Telugu Global
WOMEN

ప‌వ‌ర్ ఏంజిల్స్‌గా అమ్మాయిలు!

ఉత్తర ప్ర‌దేశ్ పోలీస్ యంత్రాంగం మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కోసం ఓ స‌రికొత్త ప్రాజెక్టుకి  శ్రీకారం చుట్టింది. నిన్న‌టివ‌ర‌కు బాధితులుగా ఉన్న అమ్మాయిల‌నే ప్ర‌భుత్వం అప‌ర‌శ‌క్తులుగా మార్చే ప్ర‌య‌త్నాన్ని చేస్తోంది. చ‌దువుకుంటున్న విద్యార్థినులు త‌మ ర‌క్ష‌ణ‌కోసం తామే న‌డుం బిగించేలా ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద రెండుల‌క్ష‌ల మంది అమ్మాయిలను మ‌హిళా ర‌క్ష‌ణ‌లో త‌మ‌కు స‌హ‌క‌రించేలా  పోలీసులు నియ‌మించ‌నున్నారు. ఉమె‌న్ ప‌వ‌ర్ లైన్ (1090) ద్వారా అమ్మాయిల‌ను ఈ విష‌యంలో చైత‌న్య ప‌రుస్తున్నారు. మొద‌టి బ్యాచ్ కింద […]

ప‌వ‌ర్ ఏంజిల్స్‌గా అమ్మాయిలు!
X

ఉత్తర ప్ర‌దేశ్ పోలీస్ యంత్రాంగం మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కోసం ఓ స‌రికొత్త ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. నిన్న‌టివ‌ర‌కు బాధితులుగా ఉన్న అమ్మాయిల‌నే ప్ర‌భుత్వం అప‌ర‌శ‌క్తులుగా మార్చే ప్ర‌య‌త్నాన్ని చేస్తోంది. చ‌దువుకుంటున్న విద్యార్థినులు త‌మ ర‌క్ష‌ణ‌కోసం తామే న‌డుం బిగించేలా ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద రెండుల‌క్ష‌ల మంది అమ్మాయిలను మ‌హిళా ర‌క్ష‌ణ‌లో త‌మ‌కు స‌హ‌క‌రించేలా పోలీసులు నియ‌మించ‌నున్నారు. ఉమె‌న్ ప‌వ‌ర్ లైన్ (1090) ద్వారా అమ్మాయిల‌ను ఈ విష‌యంలో చైత‌న్య ప‌రుస్తున్నారు. మొద‌టి బ్యాచ్ కింద ఇప్ప‌టికే ప‌వ‌ర్‌లైన్ సిబ్బంది (వీరిని ఏప్రిల్ 10నుండి స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్లుగా పిల‌వ‌నున్నారు) వెయ్యిమంది అమ్మాయిల‌ను ఎంపిక చేశారు.

అమ్మాయిల ఎంపిక‌కోసం నాలుగు ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌ను విద్యాసంస్థ‌లు, పోలీస్ స్టేష‌న్లు, గ్రామ పాల‌నా కార్యాల‌యాల ద్వారా పంపిణీ చేశారు. 86వేల‌మంది అమ్మాయిలు ప‌వ‌ర్ ఎంజిల్స్‌గా విధులు నిర్వ‌ర్తించేందుకు ఉత్సాహంగా ముందుకు రాగా, వారి ఎంపిక కార్య‌క్రమాలు జ‌రుగుతున్నాయి.

ఎంపిక చేసిన అమ్మాయిల‌కు శిక్ష‌ణ ఇచ్చి వారికి ప‌వ‌ర్ ఎంజిల్స్ అనే డిజిగ్నేష‌న్ ఇస్తామ‌ని, వీరికి స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ కార్డుల‌ను మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఉమెన్ ప‌వ‌ర్ లైన్‌కి ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ఇన్‌ఛార్జ్ న‌వ్‌నీత్ సెకెరా అన్నారు.

ప‌వ‌ర్ ఏంజిల్స్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అమ్మాయిలు త‌మ‌చుట్టూ ఉన్న ప్రాంతాల్లో, విద్యాసంస్థ‌ల్లో మ‌హిళలు, అమ్మాయిల మీద జ‌రుగుతున్న గృహ‌హింస‌, వేధింపుల‌ను పోలీసుల దృష్టికి తీసుకువ‌స్తార‌ని ఉమెన్ ప‌వ‌ర్ లైన్ డిప్యుటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ బ‌బితా సింగ్ వెల్ల‌డించారు. మ‌హిళ‌లు పోలీసు స్టేష‌న్ల‌కు వ‌చ్చి ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నార‌ని, ప‌వ‌ర్ ఏంజిల్స్ ద్వారా ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని ఆమె అన్నారు.

ప‌వ‌ర్ ఏంజిల్స్‌, లేదా స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే అమ్మాయిలు ప‌దకొండు ఆపైన చ‌దువుకుంటున్న విద్యార్థినులు అయి ఉండాలి. వీరిని వారి త‌ల్లిదండ్రుల అనుమ‌తితో వారు చ‌దువుతున్న‌ కాలేజి నామినేట్ చేయాల్సి ఉంటుంది. వీరు ఈ విధిలో మూడునుండి ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటారు. వీరంద‌రికీ స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ అనే గుర్తింపు కార్డుల‌ను ఇస్తారు. అయితే వీరంతా స‌మాచారాన్ని అందించే వేగుల్లాగే ఉంటారు త‌ప్ప అంత‌కు మించి ఆచ‌ర‌ణ విధుల్లోకి రార‌ని న‌వ్‌నీత్ సెకెరా తెలిపారు. ప‌వ‌ర్ ఏంజిల్‌గా ఉన్న ప్ర‌తి అమ్మాయి మ‌రొక ప‌దిమంది అమ్మాయిల‌ను ఇదే బాట‌లో చైత‌న్యప‌ర‌చాల్సి ఉంటుంద‌ని న‌వ్‌నీత్ అన్నారు.

వీరంద‌రికీ ఫోన్ ద్వారా క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్ పాఠాలు అందించేలా ఔట్ బౌండ్ డైలింగ్ అనే విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా వీరికి మహిళా చ‌ట్టాలు, పోలీస్ వ్య‌వ‌స్థ ఎలా ప‌నిచేస్తుంది, వ్య‌క్తిగ‌త ఆరోగ్యం, ప‌రిశుభ్ర‌త‌, సామాజిక అభివృద్ధి, ఆర్‌టిఐ చ‌ట్టం ద్వారా స‌మాచారం ఎలా పొందాలి…త‌దిత‌ర అంశాల‌పై కూడా రోజుకి తొంభై నిముషాల పాటు అవ‌గాహ‌న క‌లిగిస్తారు. ఈ ప్రాజెక్టు విజ‌య‌వంత‌మై మ‌హిళ‌ల‌పై హింస త‌గ్గాలని కోరుకుందాం.

First Published:  28 March 2016 4:30 AM GMT
Next Story