Telugu Global
Others

గూగుల్లో వెత‌కండి...కానీ డాక్ట‌రుని న‌మ్మండి..!

గూగుల్, మనిషికి ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భత దీపంలా తయారైంది. ఇప్పటికే దీని కారణంగా మన మెదడు సగం పనిచేయడం మానేసింది. మెదడుకి గుర్తు పెట్టుకోవడం అనే పనిని చెప్పడం మనం దాదాపు మానేశాం. తెలియని విషయాలు తెలుసుకోవడం, సమాచారం సేకర‌ణ వ‌ర‌కు అయితే పరవాలేదు, కానీ ఇప్ప‌టిత‌రం అక్క‌డితో ఆగ‌టం లేదు. చాలామంది ఆరోగ్యం బాగా లేన‌పుడు వెంట‌నే డాక్ట‌రువ‌ద్ద‌కు వెళ్ల‌కుండా గ‌బ‌గ‌బా స్మార్ట్ ఫోన్ తీసి త‌మ‌కున్న ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి అది ఏం జ‌బ్బో తెలుసుకునే […]

గూగుల్లో వెత‌కండి...కానీ డాక్ట‌రుని న‌మ్మండి..!
X

గూగుల్, మనిషికి ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భత దీపంలా తయారైంది. ఇప్పటికే దీని కారణంగా మన మెదడు సగం పనిచేయడం మానేసింది. మెదడుకి గుర్తు పెట్టుకోవడం అనే పనిని చెప్పడం మనం దాదాపు మానేశాం. తెలియని విషయాలు తెలుసుకోవడం, సమాచారం సేకర‌ణ వ‌ర‌కు అయితే పరవాలేదు, కానీ ఇప్ప‌టిత‌రం అక్క‌డితో ఆగ‌టం లేదు. చాలామంది ఆరోగ్యం బాగా లేన‌పుడు వెంట‌నే డాక్ట‌రువ‌ద్ద‌కు వెళ్ల‌కుండా గ‌బ‌గ‌బా స్మార్ట్ ఫోన్ తీసి త‌మ‌కున్న ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి అది ఏం జ‌బ్బో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితిపై వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి…ఇలా త‌ర‌చుగా వ‌చ్చే సమస్యల నుండి ఎలాంటి ఇత‌ర‌ అనారోగ్య‌మైనా ముందు గూగుల్లో వెతికేస్తున్నారు. ఇంట‌ర్‌నెట్లో దొరికే స‌మాచార‌మంతా చ‌దువుకుని అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న‌కు గురికావ‌డమో లేదా చిన్న అనారోగ్య‌మే అని అశ్ర‌ద్ధ చేయ‌డ‌మో చేస్తున్నార‌ని వైద్య‌నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్న యువతరం గూగుల్ని డాక్టర్ గూగుల్‌గా మార్చేశారని, భారత్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనబడుతోందని, ఇది చాలా ప్రమాదకరమని ఢిల్లీలో ప్ర‌ముఖ ఆసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్న కొంత‌మంది వైద్యనిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అనారోగ్య లక్షణాలను గురించి మరింత సమాచారం తెలుసుకోవడంలో, ఆరోగ్యంగా జీవించ‌డంపై అవగాహన పెంచుకోవడంలో తప్పులేదు, అయితే గూగుల్ని వినియోగించేటపుడు ఎక్కడ ఆపాలన్న విషయంకూడా సరిగ్గా తెలిసి ఉండాలని వారు అంటున్నారు.

గూగుల్లో ఉన్న సమాచారం సరైనదే అయినా, కొన్ని ఒకేర‌క‌మైన‌ శారీరక అనారోగ్య లక్షణాలు పలు జబ్బుల్లో ఉండవచ్చని, అప్పుడు లక్షణాల ఆధారంగా జబ్బు గురించి తెలుసుకోవాలనుకునేవారు గందరగోళానికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డాక్టరు దగ్గరకు వెళ్లకముందే విప‌రీతంగా గూగుల్ సెర్చ్ చేస్తే ఆ వెతుకులాటలో పెరిగిపోయే ఆందోళన మరింతగా ఆరోగ్యానికి హానిచేస్తుందనేది వైద్యుల హెచ్చరిక.

ఢిల్లీలోని బిఎల్‌కె సూపర్ స్సెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ ఆర్ కె సింఘాల్ తన అనుభవంలోకి వచ్చిన ఇలాంటి ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. 30ల్లో వ‌య‌సున్న‌ ఒక వ్యక్తి సింఘాల్ వద్దకు ట్రీట్‌మెంట్ కోసం వచ్చాడు. అతనికి తలనొప్పి. అయితే అతను తనకు కచ్ఛితంగా బ్రెయిన్ ట్యూమర్ ఉంద‌నే నమ్మకంతో ఉన్నాడు. నొప్పిని బట్టి గూగుల్లో సెర్చ్ చేసి తనకున్నది అదే జబ్బనే నిర్దారణకు అంత‌కు నెల క్రితమే వచ్చాడు. తీరా పరీక్ష చేస్తే గొంతు నొప్పి, జలుబుల కారణంగా తలనొప్పి వచ్చిందని తేలింది. గూగుల్‌ని డాక్ట‌ర్ గూగుల్‌గా మారుస్తున్న‌వారిలో ఎక్కువ‌మంది 25-40 సంవత్సరాల మధ్య వయసున్నవారేనని సింఘాల్ అంటున్నారు.

గూగుల్ డ‌యాగ్న‌సిస్ ద్వారా త‌మ‌కున్న‌ చిన్న‌పాటి స‌మ‌స్య‌ల‌ను పెద్ద‌గా ఊహించ‌డం, లేదా పెద్ద అనారోగ్యాల‌కు గుర‌యిన‌పుడు దాన్ని చిన్న‌పాటిస‌మ‌స్య‌గా భావించి అశ్ర‌ద్ధ చేసే ప్ర‌మాదం ఉంద‌ని సింఘాల్ అన్నారు. మామూలు నిద్ర‌లేమి, ఏకాగ్ర‌తా లోపం ఉంటే దాన్ని మేజ‌ర్ డిప్రెష‌న్‌గా భావించ‌వ‌చ్చని, అలాగే గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌ల కార‌ణంగా ఛాతీ నొప్పి వ‌స్తే దాన్ని మాన‌సిక స‌మ‌స్య‌ల వ‌ల‌న వ‌చ్చిన నొప్పిగా అనుకునే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు.

నోయిడాలో న్యూరో స్పైన్ స‌ర్జ‌న్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాహుల్ గుప్తా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. గూగుల్ సెర్చ్ చేసి పెంచుకున్న అనుమానాలు, ఆందోళనలతో త‌న‌వ‌ద్ద‌కు ఎంతోమంది యువ‌తీయువ‌కులు వ‌స్తున్నార‌ని ఆయన తెలిపారు. గూగుల్ సెర్చ్ చేసి వ‌చ్చిన‌వారు వైద్యుల‌ను న‌మ్మ‌లేర‌ని, వారు తెలుసుకున్న మందుల‌ను వాడాల‌ని ఆశిస్తుంటార‌ని, అలాగే అనేక వ్యర్థ ప్రశ్నలతో తమ సమయాన్ని సైతం వేస్ట్ చేస్తారని ఆయన అంటున్నారు.

ఒక మంచి డాక్టరు కోసమో, మందుల స్పెల్లింగ్స్ కోసమో, సాధారణ ఆరోగ్యానికి స‌బంధించిన అవ‌గాహ‌న గురించో గూగుల్ని వాడటం మంచిదేనని గుప్తా అభిప్రాయపడుతున్నారు. గూగుల్ కంటే ఎక్కువ‌గా డాక్ట‌రుని న‌మ్మండి అని ఆయ‌న యువ‌త‌ని కోరుతున్నారు.

First Published:  8 Jan 2016 11:56 PM GMT
Next Story