Telugu Global
Health & Life Style

కిచెన్‌ని స‌ర్దుకోండి... స్లిమ్‌గా ఉండండి..!

ఈ రెండింటికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? పొయ్యిమీద మాడిపోయిన కూర గిన్నె, సింక్‌నిండా అంట్లు, నిండిపోయిన చెత్త‌బుట్ట‌, కాళ్ల‌కు త‌గులుతున్న ఉల్లిపాయ‌ల తొక్క‌లు…మీ కిచెన్ ఇలా గంద‌ర‌గోళంగా, ఎలా స‌ర్దాలో తెలియ‌నంత గ‌జిబిజిగా ఉందంటే మీరు తినాల్సిన దానిక‌న్నా ఎక్కువ ఫుడ్ తినేస్తారని హెచ్చరిస్తున్నారు ప‌రిశోధ‌కులు. సాధార‌ణంగా డిప్రెష‌న్ ఉన్న‌వారు ఎక్కువ‌గా తింటార‌ని ఇప్ప‌టికే రుజువైన నిజం. దీనికీ ఈ చింద‌ర‌వంద‌ర కిచెన్‌కి సంబంధం ఉన్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది.  ప‌రిస్థితులు మ‌న‌చేతుల్లో లేవు అనుకున్న‌పుడు మ‌న‌లో శ్ర‌ద్ధ, ఆస‌క్తి, […]

కిచెన్‌ని స‌ర్దుకోండి... స్లిమ్‌గా ఉండండి..!
X

ఈ రెండింటికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? పొయ్యిమీద మాడిపోయిన కూర గిన్నె, సింక్‌నిండా అంట్లు, నిండిపోయిన చెత్త‌బుట్ట‌, కాళ్ల‌కు త‌గులుతున్న ఉల్లిపాయ‌ల తొక్క‌లు…మీ కిచెన్ ఇలా గంద‌ర‌గోళంగా, ఎలా స‌ర్దాలో తెలియ‌నంత గ‌జిబిజిగా ఉందంటే మీరు తినాల్సిన దానిక‌న్నా ఎక్కువ ఫుడ్ తినేస్తారని హెచ్చరిస్తున్నారు ప‌రిశోధ‌కులు. సాధార‌ణంగా డిప్రెష‌న్ ఉన్న‌వారు ఎక్కువ‌గా తింటార‌ని ఇప్ప‌టికే రుజువైన నిజం. దీనికీ ఈ చింద‌ర‌వంద‌ర కిచెన్‌కి సంబంధం ఉన్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది.

ప‌రిస్థితులు మ‌న‌చేతుల్లో లేవు అనుకున్న‌పుడు మ‌న‌లో శ్ర‌ద్ధ, ఆస‌క్తి, జాగ్ర‌త్త లాంటి అప్ర‌మ‌త్తంగా ఉండే గుణాలు లోపిస్తాయి. అదే డిప్రెష‌న్‌. అలాగే ఇల్లు స‌రిగ్గా లేన‌ప్పుడు వీటినే చ‌క్క‌బెట్టుకోలేకపోతున్నాం…ఇంకేం చేయ‌గ‌లం అనే నిర్ల‌క్ష్యం ఒకటి ఆవ‌హిస్తుంద‌ని అప్పుడు తినాల్సిన దానిక‌న్నా ఎక్కువ ఆహారం తీసుకుంటామ‌ని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు అంటున్నారు. 101 మంది ఆడ‌వారి మీద వీరు అధ్య‌య‌నం చేశారు. మ‌హిళ‌ల‌ను రెండు భాగాలుగా విడ‌గొట్టి చింద‌ర‌వంద‌ర‌గా ఉన్న కిచెన్‌లో కొంద‌రినీ, చ‌క్క‌గా స‌ర్ది ఉన్న కిచెన్‌లో కొంద‌రినీ ఉంచారు.

చింద‌ర‌వంద‌ర‌గా ఉన్న కిచెన్‌లో ఉన్న మ‌హిళ‌లు… అదే మూడ్‌తో ఉన్న‌పుడు అక్క‌డే వారికి ఆహారం పెట్టారు. అలాగే నీట్‌గా స‌ర్ది ఉన్న కిచెన్‌లో ఉన్న మ‌హిళ‌ల‌ను అనంత‌రం స‌ర్దిలేని కిచెన్‌కి తీసుకువెళ్లి ఆహారం ఇచ్చారు. ఈ అధ్య‌య‌నంలో స‌ర్దిలేని కిచెన్‌లో ఉన్న‌వారు, ప‌రిస్థితులు త‌మ చేతుల్లో లేవ‌నే నిస్పృహ లాంటి ఫీలింగ్‌తో ఎక్కువ‌గా తిన్న‌ట్టుగా, నీట్‌గా స‌ర్దిఉన్న కిచెన్‌లో ఉన్న‌వారు మాన‌సికంగా స్థిరంగా ప్ర‌శాంతంగా ఉన్నార‌ని, అనంత‌రం వారిని స‌ర్దిలేని కిచెన్‌కి తీసుకువెళ్లినా వారు, ముందు వారికంటే త‌క్కువ‌గా తిన్న‌ట్టుగా అధ్య‌య‌నంలో తేలింది.

మ‌న‌సుని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి ధ్యానం లాంటివే కాదు, ఇలాంటి చిన్న‌పాటి విష‌యాల్లో జాగ్ర‌త్త‌లూ అవ‌స‌ర‌మే అని అధ్య‌యన నిర్వ‌హ‌కుల్లో ఒక‌రు వెల్ల‌డించారు.

First Published:  4 Feb 2016 4:47 AM GMT
Next Story