Telugu Global
Health & Life Style

తొలి ప్రేమ‌ని ఎందుకు మ‌ర్చిపోలేము?

టీనేజిలో అయినా ఆ త‌రువాత అయినా ….అనుభూతి చెందిన మొద‌టి ప్రేమ‌ని చాలామంది జీవితాంతం మ‌ర్చిపోలేరు. సాధార‌ణ జీవితంలో మామూలుగా బ‌తికేస్తున్నా తొలిప్రేమ గుర్తుకు వ‌స్తే ఆ జ్ఞాప‌కాల‌ను అందులోని బాధ‌ను, ఆనందాన్ని అప్పుడే తాజాగా పొందిన‌ట్టుగా అనుభ‌విస్తుంటారు. ఇలా ఎందుకు జ‌రుగుతుంది. ఈ విష‌యం మీద శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అవి- స‌న్నిహిత సంబంధాల మీద ప్ర‌త్యేక అధ్య‌య‌నం చేసిన న్యూయార్క్ స్టేట్ యూనివ‌ర్శిటీ సైకాల‌జీ ప్రొఫెస‌ర్ ఆర్ట్ అరాన్,  […]

తొలి ప్రేమ‌ని ఎందుకు మ‌ర్చిపోలేము?
X

టీనేజిలో అయినా ఆ త‌రువాత అయినా ….అనుభూతి చెందిన మొద‌టి ప్రేమ‌ని చాలామంది జీవితాంతం మ‌ర్చిపోలేరు. సాధార‌ణ జీవితంలో మామూలుగా బ‌తికేస్తున్నా తొలిప్రేమ గుర్తుకు వ‌స్తే ఆ జ్ఞాప‌కాల‌ను అందులోని బాధ‌ను, ఆనందాన్ని అప్పుడే తాజాగా పొందిన‌ట్టుగా అనుభ‌విస్తుంటారు. ఇలా ఎందుకు జ‌రుగుతుంది. ఈ విష‌యం మీద శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అవి-

స‌న్నిహిత సంబంధాల మీద ప్ర‌త్యేక అధ్య‌య‌నం చేసిన న్యూయార్క్ స్టేట్ యూనివ‌ర్శిటీ సైకాల‌జీ ప్రొఫెస‌ర్ ఆర్ట్ అరాన్, తొలిప్రేమ జ్ఞాప‌కాలు అంత‌గా గుర్తుండిపోవ‌డానికి కార‌ణం ఆ స‌మయంలో ఆయా వ్య‌క్తులు అనుభ‌వించిన ఉద్వేగం, ఉత్తేజం, భ‌యం లాంటివి మ‌న‌సులో గాఢంగా నాటుకుపోవ‌డ‌మేన‌ని అంటున్నారు. తొలిసారి ప్రేమ‌లో ప‌డిన‌ప్పుడు ఆ ప్రేమ స‌క్సెస్ అవుతుందా, కాదా అనే భ‌యం విప‌రీతంగా ఉంటుంది. అలాగే విప‌రీత‌మైన భావోద్వేగాల‌కు గుర‌వుతుంటారు. అవ‌త‌లివారి అంచ‌నాల‌కు త‌గిన‌ట్టు ఉండాలనే ఆందోళ‌న ఉంటుంది. ఇవ‌న్నీ మెద‌డుపై చెర‌గ‌ని ముద్ర‌గా మార‌తాయి

మొద‌టి ప్రేమ‌లో చేదు అనుభ‌వం ఎదురైనా చాలామంది త‌రువాత కోలుకుంటారు. ఏది మంచి అనుబంధ‌మో తెలుసుకోగ‌ల మెచ్యురిటీని సాధిస్తారు. జీవితంలో త‌మ ప్రస్తుత జీవిత‌భాగ‌స్వామితో ప్రేమ‌పూరిత‌మైన జీవితం గ‌డుపుతుంటారు. అయినా, అలాంటివారైనా, అనుకోకుండా ఫేస్‌బుక్‌లో త‌మ తొలిప్రేమ‌కు సంబంధించిన వ్య‌క్తి తార‌స‌ప‌డితే వారి ప్రొఫైల్ పిక్ కోసం క్లిక్ చేయ‌కుండా ఉండ‌లేరు. తొలిప్రేమ అనేది సాధార‌ణంగా హార్మోన్లు ఉచ్ఛ‌ద‌శ‌లో ఉన్న‌పుడు ఏర్ప‌డుతుంది. అప్పుడు జీవితంలో సంభ‌వించిన మంచయినా చెడ‌యినా చాలా ప్ర‌భావితం చేస్తుంది. ఆ ప్ర‌భావం నుండి త‌ప్పించుకోవ‌డం క‌ష్టం. నిజానికి మాన‌సికంగా, మేధోప‌రంగా ప‌రిప‌క్వ‌త ఉన్న వ్య‌క్తికైనా స‌రే, ప్రేమ‌లో ఉన్న‌పుడు నాడీవ్య‌వ‌స్థ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది మెద‌డుమీద కొకైన్ అంత ప్ర‌భావాన్ని చూపుతుంది.

క‌నెక్టిక‌ట్ సైకాల‌జిస్ట్ జ‌ఫ‌ర్‌స‌న్‌ సింగ‌ర్ ఏమంటున్నారంటే చాలామందికి 15-26 ఏళ్ల వ‌య‌సులో జీవితంలో మంచి అనుభ‌వాలు ఉంటాయి. చాలా విష‌యాల్లో తొలిముద్ర‌లు, తొలిఅడుగులు అప్పుడే ప‌డ‌తాయి. వాటిని మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసుకుంటారు. అందుకే వాటి తాజాద‌నం పోదు. అందులో భాగంగానే తొలిప్రేమ అనుభూతుల‌ను సైతం మెద‌డు రిపీట్ చేయ‌డం వ‌ల‌న మ‌రింత గాఢంగా నాటుకుపోతాయి. అంతేకాదు, తొలిప్రేమ వైఫ‌ల్యం చెందినా త‌రువాత కాలంలో వ‌చ్చే అనుభ‌వాలు, అనుభూతుల‌కు అదొక కొల‌మానంగా నిలిచిపోతుంది.

మొదటిసారి ఏర్ప‌డ‌టం త‌ప్ప మొద‌టి ప్రేమ‌లో ఏ ప్ర‌త్యేక‌తా లేద‌ని మ‌రొక‌ మాన‌సిక శాస్త్ర‌వేత్త అంటారు. అయితే తొలిప్రేమ విఫ‌ల‌మై విడిపోయిన‌వారు చాలామంది ఫేస్‌బుక్ ద్వారా క‌లుసుకుని తిరిగి ప్రేమ‌ని కొన‌సాగించార‌ని నాన్సీకాలిష్ అనే ఆ శాస్త్ర‌వేత్త వెల్ల‌డించారు.

ఒక‌సారి విడిపోయి తిరిగి క‌లిసిన‌వారు మూడింటా రెండువంతుల మంది వివాహం చేసుకున్నార‌ని నాన్సీ నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో తేలింది.

మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే తొలిప్రేమలో ఉన్న ఆక‌ర్ష‌ణ అవ‌త‌లి వ్య‌క్తి కాద‌ని, ఆ స‌మ‌యంలో త‌మ‌లో ఉన్న అందం, భావుక‌త‌, ప్రేమ‌, ఉద్విగ్న‌త ఇలాంటివాటిని ప‌రిచ‌యం చేసేది తొలిప్రేమే కాబట్టే అది అంత అందంగా ఉంటుంద‌నేది మ‌రొక మాన‌సిక శాస్త్ర‌వేత్త విశ్లేష‌ణ‌. అంటే దాన్ని త‌మ‌పై త‌మ‌కు ఏర్ప‌డిన ప్రేమ‌గా, ఇష్టంగా భావించాలి.

ఏది ఏమైనా తొలిప్రేమ‌, అనేది ఇత‌రుల‌పై క‌లిగే ప్రేమ మాత్ర‌మే కాద‌న్న‌ది నిజం. అంత‌కంటే ఎక్కువ‌గా అది మ‌న‌పై మ‌న‌కు ప్రేమ‌ను పుట్టిస్తుంది. ఒక వ్య‌క్తి మ‌న‌పై ఇష్టాన్ని, శ్ర‌ద్ధ‌నీ, ప్రేమ‌నీ చూపుతున్నార‌నే భావ‌న మ‌న‌పై మ‌న‌కున్న ఇష్టాన్ని, గ‌ర్వాన్ని, ఆనందాన్ని పెంచుతుంది అనేమాట నిజం. అంటే తొలిప్రేమ‌లో ఉన్న‌ది ఎక్కువ‌గా స్వీయ‌ప్రేమ అనే చెప్పాలి…అందుకే అది అంత మ‌ధురంగా ఉంటుంది.

Next Story