Telugu Global
Cinema & Entertainment

పులా? పులివేషమా?

రేటింగ్‌: 2.5/5 విడుదల తేదీ : 10 డిసెంబర్‌ 2015 దర్శకత్వం : సంపత్‌ నంది ప్రొడ్యూసర్‌ : కె.కె. రాథామోహన్‌ బ్యానర్‌:  సత్యసాయి ఆర్ట్స్‌ సంగీతం : బీమ్స్‌ సెక్రిలియో నటీనటులు : రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్‌ ఇరానీ మళ్ళీ అదే పాత కథ. అవే సీన్స్‌, ఫైట్స్‌, డైలాగులు. పాతసీసాలో కొత్తసారా పోయడం కూడా మన సినిమాల వల్ల కావడంలేదు. పాతసీసాలో పాతసారానే. ఇదంతా ఎందుకంటే పాతచారల్ని పెయింట్‌ వేసుకుని బెంగాల్‌ టైగర్‌ మన ముందుకొచ్చింది. ఈ పులి ఏదో […]

పులా? పులివేషమా?
X

రేటింగ్‌: 2.5/5
విడుదల తేదీ : 10 డిసెంబర్‌ 2015
దర్శకత్వం : సంపత్‌ నంది
ప్రొడ్యూసర్‌ : కె.కె. రాథామోహన్‌

బ్యానర్‌: సత్యసాయి ఆర్ట్స్‌
సంగీతం : బీమ్స్‌ సెక్రిలియో
నటీనటులు : రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్‌ ఇరానీ

మళ్ళీ అదే పాత కథ. అవే సీన్స్‌, ఫైట్స్‌, డైలాగులు. పాతసీసాలో కొత్తసారా పోయడం కూడా మన సినిమాల వల్ల కావడంలేదు. పాతసీసాలో పాతసారానే. ఇదంతా ఎందుకంటే పాతచారల్ని పెయింట్‌ వేసుకుని బెంగాల్‌ టైగర్‌ మన ముందుకొచ్చింది. ఈ పులి ఏదో చేస్తుందనుకుంటే అన్ని పులుల్లాగే మళ్ళీ ప్రేక్షకుల్ని కరిచింది.

హీరోలు అనవసరంగా తమ రేంజ్‌ పెంచుకుని పరిధుల్ని గీసుకుని తమకంటూ కథల్నిలేకుండా చేసుకున్నారు. టెంపర్‌ సినిమాలో ఎన్టీయార్‌లా, సన్నాఫ్‌ సత్యమూర్తిలో అల్లు అర్జున్‌లా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారూక్‌ఖాన్‌లా, ఇలా డజను సినిమాలను గుర్తుచేస్తూ టైగర్‌ మన మీదికి దూకుతాడు.

ఒంటిపై కాసిన్ని గాయాలతో, చేతిలో రివాల్వర్‌తో రవితేజ శవాలపై నడిచివస్తుంటే ప్లాష్‌బ్యాగ్‌ ప్రారంభమవుతుంది. హీరోది ఆత్రేయపురమనే పచ్చటి పల్లెటూరు. కానీ ఆ పల్లె అందాలు మనకు చూపించరు. ప్రారంభంలోనే హీరో ఒక పెద్ద ఫైట్‌ చేస్తాడు. ఈ ఉపమానాలు ఎవరు కనిపెట్టారోకానీ వాటిని వినివిని విసుగెత్తిపోయింది. ఇందులో హీరో తనని గురించి తానైనా చెప్పుకుంటాడు. లేదా ఎవరైనా అతన్ని పొగుడుతూ ఉంటాడు.

తాను క్లైమేట్‌ లాంటివాడని, ఒక్కోసారి చల్లగా, వేడిగా, వణికిస్తూ అలా వస్తూవుంటానని చెబుతూ హీరో అందర్ని తంతాడు. తరువాత ఎలాగూ హీరో క్యారెక్టర్ని వర్ణిస్తూ ఒక ఇంట్రడక్షన్‌ సాంగ్‌. తాపీగా పాటపాడి ఇంటికొస్తే ఇద్దరు అన్నలు, వదినలు, తల్లి, అవ్వ, పనివాడు వీళ్ళంతా కలిసి హీరోతో పంచ్‌డైలాగులు. హీరోకి పెళ్ళి చేయాలనుకుని పెళ్ళిచూపులకి తీసుకెళితే తాను సెలబ్రిటీలను తప్ప మామూలువాళ్ళని పెళ్ళిచేసుకోనని అమ్మాయి అంటుంది. దాంతో హీరో సెలెబ్రిటి కావాలనుకుంటాడు. కిక్‌ సీరీస్‌లాగా కిక్‌, కంఫర్ట్‌ తర్వాత సెలెబ్రిటీ దారిలో కథ వెళుతుందేమో మనం అనుమానించేలోగా హీరో రాయితో కొడతాడు (మనల్ని కాదు మంత్రిని) ఆ ధైర్యానికి మంత్రి ముచ్చటపడి హీరోని తన బాడీగార్డుగా ఉంచుకుంటాడు.

Click to Read: బెంగాల్ టైగ‌ర్ శాటిలైట్ రైట్స్ అద‌ర‌హో..!

అదే సమయంలో హోం మినిస్టర్‌ (రావు రమేష్‌) ఒక ధర్మ సంకటంలో పడతాడు. కెనడా నుంచి వస్తున్న తన కూతురు (రాశీఖన్నా) సెక్యూరిటీ కల్పించడమెలా అనే విషయంపై! (కూతురికే సెక్యూరిటీ ఇవ్వలేని ఆయన రాష్ట్రానికి హోం మినిస్టర్‌. ఇది కొంచెం నాచురల్‌గా ఉంది).

అప్పుడు హీరోకి ఆ పని అప్పగిస్తాడు. దారిలో గంగిరెడ్డి మనుషులనుంచి ఆ అమ్మాయిని హీరో కాపాడుతాడు. మన అదృష్టం కొద్దీ ఈ గంగిరెడ్డి సినిమాలో లేడు, వుంటే ఇంకో పదినిముషాల నిడివి పెరిగుండేది. తరువాత రాశీఖన్నాకి ఒక కుర్రాడితో నిశ్చితార్ధం. కానీ ఆమె తన కెనడా తెలివినంతా ఉపయోగించి హీరోని మాత్రమే చేసుకుంటానంటుంది. ఆమె పుట్టిన రోజునాడు ఒక ఫంక్షన్‌ ఏర్పాటుచేసి దానికి ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించి తనకూతుర్ని రవితేజకిచ్చి పెళ్ళిచేస్తున్నట్టు హోంమంత్రి రావు రమేష్‌ ప్రకటిస్తాడు. దానికి హీరో ఒప్పుకోక తాను ముఖ్యమంత్రి కూతుర్ని ప్రేమిస్తున్నానని (వన్‌సైడ్‌ లవ్‌) ప్రకటిస్తాడు. దాంతో అందరూ షాక్‌. ఇంటర్వెల్‌.

సెకెండాఫ్‌లో ఏముంది మామూలే. ఇద్దరు హీరోయిన్లు హీరోని ప్రేమించడం, పాటలు పాడడం. ముఖ్యమంత్రితో హీరో ఢీకొనడం. చివరికి తాను ఇదంతా ఎందుకు చేసానో హీరో రివీల్‌ చేయడం. ఇలాంటి సినిమాలు అనేకం చూడ్డంవల్ల, ఇది కూడా చూసి తల విదిలించుకుని బయటకు రావడం.

రవితేజ కాస్త చిక్కినట్టు అనిపించినా ఎనర్జిటిక్‌గానే ఉన్నాడు. ఇలాంటి పాత్రలను ఒంటిచేత్తో లాగేస్తాడు. కానీ ఈ మూసనుంచి బయటికి రాకపోతే ఆయన చెప్పినట్టుగానే క్లైమేట్‌లాగా ప్రేక్షకుల్ని వణికిస్తాడు. తమన్నా, రాశీఖన్నాలు గ్లామరస్‌గా ఉన్నారు. నటించే అవకాశం లేదు కాబట్టి హీరోని ఆరాధనగా చూడ్డం తప్ప ఇంకేమి చేయలేకపోయారు. పృథ్వి, పోసాని కామెడి పరవాలేదు. సెకండాఫ్‌లో చాలామంది డైరెక్టర్లలా బ్రహ్మానందాన్ని సపోర్ట్‌ చేసుకుంటారని ప్రేక్షకులు అనుకున్నారు కానీ హీరోనే తానొక్కడై కథని మోశాడు. పాటలు పరవాలేదు.

ఇన్ని మైనస్‌ పాయింట్లున్నా, సినిమా మరీ బోర్‌ కొట్టకుండా ఉండడానికి కారణం డైరెక్టర్‌ సంపత్‌ నంది. కథని బిగువుగా నడపాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ప్రాసలు, పంచ్‌ల గోల వున్నా కొన్ని డైలాగులు బావున్నాయి. ఈ సినిమాలో పదేపదే ఒక డైలాగ్‌ వినిపిస్తుంది. తెలివైనవాడితో పెట్టుకోవద్దు అని. అయితే సినిమాలో హీరో కండబలమే తప్ప బుద్ధిబలం కనపడదు. ముఖ్యమంత్రిగా బొమన్‌ ఇరానీ నటించాడు. ఆ పాత్రలో కొత్తదనం లేకపోవడంవల్ల ఆయన నటన ఆకట్టుకోదు. (ఇలాంటి పాత్రలు ప్రకాష్‌రాజ్‌ ఎన్నోసార్లు వేసేశాడు). సినిమా ప్రారంభంలో ప్రియదర్శిని రామ్‌ ఒక పాత్రలో కనిపిస్తాడు, అదో విశేషం.

హీరోలు మానవతీత వ్యక్తుల్లా కాకుండా మామూలు మనుషుల్లా కనిపించనంత కాలం, వాళ్ళు శవాలపై కాకుండా నేలపై నడవనంతకాలం ఇలాంటి గాలి సినిమాలు వస్తూనే ఉంటాయి.

చివరన ఒక మాట దీనిక బెంగాల్‌టైగర్‌ అని ఎందుకు పెట్టారంటే సింహం తప్పు చేస్తే దాన్నిబెంగాల్‌ టైగర్‌ దారిన పెడుతుందట ( ఇది జంతు శాస్త్రజ్ఞులు తేల్చాల్సిన విషయం) అది బెంగాల్‌ టైగర్‌ గొప్పతనం. ఇంతకూ ఈసినిమా పులా? పులివేషమా?

– జి ఆర్‌. మహర్షి

Click to Read: Jr NTR too falls for ‘multi-millionaire’

Next Story