Telugu Global
Others

కుడి ఎడమైతే అంతే...సార్‌!

చట్టసభల్లో కుడి ఎడమైతే నేతల ఆలోచనలు మారిపోతాయి. ప్రతిపక్షం వైపు నుంచి చూసినప్పుడు తప్పంతా ప్రభుత్వానిదే అనిపిస్తుంది. అదే అధికారాన్ని తాకగానే ప్రతిపక్షమే పనికిమాలినది అనిపిస్తుంది. ఏమైనా చట్టసభల తీరు మాత్రం దారుణంగానే ఉంది. తాజాగా ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా చట్టసభలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతల నిర్వహణలో చట్టసభలు విఫలమయ్యాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన స్పీకర్ల సమావేశంలో కోడెల ఈ వ్యాఖ్యలు చేశారు. సభల్లో హుందాతనం కరువైందన్నారు. […]

కుడి ఎడమైతే అంతే...సార్‌!
X

చట్టసభల్లో కుడి ఎడమైతే నేతల ఆలోచనలు మారిపోతాయి. ప్రతిపక్షం వైపు నుంచి చూసినప్పుడు తప్పంతా ప్రభుత్వానిదే అనిపిస్తుంది. అదే అధికారాన్ని తాకగానే ప్రతిపక్షమే పనికిమాలినది అనిపిస్తుంది. ఏమైనా చట్టసభల తీరు మాత్రం దారుణంగానే ఉంది. తాజాగా ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా చట్టసభలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతల నిర్వహణలో చట్టసభలు విఫలమయ్యాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన స్పీకర్ల సమావేశంలో కోడెల ఈ వ్యాఖ్యలు చేశారు. సభల్లో హుందాతనం కరువైందన్నారు. అదే వేదిక నుంచి కోడెల ఒక ప్రతిపాదన కూడా చేశారు.

ఎవరైనా స్పీకర్ పోడియం వద్దకు వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్ వేటు పడేలా చేయాలన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆలోచన మంచిదే అయినా ప్రతిపక్షం వైపు నుంచి చూసినప్పుడు మాత్రం అప్రజాస్వామికంగానే కనిపిస్తుంది. ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు సభలో మైక్ ఇవ్వనప్పుడు, సరైనా తీరులో తమ భావాన్ని వ్యక్తపరిచే అవకాశం రానప్పుడు ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం, న్యాయం కావాలంటూ చైర్ దగ్గరకు వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. కాబట్టి ప్రతిపక్షాలకు సభలో అన్ని అవకాశాలు కల్పించి… అప్పటికీ వారి ధోరణి మారకుంటే వేటు వేయడం సబబుగా ఉంటుంది. అంతే కానీ పోడియం దగ్గరకు వస్తే వేటు వేసేస్తామంటే ప్రతిపక్షానికి, స్పీకర్‌కు మధ్య విద్యుత్ తీగలు కట్టి వేరు చేయడమే అవుతుంది. మరో విషయం ఏమిటంటే మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సభ్యులు కూడా లెక్కలేనన్ని సార్లు పోడియాన్ని చుట్టుముట్టారు. బెంచీలు ఎక్కి రచ్చ చేశారు. రేవంత్ రెడ్డి ఏకంగా గవర్నర్‌ కుర్చినే లాగిపడేశారు. అప్పుడు మాత్రం టీడీపీ నేతలు చట్టసభల గౌరవంపై మాట్లాడలేదు. ఏదీఏమైనా ఇప్పటికైనా కోడెల శివప్రసాదరావు చెప్పినట్టు సభల్లో హుందాతనం పెరగాల్సిన అవసరం ఉంది.

First Published:  22 Jan 2016 11:26 PM GMT
Next Story