Telugu Global
Others

అమరావతికి తప్పని తాగునీటి కష్టాలు..

అమరావతి నిర్మాణం మొదలుకాకముందే అక్కడ ఏర్పడే నీటి కొరతను అంచనా వేసుకుని అధికారులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో రాజధాని అమరావతి తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు గణాంకాలు కూడా చూపుతున్నారు. రాజధానికి కృష్ణా నదీజలాలను 30 టీఎంసీల మేర తరలించాలని ప్రభుత్వం భావించింది. అయితే వాస్తవరూపంలో అది సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఇది చివరకు తెలంగాణ, ఏపీ మధ్య వివాదంలా మారే అవకాశం ఉందంటున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి […]

అమరావతికి తప్పని తాగునీటి కష్టాలు..
X

అమరావతి నిర్మాణం మొదలుకాకముందే అక్కడ ఏర్పడే నీటి కొరతను అంచనా వేసుకుని అధికారులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో రాజధాని అమరావతి తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు గణాంకాలు కూడా చూపుతున్నారు. రాజధానికి కృష్ణా నదీజలాలను 30 టీఎంసీల మేర తరలించాలని ప్రభుత్వం భావించింది. అయితే వాస్తవరూపంలో అది సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఇది చివరకు తెలంగాణ, ఏపీ మధ్య వివాదంలా మారే అవకాశం ఉందంటున్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి రాజధానికి నీరు తరలించాలన్నది ప్లాన్ . కానీ ఆ రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇప్పటికే దారుణంగా పడిపోయాయి. ప్రస్తుత అవసరాలకే ఈ రెండు రిజర్వాయర్లలోని నీరు సరిపోవడం లేదని అధికారులు ఇటీవల సీఎంకు నివేదిక అందజేశారు. 2016 జులై వరకు తాగు నీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం డ్యాం నుంచి 48. 37 టీఎంసీల నీరు అవసరం ఉంది. కానీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 35. 47 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాలకు ఉన్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక భవిష్యత్తులో అమరావతికి అదనంగా 30 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి తేగలమన్నది ప్రధాన ప్రశ్న.

ఇక అమరావతి పరిధిలోని భూగర్భజలాలను వాడుకున్నా పూర్తి స్థాయిలో నీటి ఎద్దడి తీర్చడం సాధ్యం కాదంటున్నారు. పైగా కోస్తా ప్రాంతంలో భూగర్భ పొరలు సముద్రపు ఉప్పు నీటితో నిండుతున్నాయని ఇటీవల సర్వేలో తేలింది. దీంతో భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో భూగర్భం నుంచి మంచినీరు దొరుకుతుందా అన్న దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రజలవనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అమరావతి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా బేసిన్ నుంచి మరో 30 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలంటూ కోరింది. అయితే ఇందుకు ఎగువ రాష్ట్రాలు, తెలంగాణ ఎంత వరకు అంగీకరిస్తాయన్నది అనుమానమే అంటున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా బేసిన్‌లో ప్రవాహం రానురాను తగ్గిపోతోంది.

First Published:  16 Nov 2015 8:17 AM GMT
Next Story