Telugu Global
Family

విశ్వాసం

జునాయిడ్‌ సూఫీ మతగురువు. ఆయన ప్రతి రోజూ ప్రార్థనానంతరం ఆకాశంలోకి చూసి ‘దేవా! నీ అనురాగం సాటిలేనిది. మమ్మల్ని ఎప్పుడూ కనిపెట్టి వుంటావు. నీపట్ల కృతజ్ఞత ప్రకటించడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ నామనసును నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు” అనేవాడు. ఆయన ఒకసారి శిష్యులతో కలిసి తీర్థయాత్రకు బయల్దేరాడు. వాళ్లు ఎన్నో గ్రామాల గుండా వెళ్లాల్సివచ్చింది. మొదటి మూడురోజులు వెళ్లిన గ్రామాల్లో వాళ్లు ఎన్నో యిబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ గ్రామాలు సాంప్రదాయిక ఇస్లాం […]

జునాయిడ్‌ సూఫీ మతగురువు. ఆయన ప్రతి రోజూ ప్రార్థనానంతరం ఆకాశంలోకి చూసి ‘దేవా! నీ అనురాగం సాటిలేనిది. మమ్మల్ని ఎప్పుడూ కనిపెట్టి వుంటావు. నీపట్ల కృతజ్ఞత ప్రకటించడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ నామనసును నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు” అనేవాడు. ఆయన ఒకసారి శిష్యులతో కలిసి తీర్థయాత్రకు బయల్దేరాడు. వాళ్లు ఎన్నో గ్రామాల గుండా వెళ్లాల్సివచ్చింది. మొదటి మూడురోజులు వెళ్లిన గ్రామాల్లో వాళ్లు ఎన్నో యిబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ గ్రామాలు సాంప్రదాయిక ఇస్లాం మతస్థులవి. వాళ్లు సూఫీ మతస్థుల్ని తక్కువగా చూసేవాళ్లు. ఆ గ్రామస్థులు వీళ్లకు తిండి, నీళ్లు యివ్వకపోగా తమ గ్రామల్లో విశ్రాంతి తీసుకోడానికికూడా వాళ్లు అనుమతించలేదు. దానివల్ల వాళ్లందరూ ఎన్నో యిబ్బందులకు లోనయ్యారు. మూడురోజుల తిండి,నీళ్లు లేక అలసిపోయారు. కానీ జునాయిడ్‌ ఎప్పట్లాగే దైవాన్ని ప్రార్థించడం చూసి విస్తుపోయారు. జునాయిడ్‌ ”దేవా! నీఅనురాగం సాటిలేనిది. మా పట్ల నీకు ఎంతో శ్రద్ధ. మమ్మల్ని కనిపెట్టి వుండడంలో నీలో కరుణ కదలాడుతుంది. మేము నీ దయకు తగిన వాళ్లం కాము. నిజానికి నీ పట్ల కృతజ్ఞత ప్రకటించడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ కృతజ్ఞత నిండిన నా మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తాను” అన్నాడు.

ఆరోజు సాయంత్రం ఎప్పట్లా ఆయన భగవంతుణ్ణి ఆ విధంగా ప్రార్థించే సరికి శిష్యులు ఆశ్చర్యపోయి ”గురువుగారూ! మూడురోజుల నించీ తిండీ, నీళ్లూ లేకుండా మనం అల్లాడుతున్నాం. ఆ గ్రామస్థులు మనల్ని అవమాన పరిచారు. తరిమికొట్టారు. యిన్ని జరిగినా మీరు ఎప్పట్లాగా ప్రార్థించారు. ‘నువ్వు దయగలవాడివి’ అన్న మాటలు

ఉపసంహరించి ఉంటే బావుండేది’ అన్నారు.

జునాయిడ్‌ శిష్యుల వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ”మీరు అలా అనకూడదు. నా విశ్వాసానికి నియమనిబంధనలు లేవు. నాకృతజ్ఞత ప్రయోజనాల్ని ఉద్దేశించింది కాదు. దేవుడేదో యిచ్చాడని ఆయన పట్ల వినయం ప్రదర్శించాలనుకోను. దేవుడు మనకు ఈ భూమిపై ఉనికిని కల్పించాడు. ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటించడానికి అది చాలు. ఎందుకంటే ఆ ఉనికి నేను కష్టపడి సాధించుకున్నదికాదు. అయాచితంగా వచ్చిన అదృష్టమది. మనం గడిపిన ఈ మూడు రోజులు గొప్ప సౌందర్యంతో తొణికిసలాడాయి. ఈ మూడు రోజులూ నాలో కోపం మొలకెత్తుతుందా? లేదా? అని పరిశీలించే గొప్ప అవకాశం నాకు దొరికింది. దేవుడి దయవల్ల నాలో కోపమే లేదు. ఫలితంగా ఉనికికి సంబంధించిన నా ఉద్ధేశంలో ఎట్లాంటి వ్యతిరేకతా తలెత్తలేదు. నాకృతజ్ఞతలో ఎట్లాంటి కదలికా లేదు. ఇదొక అగ్నిపరీక్ష. దాన్నించి ఎట్లాంటి ఆటంకం లేకుండా నేను బయట పడ్డాను. అంతకుమించి నాకేం కావాలి? జననంలోనూ, మరణంలోనూ నేను వునికిని సందర్శిస్తాను. ఇది నాప్రేమ వ్యవహారం. ఇది కొంతమంది ఐశ్యర్యవంతులు, కొంతమంది పేదవాళ్లు అన్న వ్యవహారానికి సంబంధించిన విషయం కాదు. కొంతమంది విజేతలు, కొంతమంది పరాజితులు అన్న విషయం కాదు. ఈ విషయం ఎవరికీ సంబంధించినది కాదు. ఎవరూ దీంతో ఏమీ చెయ్యలేరు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతమయిన విషయం. యథార్థంతో నాకున్న సన్నిహిత సంబంధం. ఇక్కడ ఒక మహా సమన్వయముంది. మహా శాంతి వుంది. నేను చాలా విశ్రాంతిగా నా నిలయంలో వున్నాను. దేవుడు నాకు యిది యిచ్చాడని అది యిచ్చాడని నేను ఆయన పట్ల కృతజ్ఞతగా వుండాలని అనుకోను. ఇది వ్యాపారం కాదు. ఆయన మనకు వునికి నిచ్చాడు. ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటించడానికి అది చాలు” అన్నాడు.

శిష్యులు నిర్ఘాంతపోయారు.

-సౌభాగ్య

First Published:  3 April 2016 1:02 PM GMT
Next Story