Telugu Global
CRIME

అది ఆత్మ‌హ‌త్య‌కాదు...హ‌త్య‌.. కామ‌న్‌సెన్స్ లేదా...పోలీస్ అధికారికి కోర్టు చీవాట్లు!

  ఆత్మ‌హ‌త్య‌గా నిర్దారించి మూసివేసిన ఒక కేసు విష‌యంలో, విచార‌ణ జ‌రిపిన‌ అధికారిపై కేర‌ళ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అది ఆత్మ‌హ‌త్య‌కాదు, హ‌త్య అని తెలిపే ఆధారాల‌ను వివ‌రించిన కోర్టు, కేసుని మూసివేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారిపై చ‌ర్య తీసుకోవాల్సిందిగా పోలీసుల‌ను ఆదేశించింది. కేసుపై తిరిగి విచార‌ణ జ‌రిపించాలని తీర్పునిచ్చింది. 2007లో కేర‌ళ‌లోని చ‌వారా అనే గ్రామానికి చెందిన సుద‌ర్శ‌న్ అనే వ‌క్తి హ‌త్య‌కు గురయ్యాడు. ఈ కేసు విష‌యంలో తుదినివేదిక‌ని త‌యారుచేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారి, హ‌తుడు త‌న‌ని తాను క‌త్తితో పొడుచుకుని, […]

అది ఆత్మ‌హ‌త్య‌కాదు...హ‌త్య‌..  కామ‌న్‌సెన్స్ లేదా...పోలీస్ అధికారికి కోర్టు చీవాట్లు!
X

ఆత్మ‌హ‌త్య‌గా నిర్దారించి మూసివేసిన ఒక కేసు విష‌యంలో, విచార‌ణ జ‌రిపిన‌ అధికారిపై కేర‌ళ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అది ఆత్మ‌హ‌త్య‌కాదు, హ‌త్య అని తెలిపే ఆధారాల‌ను వివ‌రించిన కోర్టు, కేసుని మూసివేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారిపై చ‌ర్య తీసుకోవాల్సిందిగా పోలీసుల‌ను ఆదేశించింది. కేసుపై తిరిగి విచార‌ణ జ‌రిపించాలని తీర్పునిచ్చింది. 2007లో కేర‌ళ‌లోని చ‌వారా అనే గ్రామానికి చెందిన సుద‌ర్శ‌న్ అనే వ‌క్తి హ‌త్య‌కు గురయ్యాడు. ఈ కేసు విష‌యంలో తుదినివేదిక‌ని త‌యారుచేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారి, హ‌తుడు త‌న‌ని తాను క‌త్తితో పొడుచుకుని, ఒక చిన్న నీటి ట్యాంకులో మునిగిపోయి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని తెలిపాడు.

త‌న భ‌ర్తది ఆత్మ‌హ‌త్య‌కాదు, హ‌త్యేనంటూ హ‌తుని భార్య కోర్టుకి వెళ్లింది. కేసు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కేమ‌ల్ పాషా, హ‌తుడు ఎలా మ‌ర‌ణించాడో తెలుపుతున్న తుదినివేదిక‌పై స్పందిస్తూ, తెలివి ఉన్న‌వారు ఎవ‌రైనా పోలీసుల క‌థ‌నాన్ని న‌మ్ముతారా… అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. నిందితుడిని చ‌ట్టం నుండి త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. సుద‌ర్శ‌న్ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించి, దూకాడ‌ని చెబుతున్న‌ వాట‌ర్ ట్యాంక్‌లో స‌రిప‌డా నీరే లేద‌న్నారు. స్థానిక పోలీసులు సైతం కేసుని త‌ప్పుదారి ప‌ట్టించార‌ని పేర్కొన్నారు. తొలుత ఈ కేసుని విచారించిన స్థానిక పోలీసులు, హ‌తుడు త‌న‌కుతానే ప‌దునైన ఆయుధాల‌తో పొడుచుకుని మ‌ర‌ణించాడ‌ని తేల్చారు. 304వ సెక్ష‌న్‌నుండి ఈ కేసుని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత ఇది క్రైం బ్రాంచ్‌కి వెళ్లింది. అయితే క్రైమ్ బ్రాంచ్ అధికారి కూడా సుద‌ర్శ‌న్‌ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని నిర్దారించి కేసుని మూసేశాడు.

తుదినివేదిక వివ‌రాలు చూసిన న్యాయ‌మూర్తి అస‌లు మ‌తిఉన్న‌వారేవ‌రూ దీన్ని ఆత్మ‌హ‌త్యగా భావించ‌రని అన్నారు. దారుణంగా కొట్ట‌డం వ‌ల‌న హ‌తుని ప‌క్క‌టెముక‌లు విరిపోయిన‌ట్టు స్ప‌ష్టంగా ఉంద‌ని ఇది ఆత్మ‌హ‌త్య ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. బాధితుడు దుండ‌గుల నుండి త‌ప్పించుకోవ‌డానికి ప‌రుగులు తీశాడ‌ని ఒక ఇంట్లో త‌ల‌దాచుకున్నాడ‌ని, అయితే అత‌ను తిరిగి బ‌య‌ట‌కు రాగానే మ‌ళ్లీ దాడి చేశార‌ని న్యాయ‌మూర్తి వివ‌రించారు. హ‌తుని భార్య‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, కేసుపై తిరిగి విచార‌ణ‌కు ఆదేశించారు.

First Published:  2 April 2016 2:44 AM GMT
Next Story