సంతానం కలగని పురుషుల్లో అనారోగ్యాలు...ఆయుష్ క్షీణత!
సంతానం పొందలేని పురుషులకు అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం హెచ్చుగా ఉంటుందని స్వీడన్ పరిశోధకులు అంటున్నారు. పిల్లలు లేని వారిలో ఆస్టియోపోరోసిస్, మధుమేహం లాంటి సమస్యలు, పిల్లలున్న మగవారిలో కంటే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. సెమన్ నాణ్యత తక్కువగా ఉన్న పురుషుల్లో జీవితకాలం తగ్గుతున్నట్టుగా కూడా వీరు గమనించారు. అయితే అందుకు గల కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. ఈ పరిస్థితిని గుర్తుపట్టేందుకు తగిన జీవరసాయనిక మార్పులు లాంటివి ఏమీ వీరి శరీరాల్లో కనబడటం లేదని, అదే […]
సంతానం పొందలేని పురుషులకు అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం హెచ్చుగా ఉంటుందని స్వీడన్ పరిశోధకులు అంటున్నారు. పిల్లలు లేని వారిలో ఆస్టియోపోరోసిస్, మధుమేహం లాంటి సమస్యలు, పిల్లలున్న మగవారిలో కంటే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు.
సెమన్ నాణ్యత తక్కువగా ఉన్న పురుషుల్లో జీవితకాలం తగ్గుతున్నట్టుగా కూడా వీరు గమనించారు. అయితే అందుకు గల కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. ఈ పరిస్థితిని గుర్తుపట్టేందుకు తగిన జీవరసాయనిక మార్పులు లాంటివి ఏమీ వీరి శరీరాల్లో కనబడటం లేదని, అదే విధంగా ఈ నష్టాన్ని నివారించేందుకు ఇంతవరకు ఎలాంటి మార్గాలూ కనిపెట్టలేదని ఈ పరిశోధకులు వెల్లడించారు.
సంతానం లేని పురుషుల్లో సెక్స్ హార్మోన్లు, జీవ రసాయనాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు, సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉన్న పురుషుల్లో మెటబాలిక్ వ్యాధులు వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉండటం కనిపించింది. ఈ బృందం 192మంది స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న పురుషులను పరిశీలించి, ఆ సమస్యలేని 199మంది అదే వయసున్న మగవారితో పోల్చి చూసింది.
టెస్టోస్టెరాన్ సెక్స్ హార్మోను తక్కువగా ఉన్నవారిలో ఎముకల వ్యాధి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే వీరిలో డయాబెటిస్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉందని ఈ పరిశోధకులు వెల్లడించారు.