Telugu Global
WOMEN

జీవితాన్ని కొన‌సాగించాలి... ప్ర‌మాదం ఓ పీడ‌క‌ల‌

అది జంట న‌గ‌రాల్లోని ఓ హెల్ప్‌లైన్ సెంట‌ర్‌. ఎప్ప‌టిలాగానే ఓ ఫోన్‌కాల్… -తాను గ్రాడ్యుయేష‌న్ చేస్తున్నాన‌ని, తానుండేది ఓ చిన్న ప‌ట్ట‌ణంలో- అని చెప్పిందో ఓ అమ్మాయి. బ‌లీయ‌మైన బాధ సుడులు తిరుగుతుంటే త‌ప్ప హెల్ప్‌లైన్ ఆస‌రా కోరుకోర‌ని అక్క‌డి వాలంటీర్‌కు తెలుసు. అందుకే నేరుగా -నీ స‌మ‌స్య ఏమిట‌మ్మా- అని అనున‌యంగా అడిగింది. ఆ మాత్రం క‌న్‌స‌ర్న్‌కే క‌దిలిపోయిందా యువ‌తి. మెల్ల‌గా తేరుకుని గ‌త కొద్ది నెల‌లుగా తాను అలాంటి ప‌ల‌క‌రింపుకు దూర‌మ‌య్యానంటూ అస‌లు సంగ‌తి […]

జీవితాన్ని కొన‌సాగించాలి... ప్ర‌మాదం ఓ పీడ‌క‌ల‌
X

అది జంట న‌గ‌రాల్లోని ఓ హెల్ప్‌లైన్ సెంట‌ర్‌. ఎప్ప‌టిలాగానే ఓ ఫోన్‌కాల్… -తాను గ్రాడ్యుయేష‌న్ చేస్తున్నాన‌ని, తానుండేది ఓ చిన్న ప‌ట్ట‌ణంలో- అని చెప్పిందో ఓ అమ్మాయి. బ‌లీయ‌మైన బాధ సుడులు తిరుగుతుంటే త‌ప్ప హెల్ప్‌లైన్ ఆస‌రా కోరుకోర‌ని అక్క‌డి వాలంటీర్‌కు తెలుసు. అందుకే నేరుగా -నీ స‌మ‌స్య ఏమిట‌మ్మా- అని అనున‌యంగా అడిగింది. ఆ మాత్రం క‌న్‌స‌ర్న్‌కే క‌దిలిపోయిందా యువ‌తి. మెల్ల‌గా తేరుకుని గ‌త కొద్ది నెల‌లుగా తాను అలాంటి ప‌ల‌క‌రింపుకు దూర‌మ‌య్యానంటూ అస‌లు సంగ‌తి వివ‌రించింది. ఆ యువ‌తికి ఫోన్‌లోనే ధైర్యం చెప్పి, ముఖాముఖి క‌ల‌వ‌మ‌ని సూచించింది వాలంటీర్‌.

ఆ యువ‌తికి నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు నెల‌ల‌పాటు ఏడెనిమిది సిట్టింగ్స్ న‌డిచాయి. ఆ యువ‌తికి జీవితం మీద స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇక ఆమెకు ఎటువంటి కౌన్సెలింగ్ అవ‌స‌రం లేదు. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేసింది. ఎమ్ ఎన్ సి లో ఉద్యోగం వ‌చ్చింది. నాలుగు నెల‌ల కింద‌ట ఆమెలో క‌నిపించిన దైన్యం ఇప్పుడు మ‌చ్చుకి కూడా లేదు. ధైర్యానికి, ఆత్మ‌విశ్వాసానికి ప్ర‌తీక‌లా క‌నిపిస్తోందిప్పుడు. అంద‌రు యువ‌తుల‌కూ వ‌చ్చిన‌ట్లే ఆమెకి కూడా కొలీగ్ నుంచి -ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను- అనే ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది.

ఇదీ నా గ‌తం!
ప్ర‌పోజ్ చేసిన యువ‌కుడికి త‌న జీవితంలో జ‌రిగిన ఓ యాక్సిడెంట్ గురించి చెప్పి – నాతో జీవించ‌డానికి మీరు సిద్ధ‌మైతే మీతో జీవితాన్ని పంచుకోవ‌డం నాకిష్ట‌మే- అని సూటిగా స్ప‌ష్టంగా చెప్పింది. ఆ యువ‌కుడు మ‌రుస‌టి రోజు నుంచి ఆఫీసు ప‌నుల్లో కూడా ఎదురు కాకుండా త‌ప్పించుకుని తిరుగుతున్నాడు. స‌మాజం ఇంత‌కంటే మెరుగ్గా లేద‌ని నాకు తెలుస‌న్న‌ట్లు తేలిగ్గా తీసుకుందా యువ‌తి. అయినా ఇదేమైనా -పెళ్లి చేసుకుందాం- సినిమానా, అత‌డేమైనా అందులో హీరో వెంక‌టేశా! అనుకుని అంత‌టితో ఆ సంగ‌తి మ‌రిచిపోయింది. అభ్యుద‌య భావాలున్న యువ‌కుడి కోసం ఎదురు చూడ‌డం కంటే నా జీవితాన్ని నేను జీవించ‌డ‌మే వైజ్ డెసిష‌న్ అనుకుంది. ఆ యువ‌తి గ‌తం అదే ఆఫీసులో మ‌గ‌వాళ్ల‌కు చ‌ర్చ‌నీయాంశం అయింది. కొన్నాళ్ల‌కు – మీ జీవితంలో జ‌రిగిన యాక్సిడెంట్‌తో నాకు ప‌నిలేదు. మీతో జీవిత‌మే నాక్కావ‌ల‌సింది- అంటూ ఓ యువ‌కుడు ఆమె స‌మాధానం కోసం ఎదురుగా ఉన్నాడు.

మ‌ళ్లీ ఫోన్‌…
అదే హెల్ప్‌లైన్‌కి అదే యువ‌తి నుంచి మ‌ళ్లీ ఓ ఫోన్‌కాల్‌. – మీరిచ్చిన ధైర్యంతో జీవితాన్ని కొన‌సాగించాను. ఉద్యోగం చేస్తున్నాను, అర్థం చేసుకునే యువ‌కుడితో జీవితాన్ని పంచుకున్నాను. మీరు చెప్పిన‌ట్లే… నేను అత‌డి నుంచి ఏమీ దాచ‌లేదు కాబ‌ట్టి అప‌రాధ‌భావంతో జీవించాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మీకు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియ‌డం లేదు- ఇదీ ఈ ఫోన్ కాల్ సారాంశం. -ఇలాంటి సంఘ‌ట‌న‌లు అనేకం మా దృష్టికి వ‌స్తూనే ఉన్నాయి. కొంద‌రు యువ‌తులు స్వ‌యంగా మాట్లాడ‌తారు. కొంద‌రి విష‌యంలో బంధువులు, స్నేహితులు ఆ బాధ్య‌త తీసుకుంటుంటారు- అంటున్నారు బిఫ్రెండ‌ర్ జ్యోతి. ఆమె వృత్తిరీత్యా లెక్చ‌ర‌ర్‌. ప్ర‌వృత్తిరీత్యా స‌మాజంలో నిరాద‌ర‌ణ‌కు గుర‌వుతూ జీవితాన్ని శూన్యంగా భావించిన వారిలో జీవితేచ్ఛ రేకెత్తిస్తుంటారు ఈ బిఫ్రెండ‌ర్స్‌.

ప్ర‌మాదంలో భౌతికంగా గాయ‌ప‌డితే!
ఫోన్‌కాల్‌తో ప‌రిచ‌య‌మైన యువ‌తికి జ‌రిగిన యాక్సిడెంట్ రేప్‌. ప్ర‌మాద‌వ‌శాత్తూ వాహ‌నం కింద ప‌డి గాయాల‌పాలైన అమ్మాయి మీద బోలెడంత సానుభూతిని కురిపిస్తుంది స‌మాజం. అంతులేని ప్రేమ‌ను కురిపిస్తుంది కుటుంబం. ఆమె తిరిగి మామూల‌య్యే వ‌ర‌కు అనుక్ష‌ణం కంటికి రెప్ప‌లా చూసుకుంటుంది. మ‌రి ఒక అమ్మాయి త‌న ప్ర‌మేయం లేకుండా శారీర‌క బ‌ల‌వంతుడి బారిన ప‌డి, బ‌లాత్కారానికి గురైతే స‌మాజం అర్థంప‌ర్థం లేని ఆరాలు తీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఇక త‌ల్లిదండ్రులైతే బ‌య‌ట త‌ల ఎలా ఎత్తుకోవాలోన‌ని కుమిలిపోతుంటారు. నిజానికి త‌ల ఎత్తుకోలేని త‌ప్పు ఆ అమ్మాయి ఏం చేసింద‌ని అలా కుంగిపోవ‌డం? ఆమె ఎవ‌రి ప్రాణాల‌నూ తీయ‌లేదు, అవినీతికి పాల్ప‌డి లంచాలు తీసుకోలేదు. విచ‌క్ష‌ణ‌ర‌హితంగా ప‌శువులా ప్ర‌వ‌ర్తించిన కుర్రాడిని వ‌దిలేసి లైంగిక దాడికి గురైన అమ్మాయిని చూసి చెవులు కొరుక్కోవ‌డ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

క‌త్తిరించాల్సింది గోరునే…
విక్రుతంగా పెరిగిన గోరును క‌త్తిరించాలి త‌ప్ప వేలిని గాయ‌ప‌రుచుకోం. రేప్‌లాంటి వికృతాన్ని కూడా ఆ రోజే జీవితం నుంచి న‌రికిపారేయాలి. అంతే త‌ప్ప జీవితాన్ని న‌రుక్కోరాదు. బాధ‌, కోపం, క‌సి వంటి బావ‌న‌ల‌ను మ‌న‌సులో నుంచి బ‌య‌ట‌కు క‌క్కేయాలి. ఆ త‌ర్వాత వ‌చ్చేదే అస‌లైన ఆలోచ‌న‌. ఆలా క‌క్కించే ప్ర‌య‌త్నం చేసే ఓ ఆలంబ‌న ఉంటే రేప్‌కి గురైన ఏ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకోదు. నిజానికి స‌మాజం అలా ఉందా? అంటే మ‌న ముందు అనేక ప్ర‌శ్నార్థ‌కాలే మిగులుతాయి. -అప‌విత్రం , పూజ‌కు ప‌నికిరాని పువ్వు…- సంకుచిత భావ‌జాలాన్ని వ‌దిలించుకున్న‌ప్పుడే ఈ ప్ర‌శ్నార్థ‌కాలు చెరిగిపోతాయి. రేప్‌కి గురైన అమ్మాయి కోణం నుంచి ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌లేని స‌మాజంలో… అది చూసే వికృత‌మైన చూపుకి అంత ప్రాధాన్యం ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా?

ఓ మూడేళ్ల పాపాయిని త‌న‌కు ఇష్టం లేకుండా ద‌గ్గ‌ర‌కు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే… కోపంగా చూసి చెంప‌ను చేత్తో తుడిచేసి త‌న తిర‌స్కారాన్ని తెలియ‌చేస్తుంది. ఆ మ‌రుక్ష‌ణంలో అస‌లేమీ జ‌ర‌గ‌న‌ట్లు ఆట‌ల్లో మునిగిపోతుంది. ఊహ తెలిసిన అమ్మాయిల‌కు ఆ మాత్రం ధైర్యం లేక‌పోతోందా?… ధైర్యం ఎందుకు లేక‌పోతోందంటే… మ‌న స‌మాజంలో అమ్మాయిలు, అబ్బాయిలు పుట్ట‌రు, త‌యార‌వుతారు. అందుకే అమ్మాయిల‌కు ధైర్యం కొర‌వ‌డుతోంది. నిజ‌మే! పిల్ల‌లుగా పుట్టిన వాళ్ల‌ను “అమ్మాయి ఇలా ముడుచుకుపోతూ ఉండాలి, అబ్బాయి ఇలా రొమ్ము విరుచుకుని తిర‌గాలి” అని పెంచ‌డం వ‌ల్ల ఇలాంటి పెడ‌ధోర‌ణి ప్ర‌బ‌లుతోంది.

అమ్మాయిని భ‌ద్రంగా… అబ్బాయిని బాధ్య‌త‌గా…
అమ్మాయిని భ‌ద్రంగా పెంచడంలో చూపించిన జాగ్ర‌త్త అబ్బాయిని బాధ్య‌త‌గా పెంచ‌డంలోనూ చూపించాలి. అబ్బాయిని బాధ్యత‌గా పెంచ‌క‌పోతే ఆ స‌మాజానికి క్యాన్స‌ర్ సోకుతుంది. ఒక‌ప్ప‌టి సినిమాలు రేప్‌కు గురైన అమ్మాయిని చంపేసి, బోలెడంత సానుభూతి కురిపించి ఆ త‌ల్లిదండ్రుల‌కు ఎన‌లేని గౌర‌వాన్నిచ్చేవి. ఇదే క‌రెక్ట్ అని న‌ర‌న‌రాన జీర్ణించుకున్న స‌మాజం… ఆ వ‌ల‌యాన్ని దాటి ఆలోచించ‌డానికే భ‌య‌ప‌డేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితిలో ఓ మోస్త‌రు మార్పు క‌నిపిస్తోంది. మార‌డానికి క‌నీసంగా ఓ ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. రేప్‌కు గురైన అమ్మాయిని ఆ ముందు రోజు చూసినంత మామూలుగా, మాట్లాడినంత క్యాజువ‌ల్‌గానే ఆ త‌ర్వాత కూడా మాట్లాడ‌గ‌లిగిన ప‌రిణితిని ప్ర‌తి ఒక్క‌రూ అల‌వ‌రుచుకుంటే అది అసాధ్య‌మేమీ కాదు.

——–

మ‌గ‌వాళ్ల‌కో ప్ర‌శ్న‌!
మూడేళ్ల పాపాయిని ఆమె ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకుంటే కోపంగా చూస్తుంది. త‌న తిర‌స్కారాన్ని వ్య‌క్తం చేస్తుంది. అలాంటిది మ‌గాడు పురుషాహంకారంతో త‌న శ‌రీరంతో పైశాచికంగా దౌర్జ‌న్యానికి పాల్ప‌డితే ఆ బ‌లాత్కారాన్ని మ‌హిళ ఎలా అంగీక‌రించ‌గ‌లుగుతుంది?

– మంజీర‌

రోషిని హెల్ప్ లైన్,
సింధ్ కాలనీ, హైదరాబాద్,
ఫోన్: 040-66202003

First Published:  18 Feb 2016 2:18 AM GMT
Next Story