Telugu Global
POLITICAL ROUNDUP

ఆ బిడ్డని తల్లిదండ్రులు వదిలించుకున్నారు...ఓ యువకుడు తండ్రయ్యాడు!

ఈ ప్రపంచంలో ఎప్పటికప్పడు మనకు వింతగా, కొత్తగా అనిపించే విషయాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ సంఘటన. ఓ క్రూరత్వం, ఓ మానవత్వం రెండింటి సమాహారం ఇది. డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన కన్నకొడుకుని అనాథ శరణాలయానికి అప్పగించి అత‌డిని  వదిలించుకున్నారు తల్లిదండ్రులు. అదే పిల్లాడి కోసం పెళ్లికాని ఓ యువకుడు ప్రభుత్వంతో పోరాటం చేసి మరీ ఆ చిన్నారిని దత్తతకు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే- 2014, మార్చి 16న భోపాల్లోని ఒక కలిగిన కుటుంబంలో […]

ఆ బిడ్డని తల్లిదండ్రులు వదిలించుకున్నారు...ఓ యువకుడు తండ్రయ్యాడు!
X

ఈ ప్రపంచంలో ఎప్పటికప్పడు మనకు వింతగా, కొత్తగా అనిపించే విషయాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ సంఘటన. ఓ క్రూరత్వం, ఓ మానవత్వం రెండింటి సమాహారం ఇది. డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన కన్నకొడుకుని అనాథ శరణాలయానికి అప్పగించి అత‌డిని వదిలించుకున్నారు తల్లిదండ్రులు. అదే పిల్లాడి కోసం పెళ్లికాని ఓ యువకుడు ప్రభుత్వంతో పోరాటం చేసి మరీ ఆ చిన్నారిని దత్తతకు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే-

adi52014, మార్చి 16న భోపాల్లోని ఒక కలిగిన కుటుంబంలో బిన్నీ పుట్టాడు. ఆ బిడ్డ వారికి మూడో సంతానం. అతను పుట్టుకతోనే డౌన్స్ సిండ్రోమ్ అనే మానసిక సమస్యతోనూ, గుండెలో చిల్లు, కంటిచూపులో లోపం అనారోగ్యాలతోనూ జన్మించాడు. డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన పిల్లల్లో తెలివితేటల లోపం, ముఖ కవళికల్లో తేడాలు, బలహీనమైన కండరాలు తదితర సమస్యలు ఉంటాయి. వీరిలో వయసు పెరుగుతున్నా మెదడు పెరగదు. వయసు పెరుగుతున్నా వీరి ఐక్యూ ఏడెనిమిదేళ్ల పిల్లల్లో ఉన్నంత అంటే 50 మాత్రమే ఉంటుంది. డౌన్స్ సిండ్రోమ్‌ని పూర్తిగా నయం చేయడం కుదరదు, కానీ ఈ పిల్లల్ని శ్రద్ధగా పెంచితే వారు తమ పనులు తాము చేసుకుంటూ ఆనందంగా బతికేలా తీర్చిదిద్దవచ్చు. కానీ బిన్నీ తల్లిదండ్రులు మాత్రం అందుకు వ్యతిరేకంగా చేశారు. అతడిని అనాథ శరణాలయంలో చేర్చారు. అలాంటి బాబుకోసం ఆదిత్య తివారీ అనే యువకుడు చట్టాలతో పోరాటం చేశాడు. చివ‌రికి విజ‌యం సాధించాడు.

ఆదిత్య ఇండోర్లో నివసిస్తున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తల్లిదండ్రుల్లో సామాజిక సేవా దృక్పథం ఎక్కువ. దాన్ని చూస్తూ పెరిగిన ఆదిత్య పెద్దయ్యాక తాను ఒక అనాథని చేరదీయాలని అనుకున్నాడు. సుస్మితా సేన్ సింగిల్ మద‌ర్‌గా పిల్లలను దత్తత చేసుకున్నపుడు తాను ఎంతగానో స్ఫూర్తి పొందాడు. అయితే ఆమె సెలబ్రిటీ కనుక అది సాధ్యమైందని, సాధారణ వ్యక్తులకు అందులో చిక్కులు ఉంటాయని అతడిని చాలామంది నిరుత్సాహ పరచారు.

binnyCakeఇదిలా ఉండ‌గా 2014 సెప్టెంబరు 13న అతని జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన జరిగింది. తండ్రి పుట్టిన రోజు సందర్భంగా అనాథపిల్లలకు కానుకలు ఇవ్వాలని జ్యోతి నివాస్ అనే అనాథ శరణాలయానికి తల్లిదండ్రులతో పాటు వెళ్లాడు ఆదిత్య. అక్కడున్న పిల్లలంతా అతనికి ఎంతగానో నచ్చారు. కానీ బిన్నీ ని చూసినపుడు ఎందుకో ప్రత్యేక ఆపేక్ష కలిగింది. ఆ చిన్నారి తనతో ఏదో చెప్పాలని చూస్తున్నట్టుగా ఆదిత్యకు అనిపించింది. బిన్నీ గురించి అక్క‌డున్న వారిని అడిగాడు. బిన్నీ భోపాల్‌కి చెందిన‌ బాబ‌ని, అక్క‌డి నుండి ఇండోర్‌కి చికిత్సకోసం తీసుకువచ్చామని, అతను స్పెషల్ చైల్డ్ అని శరణాలయం నిర్వాహకులు చెప్పారు. అందరూ లోపాలు లేని పిల్లలనే దత్తత చేసుకునేందుకు ఇష్టపడతారు కనుక బిన్నీ అక్కడే ఉండిపోయినట్టుగా వారు వివరించారు.

ఆ స‌మ‌యంలోనే ఆదిత్య బిన్నినీ దత్తత తీసుకోవాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు చట్టపరమైన ఆటంకాలు ఉంటాయని తెలుసుకున్నాడు. అతను అవివాహితుడై ఉండటం మొదటిదైతే, మన చట్టాల ప్రకారం దత్తు తీసుకునే వ్యక్తికి 30 సంవత్సరాలు పైగా వయసు ఉండాల్సి ఉండగా అతని వయసు అప్పటికి 27 మాత్రమే ఉండటం రెండవ ఆటంకం. కొంతకాలం వేచి ఉండాల‌ని అత‌నికి అర్ధ‌మైంది. కానీ బిన్నీని వ‌దిలి ఉండ‌టం సాధ్యం కాద‌నిపించింది. అయితే అప్పటికి బిన్ని ఖర్చులను తానే భరిస్తారని ఆదిత్య వారి నుండి అనుమతి తీసుకున్నాడు.

ఆదిత్య పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండటంతో ఇంటికి ఇండోర్ వచ్చినప్పుడల్లా బిన్ని వద్దకు వెళుతుండేవాడు. కొన్నాళ్లకు బిన్నీని తిరిగి భోపాల్‌కి తరలించబోతున్నట్టుగా అనాథ శరణాలయం నిర్వాహకులు చెప్పారు. అప్పటికే ఆదిత్యకు బిన్నీ బాగా చేరువయ్యాడు. ఆదిత్య కూడా తన జీవితం ఆ చిన్నారే అన్నట్టుగా తయారయ్యాడు. 30 ఏళ్లు రాగానే వెంటనే పెళ్లి చేసుకుని వాడిని దత్తు చేసుకోవాలనే నిర్ణ‌యంతో ఆ స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నాడు.

దాంతో బిన్నీ తిరిగి భోపాల్ వెళ్లిపోతున్నాడని తెలిసి విలవిల్లాడాడు. అయినా వదల్లేదు. నెలలో రెండు ఆదివారాలు భోపాల్ వెళ్లి బిన్నీతో గడుపుతుండేవాడు. అత‌నికి సంబంధించిన ఖ‌ర్చుల‌న్నీ త‌నే పెడుతుండేవాడు. అయితే గత ఏడాది మార్చి 28న ఆదిత్యకు అత‌ను భ‌రించ‌లేని ఒక విష‌యం చెప్పారు శరణాలయం అధికారులు. బిన్నీని ఎవరో దత్తుతీసుకుంటున్నారని, అందుకని అతడిని ఢిల్లీకి పంపించేశామ‌ని చెప్పారు. ఆదిత్యలో కోపం పెల్లుబికింది. చట్టపరంగా దత్తు చేసుకోకపోయినా తనకు బిన్నీతో ఉన్న అనుబంధం శరణాలయం నిర్వాహకులకు తెలుసు. అందుకే నాకు చెప్పకుండా మీరు అలా ఎలా చేస్తారని ఆవేశంగా అడిగాడు. అందుకు వారు బిన్నీపై నీకెలాంటి చట్టపరమైన హక్కులు లేవని నిర్లక్ష్యంగా చెప్పారు. ఇందులో ఏదో మోసం ఉందని ఆదిత్యకు అనిపించింది. దాంతో అతను కోల్‌క‌తాలో ఉన్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ హెడ్డాఫీస్‌కి వెళ్లి బిన్నీని ఢిల్లీకి పంపడం గురించి అడిగాడు. తాము ఏ బిడ్డనీ ఢిల్లీ పంపలేదని వారు చెప్పారు.

అసలు విషయం- బిన్నీని అతని తల్లిదండ్రులు చట్టబద్ధంగా అక్కడ చేర్చకపోవడం వలన అతను అక్కడ ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. దాంతో భోపాల్ శరణాలయం నిర్వాహకులు అతడిని అక్రమంగా ఢిల్లీకి తరలించి విదేశీయులకు దత్తు ఇవ్వాలని అనుకున్నారు. ఈ నిజాలు తెలుసుకున్నాక ఆదిత్య బిన్నీని దక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నమే చేశాడు.

మధ్య ప్రదేశ్ ప్రభుత్వంలో సంబంధిత మంత్రిత్వ శాఖకు ఉత్తరాలు రాశాడు. ఫలితం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, మేనకాగాంధీకి, అన్నా హజారేకి, కిరణ్ బేడీకి 500నుండి 600 వరకు ఈ మెయిల్స్ పంపాడు. వందల కొద్దీ ఉత్తరాలు రాశాడు, ఫ్యాక్స్ పంపాడు. చివరికి అతని శ్రమ ఫలించింది. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ స్పందించారు. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారటీ(కారా)కి ఈ విషయంలో నిజానిజాలు తేల్చమని ఆదేశించారు.

adi1-768x1086దాంతో రికార్డుల్లో బిన్నీ పేరు లేద‌ని వెల్ల‌డికావ‌డం, తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని వేయడం, బిన్నీతో పాటు మరో నలుగురు ఆడపిల్లలను అక్రమంగా ఢిల్లీకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా బయటపడటం, బిన్నీ అసలు తల్లిదండ్రులు వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బిన్నీని చ‌ట్ట‌బ‌ద్ధంగా అప్పగించేలా చర్యలు తీసుకోవడం…ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ఈ క్ర‌మంలో ఒక‌సారి ఆదిత్య బిన్నీ తల్లిదండ్రులను వారి ఇంటికి వెళ్లి కలిశాడు. వారు ధనవంతులై ఉండటం ఆదిత్యకు ఆశ్చర్యం కలిగించింది. బిన్నీని ఇంటికి తెచ్చుకోమని ప్రాధేయపడ్దాడు. కానీ వారు తమ దృష్టిలో బిన్నీ చనిపోయినట్టేనని, అలాంటి బిడ్డని తాము భరించలేమని చెప్పారు.

ఆదిత్య తన పోరాటం ఆపలేదు. బిన్నీ అక్ర‌మంగా ఎక్క‌డికీ త‌ర‌లించ‌బ‌డ‌కుండా అత‌డిని చట్టబద్దంగా దత్తు ఇవ్వాల్సిన బిడ్డగా మార్చాడు, అయినా తనకు దత్తు తీసుకునే అర్హత లేదు. వ‌య‌సు, వివాహం అడ్డుప‌డుతున్నాయి. అదృష్టవశాత్తూ అదే సమయంలో జువైనల్ జస్టిస్ యాక్ట్ అంశాల్లో భాగంగా మార్చవలసిన దత్తత చట్టాలపై పార్ల‌మెంటులో చర్చ జరిగింది. ఇది చూసిన ఆదిత్య లోక్‌స‌భ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి కూడా లెటర్ రాశాడు. దత్తు తీసుకునేవారి వయసుని 25 సంవత్సరాలకు త‌గ్గించే అంశం కూడా ఉన్న స‌ద‌రు బిల్లుని పాస్ చేయించాల్సిందిగా స్పీకర్‌ని అభ్యర్థించాడు.

ఎట్టకేల‌కు ఆగ‌స్టు1, 2015 నుండి ఈ చ‌ట్టంలో ఆదిత్య కోరిన‌ స‌వ‌ర‌ణ అమ‌ల్లోకి వ‌చ్చింది. మేన‌కా గాంధీ స్వ‌యంగా బిన్నీ ఉన్న మాతృఛాయ సంస్థకు వెళ్లి బిన్నీని చూసి అత‌డిని ఆదిత్య‌కు ఇవ్వ‌మ‌ని కారాకు ఆదేశాలిచ్చారు. దాంతో ఎన్నో అడ్డంకుల త‌రువాత బిన్నీ ఆదిత్య‌కు చ‌ట్ట‌ప‌రంగా కొడుకయ్యాడు. అయినా బాబుని ఇచ్చేందుకు సంబంధిత ఉద్యోగులు ఆదిత్య‌కు ఎన్నో ఆటంకాలు సృష్టించారు. అత‌డిని ఏ అమ్మాయీ వివాహం చేసుకోద‌ని నిరుత్సాహ ప‌ర‌చారు. పెళ్లి చేసుకుని భార్య‌తో క‌లిసి ర‌మ్మ‌న్నారు. ఆదిత్య మ‌ళ్లీ మేన‌కా గాంధీ, కారా, ఇండోర్ క‌లెక్ట‌ర్ల స‌హాయం తీసుకోవాల్సి వ‌చ్చింది. చివ‌రికి నూత‌న సంవ‌త్స‌రం మొద‌టి రోజున బిన్నీ ఆదిత్య ఒడికి చేరాడు.

దాంతో ఆదిత్య దేశంలోనే ఓ బిడ్డ‌ని ద‌త్తు చేసుకున్న అతిపిన్న వ‌య‌స్కుడైన సింగిల్ పేరెంట్ గా మారాడు. బిన్నీకి ఆదిత్య అవ్‌నిష్ అనే పేరు పెట్టాడు. గ‌ణేశుని పేర్ల‌లో అదీ ఒక‌టి. త‌న‌కిష్ట‌మైన గ‌ణ‌ప‌తి బిన్నీ విష‌యంలో త‌న‌కు అండ‌గా ఉన్నాడ‌ని ఆదిత్య చెబుతున్నాడు. మొద‌ట‌ కొడుకు కోరిక‌ని వ్య‌తిరేకించిన ఆదిత్య త‌ల్లిదండ్రులు సైతం, బిన్నీని మ‌న‌స్ఫూర్తిగా త‌మ మ‌న‌వ‌డిగా అంగీక‌రించారు. ఆదిత్య‌, బిన్నీల‌తో క‌లిసి ఉండేందుకు వారు కూడా పుణె వ‌చ్చేశారు. అలా బిన్నీ, ఆదిత్య‌ల క‌థ సుఖాంత‌మైంది. ఒక బ‌ల‌మైన మంచి సంక‌ల్పానికి విజ‌యం ద‌క్కితీరుతుంద‌ని రుజువైంది.

-వి.దుర్గాంబ‌

First Published:  13 Jan 2016 11:54 PM GMT
Next Story