Telugu Global
Others

ఆంధ్రా బిజెపి-టిడీపీలో చిచ్చు

ఆంధ్రాలో తెలుగుదేశం,బిజెపీల మధ్య రాజకీయ విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్న బిజెపి ఇపుడు స్వరం పెంచింది. తెలుగుదేశం ప్రభుత్వంపైనా, పార్టీపైన నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఇరు పార్టీలు ఇపుడు నువ్వా…నేనా అన్నట్లువ్యవహరిస్తున్నాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరు పార్టీల సంబంధాలు ఇపుడు భగ్గుమంటున్నాయి. ఈ పరిణామాలు ఇరుపార్టీల అధినేతలకూ తలనొప్పిగా మారాయి. పార్టీపరమైన సంబంధాలు దెబ్బతినడమే కాకుండా,వ్యక్తిగతమైన ప్రతిష్టకు కూడా ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ముంచుకొచ్చినట్లు భావిస్తున్నారు. దీనివల్ల రాబోయే […]

ఆంధ్రా బిజెపి-టిడీపీలో చిచ్చు
X

ఆంధ్రాలో తెలుగుదేశం,బిజెపీల మధ్య రాజకీయ విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్న బిజెపి ఇపుడు స్వరం పెంచింది. తెలుగుదేశం ప్రభుత్వంపైనా, పార్టీపైన నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఇరు పార్టీలు ఇపుడు నువ్వా…నేనా అన్నట్లువ్యవహరిస్తున్నాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరు పార్టీల సంబంధాలు ఇపుడు భగ్గుమంటున్నాయి. ఈ పరిణామాలు ఇరుపార్టీల అధినేతలకూ తలనొప్పిగా మారాయి. పార్టీపరమైన సంబంధాలు దెబ్బతినడమే కాకుండా,వ్యక్తిగతమైన ప్రతిష్టకు కూడా ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ముంచుకొచ్చినట్లు భావిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇరుపార్టీల మధ్య మరింత అగాధం ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు.

గడచిన ఏన్నికల్లో అనుకోని రీతిలో మిత్రులుగా వ్యవహరించి,అటు కేంద్రంలోనూ,ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన బిజెపి,టిడీపీలు కొంతకాలం వరకూ మిత్రులుగానే ఉన్నారు.రోజులు మారుతున్న కొద్దీ ఇరువురి రాజకీయ అవసరాలు మారాయి. భవిష్యత్‌ రాజకీయ అవకాశాలు గుర్తించారు. దీంతో ఎవరి జెండా,అజెండాను వారు తిరిగి తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈనేపథ్యంలో ఆంధ్రాలోని ప్రతినియోజకవర్గంలోనూ వివాదాలు నెలకొంటున్నాయి. టిడీపీ,బిజెపి ల మధ్య ఇపుడు విభేదాలు లేని నియోజవర్గం అనేది లేకుండా పోయింది. మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేల స్థాయిలోని ఇరుపార్టీల నేతలు సైతం బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.ఒకరి వ్యక్తిగతమైన అంశాలను మరొకరు వేలెత్తి చూపించే స్థాయికి వెళ్లారు. గడచిన ఎన్నికల్లో పొత్తు అనవసరంగా పెట్టుకున్నామని ఇరుపార్టీల నేతలూ పునరాలోచనలో పడ్డారు.ప్రధాని మోడీ ప్రభావంతో రాబోయే రోజుల్లో తాము ప్రజామన్నన పొందడం అతిసాధారణమైన అంశమేనని బిజెపీ భావిస్తుంటే, జాతీయ పార్టీగా మారిన టీడీపీ వచ్చే ఎన్నికల సమయానికి మరింత బలపడుతుందని, ఈసారి ఎవరి పొత్తూ లేకుండానే ఎన్నికల బరిలోకి దిగి ప్రజామన్నన పొందుతామని దేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు పార్టీల మధ్య ఏస్థాయిలోనూ పొసగే పరిస్థితి లేదు.

వివాదానికి కారణం ఇదీ…
మిత్రులుగా ఉన్న బిజెపీ,టీడీపీల మధ్య నెలకొన్న వైరానికి ప్రధాన కారణం ఏమిటి? గడచిన ఎన్నికల్లో కలిసి పోటీచేసి తిరుగులేని మెజార్టీతో అధికారం చేపట్టిన ఇరు పార్టీలు ఇపుడు ఎందుకు బద్దవిరోధులుగా మారారు? అంటే ఎవరికి వారు ఆయా పార్టీల సొంతబలం వారు ఊహించిన దానికంటే అధికంగా ఉందనే వాదన విన్పిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి బలం బాగా పెరిగిందని, ప్రధాని మోడీ విధానాలను మెచ్చిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బిజెపిని బలపరుస్తారనే అంచనాకు వచ్చారు. ఇప్పటికే రెండు సార్లు రాష్ట్రంలోసర్వేచేయించుకున్న బిజెపీ రాబోయే మూడున్నరేళ్లలో తప్పకుండా ఆంధ్రాలో సొంతగా పోటీచేసి గెలుపొందే స్థాయికి వస్తామనే నమ్మకానికి వచ్చింది.అయితే దీన్ని ఏమాత్రం అంగీకరించే స్థితిలో టీడీపీ లేదు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉండేలా పునాదులు వేసుకుంటోన్న టీడీపీకి బిజెపీ రాష్ట్రంలో బలపడటం ఏమాత్రం ఇష్టంలేదు. అందుకే బిజెపి నాయకుల్ని,మంత్రులుగా ఉన్న వారిని సైతం దేశంనేతలు ఖాతరు చేసే స్థితిలో లేరు.బిజెపి బలపడకుండా అన్ని రకాల చర్యలూ వారుతీసుకుంటున్నారు. మరో వైపు బిజెపి కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు నేరుగా రాష్ట్రానికి రాకుండా,వచ్చే ప్రతి రూపాయిని మోడి ఖాతాలో జమవేసి,ప్రధాని ఇచ్చిన సహాయ సహకారాల వల్లనే రాష్ట్రంలో అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయనే ప్రచారం చేయడానికి సిద్దపడుతున్నారు. ఇరువర్గాలు కూడా భవిష్యత్‌రాజకీయావసరాల కోసం ఎవరి వ్యూహంలో వారు ముందుకు వెళుతున్నారు.

అధినేతలకు తలనొప్పి!
ఇరుపార్టీల నేతలు అనుక్షణం ఘర్షణ పడటం, నేరుగా విమర్శలుచేసుకోవడం ఆయా పార్టీల అధినేతలకు తీరని తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రిచంద్రబాబును కూడా బిజెపి నేతలు కలిసి వివరించారు. తెలుగుదేశం మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు తమ పార్టీని తీవ్రంగా దూషిస్తున్నారని,వారిని అదుపు చేయాలని వారు చంద్రబాబుకు సూచించారు. మరో వైపు బిజెపి నేతల్ని కూడా అదుపులో ఉంచాలని చంద్రబాబు సూచించారు. అయితే వీరి వివాదాలు ఇంతటితో ఆగేలా లేవు. ప్రత్యేకహోదా విషయంలో బిజెపి మాటతప్పిందని, అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయకుండా మట్టి,నీరు మాత్రమే ఇచ్చిన వెళ్లడం కూడా దేశం నేతలకు తీవ్ర అసహనంగా కలిగించింది. మరో వైపు రాష్ట్రంలో ఇపుడు తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, బిజెపితో అవసరమే లేదనే నమ్మకంతో ఉన్నారు. ఐతే ప్రజల్లో చంద్రబాబు గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోతాడని కొందరు బిజెపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
బిజెపి,టీడీపీల మధ్య వైరం పెరగడమే తప్ప తగ్గే అవకాశమే లేదని భావిస్తున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు కేంద్ర సహాయ,సహకారాలు అవసరమని, బిజెపితో వైరంపెట్టుకునే సాహసం ఆయన చేయరనే భావనతో బిజెపీనేతలు ఉన్నారు. అయితే టీడీపీ నేతల మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇరుపార్టీల మధ్య రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆయా పార్టీల నేతల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ఇది తీవ్ర పరిణామాలకే దారితీసే ప్రమాదం ఏర్పడనుంది.

First Published:  10 Nov 2015 8:01 PM GMT
Next Story