళతో బాటు అడవికి వచ్చాడు. అదే చెట్టెక్కి దాక్కున్నాడు.

అర్థ రాత్రి గడిచింది. ఏడుగురు కాగడాలతో రావడం జన సందోహంతో నిండడం, ఆటలు, పాటలు, సింహానం, జింకవచ్చి సింహాసనం మీద కూచోవడం చూసి ఆశ్చర్యపోయాడు.

ఉదయం మొదలు కాగానే ఒక్కో దృశ్యం మాయం కావడం మొదలయింది. జింక అక్కడి నించీ అరణ్యంలోకి వెళ్ళడం కనిపించింది. వెంటనే రాజు తన విల్లు సంధించి బాణం వేసి జింకను చంపాడు.

అప్పుడు ఆకాశం నించీ ఒక రథం భూమికి దిగింది. దేవదూత ఆ జింక శరీరాన్ని రథంలో తీసుకుపోవడానికి ముందుకు వచ్చాడు.

అప్పుడు రాజు చెట్టు దిగివచ్చి ‘మీరు ఎందుకు జింకను తీసుకుపోవా లనుకున్నారు. మీ రెవరు?’ అని అడిగాడు

వాళ్ళు మేము ఇంద్రసభ నించి వచ్చాము. ఈ జింక యింద్రుని కొడుకు అతను శాపవశాత్తు జింకగా జన్మించాడు. మీ బాణంతో అతనికి శాపవిమోంచన అని చెప్పి జింకను తీసుకుని వాళ్ళు అదృశ్యమయ్యారు.

రాజు వెళ్ళి సింహాసనం మీద కూర్చుని నరపతిని పిలిచి ‘నేను మీకు వరమివ్వదలచుకున్నాను. నీకు ఏంకావాలోకోరుకో’ అన్నాడు. నరపతి ‘మహారాజా! ఒక వేళ నేను జింకను చంపివుంటే ఈ నగరం, సంపద అంతా నాదయ్యేది. యిప్పుడయినా నేనే మీకు యిదంతా చూపాను. కాబట్టి యిప్పుడయినా యిదంతానాదే’ అన్నాడు.

రాజు వివేకవంతుడు, జ్ఞాని వెంటనే సింహాసనం నించి లేచి నరపతిని అందులో కూచోమన్నాడు. నరపతి కూచున్నాడు. కానీ అతని ముఖంపై విషాద ఛాయలు కనిపించాయి. రాజు ‘నువ్వు కోరుకున్నట్లే జరిగింది కాదా! ఎందుకు దిగులుగావున్నావు’ అన్నాడు నరపతి ‘రాజా! నేను మర్యాదస్తుల కుటుంబానికి చెందిన వాణ్ణి. మన పొరుగురాజు నన్ను గుర్తించడు. ఎందుకంటే నేను ప్రసిద్ధుణ్ణి కాను. నా గురించి ఎవరికీ తెలీదు’ అన్నాడు.

రాజు ‘ఐతే నా కూతుర్ని నీ కిచ్చి పెళ్ళి చేస్తాను. దాంతో నీ గురించి అందరికీ తెలుస్తుంది. నీ స్థాయి పెరుగుతుంది. అప్పుడందరూ నిన్ను గౌరవిస్తారు’ అన్నాడు.

ఆ రకంగా వీధిలో పాటలు పాడుకునే నరపతి జహదూర్‌సింగ్‌ రాజు కూతుర్ని పెళ్ళాడి పేరు, సంపద గడించాడు.

– సౌభాగ్య

First Published:  5 April 2016 1:02 PM GMT
Next Story